logo

పశు వైద్యం.. గగనం

పశు వైద్యుల పోస్టులు కొన్నేళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు. సిబ్బంది కొరత కారణంగా జిల్లాలోని 21 మండలాల్లోని పశువులకు సరైన సమయంలో వైద్యం అందక కర్షకులు ఇబ్బందులు పడుతున్నారు.

Published : 01 Jul 2024 01:28 IST

జిల్లా వ్యాప్తంగా సిబ్బంది లేక ఇబ్బందులు
గ్రామీణ ప్రాంతాల్లో అందని సేవలు
 

మూసాపేటలో మూతబడిన పశువైద్యశాల 

న్యూస్‌టుడే, పెద్దశంకరంపేట: పశు వైద్యుల పోస్టులు కొన్నేళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు. సిబ్బంది కొరత కారణంగా జిల్లాలోని 21 మండలాల్లోని పశువులకు సరైన సమయంలో వైద్యం అందక కర్షకులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మృత్యువాత పడుతున్నాయి. నట్టల నివారణ, గాలికుంటు శిబిరాలు, కృత్రిమ గర్భదారణ వంటి కార్యక్రమాలు గ్రామాల్లో నిర్వహించినపుడు సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ప్రైవేటే దిక్కు.. జిల్లాలో పశువులు 2.80 లక్షలు, గొర్రెలు 6.35 లక్షలు, మేకలు 1.92 లక్షలు, ఇతర 3.95 లక్షల వరకు ఉన్నట్లు అధికారుల లెక్క. గ్రామీణ పశువైద్యశాలలను ప్రాథమిక వైద్యశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసినా అందుకు తగ్గట్లు సిబ్బంది నియామకాలు లేవు. జిల్లాకు రెండు సంచార వాహనాలను కేటాయించగా.. వాటి ద్వారా పూర్తి స్థాయి సేవలు అందడం లేదని పశుపోషకులు వాపోతున్నారు. దీంతో డబ్బులు వెచ్చించి ప్రైవేటుగా వైద్యం చేయిస్తున్నామని వాపోతున్నారు. పశువుల పెంపకంలో ఎదురయ్యే ఇబ్బందులపై పోషకులకు సరైన సలహాలు అందడం లేదు. జీవాలకు అందజేయాల్సిన మేత, అవసరమైన మందులు వంటి విషయాలపై అవగాహన కరవైంది.

పోస్టులు ఖాళీ.. జిల్లా పశువైద్యశాఖకు కేటాయించిన పోస్టులు మొత్తం 154 ఉండగా 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా శస్త్రచికిత్సలు నిర్వహించే వైద్యులకు సంబంధించి 12 పోస్టులు ఖాళీగా ఉండటం సమస్యగా మారింది. దీంతో చాలా కేంద్రాలు మూతపడ్డాయి. ప్రభుత్వం పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వైద్య సేవలు దూరమవుతున్నాయి. 

ప్రతిపాదనలు పంపాం

విజయశేఖర్‌రెడ్డి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి

జిల్లాలో పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటి భర్తీకి గతంలోనే ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం నియామకాలు చేపడితే ఖాళీల భర్తీకి అవకాశం ఏర్పడుతుంది. ఉన్న సిబ్బందితో ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని