logo

గురువు కోసం గుండెలు కరిగేలా..

కొందరు ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకుంటూ విద్యాబుద్ధులు చెబుతుంటారు. ఇలాంటి వారు బదిలీపై వెళ్తుంటే చిన్నారులు కన్నీరు పెడుతుంటారు.

Updated : 03 Jul 2024 06:02 IST

మాసాయిపేట: కొందరు ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకుంటూ విద్యాబుద్ధులు చెబుతుంటారు. ఇలాంటి వారు బదిలీపై వెళ్తుంటే చిన్నారులు కన్నీరు పెడుతుంటారు. ఇలాంటి ఘటనే మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం చెట్లతిమ్మాయిపల్లి ప్రాథమీకోన్నత పాఠశాలలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో 11 ఏళ్ల పాటు పనిచేసిన ఉపాధ్యాయురాలు అరుణ సోమవారం బదిలీ అయ్యారు. మంగళవారం పాఠశాలకు రాగానే అరుణ చుట్టూ విద్యార్థినులు చేరి రోదించారు. రోదనలు విని గ్రామస్థులు వచ్చి వారూ కంటతడిపెట్టారు.


ఉపాధ్యాయుడిని ఊరేగించి

పన్నెండేళ్లుగా విద్యనందించిన ఉపాధ్యాయుడిని విద్యార్థులు మంగళవారం దు:ఖ సాగరంలో ఊరేగింపుగా వీడ్కోలు పలికారు. శివంపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశం తూప్రాన్‌ మండలం నర్సంపల్లికి బదిలీ అయ్యారు. మంగళవారం రిలీవ్‌ కావడంతో పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేసి వందలాది మంది విద్యార్థులు ఆయనను సన్మానించి బ్యాండ్‌ శబ్దాలతో ఊరేగింపుగా సాగనంపారు. వ్యాయామ ఉపాధ్యాయుడిగానూ సేవలందించి విద్యార్థులను క్రమశిక్షణగా ఉంచేవారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలచంద్రం అన్నారు.

న్యూస్‌టుడే, శివ్వంపేట


సార్‌ మీరు వెళ్లొద్దు

బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడిని అడ్డుకుంటున్న విద్యార్థులు

రాయపోల్, న్యూస్‌టుడే: మండలంలోని వడ్డేపల్లి ఉన్నత పాఠశాలలో ఆరేళ్లుగా విధులు నిర్వహించిన తెలుగు ఉపాధ్యాయుడు ఎన్‌.శ్రీనివాస్‌ అక్కన్నపేట మండలం మోత్కులపల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. మంగళవారం పాఠశాల నుంచి రిలీవ్‌ అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీనివాస్‌ చుట్టూ చేరి సారూ మీరు వెళ్లొద్దంటూ కంటతడి పెట్టుకున్నారు. విద్యార్థుల రోదనలతో ఉపాధ్యాయుడు సైతం భావోద్వేగానికి గురయ్యారు. విద్యార్థులకు మంచి విషయాలు బోధించడంతో పాటు, పాఠశాల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని గ్రామస్థులు కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు