logo

కస్తూర్బా బాలికలకు కష్టాలు!

బాలికల విద్య కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బాగాంధీ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. బాలికల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయినులు లేరు. కొత్తగా మంజూరైన వాటికి భవనాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Updated : 01 Jul 2024 06:10 IST

వేధిస్తున్న ఉపాధ్యాయినుల కొరత
కరవైన వసతులు

శివ్వంపేట మండలం గూడూరు కస్తూర్బాలోని తరగతి గదిలో బాలికలు

న్యూస్‌టుడే-మెదక్, చేగుంట, శివ్వంపేట, వెల్దుర్తి : బాలికల విద్య కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బాగాంధీ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. బాలికల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయినులు లేరు. కొత్తగా మంజూరైన వాటికి భవనాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భవనాలు ఉన్నవాటిల్లోనూ పలు సమస్యలు వేధిస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

జిల్లాలో 21 మండలాలకు గాను 15 మండలాల్లో కస్తూర్బాలు ఉన్నాయి. వీటితో పాటు నాలుగేళ్ల కిందట నిజాంపేట, హవేలిఘనపూర్, నార్సింగి, మాసాయిపేట మండలాలకు కొత్తవి మంజూరయ్యాయి. దీంతో వీటి సంఖ్య 19కు చేరుకుంది. 4,022 మంది విద్యార్థినులు ఉన్నారు.

ఇరుకు గదుల్లో ఇక్కట్లు..

కొత్తగా మంజూరైన మాసాయిపేట పాఠశాల వెల్దుర్తిలో, హవేలిఘనపూర్‌ది చిన్నశంకరంపేటలో, నిజాంపేటది రామాయంపేటలో, నార్సింగి పాఠశాల శివ్వంపేట మండలం గూడూరులో కొనసాగుతున్నాయి. ఆరో తరగతి నుంచి ప్రవేశాలు కల్పించడంతో మొదట్లో చేరిన విద్యార్థినులు ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ప్రతి తరగతిలో 40 మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో మరో పాఠశాలకు చెందిన విద్యార్థులు చేరడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్తగా మంజూరైన వాటికి ఉపాధ్యాయినులు, సిబ్బందిని కేటాయించలేదు. దీంతో అదే బడుల్లో ఉన్నవారే పాఠాలు బోధిస్తున్నారు. ఒక తరగతి గదిలో రెండు పాఠశాలలకు సంబంధించి 80 మందికిపైగా ఉంటున్నారు. దీంతో చిన్న గదిలో ఎక్కువ మంది కూర్చోవడం వల్ల అవస్థలు పడుతున్నారు. పాఠాలు బోధించినా అర్థం కాని పరిస్థితి. ఇక పరీక్షల సమయంలో రెండు పాఠశాలల విద్యార్థుల జవాబుపత్రాలను దిద్దేందుకు ఉపాధ్యాయినులపై భారం పడుతోంది. ఇక వసతి విషయానికొస్తే తరగతి గదుల్లోనే నిద్రిస్తున్నారు. ఇవి ఏమాత్రం సరిపడక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. శౌచాలయాలు, మూత్రశాలలు సరిపోవడం లేదు.

ఎట్టకేలకు అవకాశం...

నాలుగేళ్ల కిందట మంజూరైన పాఠశాలలను ఈ ఏడాది నుంచి అద్దె భవనాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చాయి. బాలికల పాఠశాల కావడంతో వారి భద్రతను దృష్టిలో పెట్టుకోవాలి. ఇటీవల మాసాయిపేటలో ఓ అద్దె భవనాన్ని పరిశీలించారు. ఇక్కడా భద్రతాపరంగా అనుకూలంగా లేకపోవడంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని పాత భవనంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక్కడా కనీస సౌకర్యాలు కల్పించాకే వెల్దుర్తి నుంచి ఇక్కడికిమార్చనున్నారు. ఇక నార్సింగి పాఠశాలకు సంబంధించి ఈ విద్యాసంవత్సరంలో ఆరో తరగతిని చేగుంటలోని ఆదర్శ స్కూల్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిజాంపేట, హవేలిఘనపూర్‌లో భవనాలను ఎంపిక చేయాల్సి ఉంది. 

వసతులున్న వాటినే ఎంపిక చేస్తాం

సుకన్య, జీసీడీవో

అద్దె భవనాల ఎంపిక కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాం. అన్నీ వసతులు ఉన్న వాటినే పరిశీలిస్తున్నాం. సౌకర్యంగా లేదంటే పాతచోటనే కొనసాగిస్తాం. ప్రవేశాలు మాత్రం చేపడుతున్నాం. ప్రస్తుతం ఉన్న చోటే కాకుండా సొంత మండలంలో పాఠశాలను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం బోధన సిబ్బందిని కేటాయించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని