logo

పోలీస్‌ స్టేషన్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం

దాయాదుల మధ్య భూవివాదానికి సంబంధించి తనతోపాటు భర్త, కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారని మనస్తాపంతో ఓ మహిళ సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. సిద్దిపేట జిల్లా ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

Published : 03 Jul 2024 01:48 IST

చికిత్స పొందుతున్న కవిత, ఆమె పక్కన భర్త భీంరెడ్డి

దుబ్బాక, న్యూస్‌టుడే: దాయాదుల మధ్య భూవివాదానికి సంబంధించి తనతోపాటు భర్త, కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారని మనస్తాపంతో ఓ మహిళ సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. సిద్దిపేట జిల్లా ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. దుబ్బాక మండలం రఘోత్తంపల్లికి చెందిన సింగిరెడ్డి భీంరెడ్డికి భార్య కవిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. భీంరెడ్డికి, వారి నలుగురు అన్నాదమ్ముళ్ల మధ్య వారసత్వ ఆస్తి రెండెకరాల భూమి సంబంధించి 18 ఏళ్ల నుంచి వివాదం కొనసాగుతోంది. పెద్దమనుషుల మధ్య పంచాయితీలు జరిగినా వివాదం ముగియలేదు. గత నెలలో వివాదాస్పద భూమిలో భీంరెడ్డి దున్నారు. ఇరుపక్షాల మధ్య కొట్లాట జరిగింది. గత నెలలో భీంరెడ్డి ఫిర్యాదు చేయగా అన్న సాయిరెడ్డిపై కేసు పెట్టారు. ఈ నెల 1న అన్న ఫిర్యాదు చేయగా భీంరెడ్డి, కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. కవిత భర్తతో కలిసి ఠాణాకు వచ్చి ఎందుకు కేసు పెట్టారని ప్రశ్నించగా పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు సమాధానమిచ్చారు. అక్రమంగా కేసు పెట్టారని ఆరోపిస్తూ ఆమె తన వెంట తెచ్చుకున్న ఎలుకల మందును తిన్నారు. గమనించిన భర్త, పోలీసులు అక్కడి నుంచి ఆటోలో చికిత్సకు తరలించారు. దీనిపై ఎస్సై గంగరాజు మాట్లాడుతూ.. గతంలో కుటుంబ సభ్యులు గొడవ పడి పరస్పరం ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పరిశీలించి కేసు నమోదు చేశామని చెప్పారు చట్టప్రకారం ముందుకెళతామని తెలిపారు.


దేవాలయంలో ఆభరణాల చోరీ

చోరీకి పాల్పడుతూ.. సీసీ కెమెరాకు చిక్కిన దొంగలు

టేక్మాల్, న్యూస్‌టుడే: ఆలయంలోని దేవతామూర్తుల ఆభరణాలు చోరీకి గురైన సంఘటన టేక్మాల్‌ మండల పరిధిలోని బొడ్మట్‌పల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. బొడ్మట్‌పల్లిలోని గుట్టపై వెలసిన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ముగ్గురు వ్యక్తులు ఆలయ గ్రిల్‌ను తొలగించి స్వామి వారి వెండి కళ్లు, మీసాలు, పట్టీలు దొంగిలించారు. ఇనుప త్రిషూలంతో హుండీ తెరిచేందుకు విఫలయత్నం చేశారు. భద్రకాళి దేవాలయంలో అమ్మవారి బంగారు మంగళసూత్రం, వెండి ముక్కుపోగు, కళ్లు, బొట్ట్టు చోరీ చేశారు. దేవాలయంలోని కొన్ని సీసీ కెమెరాల వైర్లు తొలగించారు. మరికొన్నింటిలో చోరీ దృశ్యాలు నమోదయ్యాయి. టేక్మాల్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు.


ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధురాలు..

బీరవ్వ

మిరుదొడ్డి: కాలకృత్యాలు తీర్చుకోవడానికి చెరువు వద్దకు వెళ్లిన వృద్ధురాలు ప్రమాదవశాత్తు అందులో పడిపోయి మృత్యువాత పడింది. ఎస్‌ఐ పరశురాం తెలిపిన వివరాలు.. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాసులాబాద్‌ గ్రామానికి చెందిన బీరవ్వ (90) కాలుజారి చెరువులో పడి మృతి చెందింది. ఇంటికి ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. చివరకు చెరువులో వెతకగా మృతదేహం లభ్యమైంది. కుమారుడు ఆశయ్య ఫిర్యాదుతో కేసు నమోదైంది.


ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడి మృతి

వికారాబాద్, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం (బైక్‌) అదుపు తప్పి చెట్టుకు ఢీ కొని ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన వికారాబాద్‌ మండలం పుల్‌మద్ది గేటు సమీపంలో మంగళవారం రాత్రి జరిగింది. వికారాబాద్‌ సీఐ నాగరాజు తెలిపిన వివరాలు.. వికారాబాద్‌ మండలం ఎర్రవల్లికి చెందిన సొప్పరి తరుణ్‌కుమార్‌ (21) పని నిమిత్తం వికారాబాద్‌ పట్టణానికి వచ్చాడు. అక్కడి నుంచి తన స్నేహితుడిని బైక్‌పై ఎక్కించుకొని నవాబుపేట మండలం కుమ్మరిగూడెంలో దింపి సొంత గ్రామానికి తిరుగు పయనమయ్యాడు. మార్గమధ్యలో బైక్‌ అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టుకు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి సుదర్శన్‌ ఫిర్యాదు మేరకు భారత శిక్షాస్మృతి (ఐపీసీ)సెక్షన్‌ 174 ప్రకారం కాకుండా, ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టం భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) సెక్షన్‌ 106(1) కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఇది జిల్లాలో కొత్త చట్టం కింద నమోదైన తొలి కేసు కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని