logo

వైద్య నారాయణులు.. సేవల్లో ప్రథములు

అంకితభావంతో సేవలు అందిస్తూ.. ఆత్మీయ పలకరింపుతో భరోసా ఇచ్చే వైద్యులను కనిపించే దైవంగా రోగులు భావిస్తారు. వెంటనే స్పందించే తీరు కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి గట్టెక్కిస్తుంది.

Updated : 01 Jul 2024 02:31 IST

అంకితభావంతో సేవలు అందిస్తూ.. ఆత్మీయ పలకరింపుతో భరోసా ఇచ్చే వైద్యులను కనిపించే దైవంగా రోగులు భావిస్తారు. వెంటనే స్పందించే తీరు కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి గట్టెక్కిస్తుంది. మరికొందరు వృత్తిపరమైన సేవతో పాటు సామాజికంగా ఇతరులకు సహకారం అందిస్తుంటారు. తోచినంత సాయం చేస్తూ.. ఆరోగ్య పాఠాలు చెప్పేవారు అనేకం. ఎంతో మంది వైద్యులు ప్రజల మన్ననలు పొంది వృత్తికి వన్నె తెస్తున్నవారు ఉమ్మడి మెదక్, వికారాబాద్‌ జిల్లాల్లో కొందరు ఉన్నారు. నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.. 

శతశాతం.. పురస్కార పథం

న్యూస్‌టుడే, సిద్దిపేట: సిద్దిపేటలోని నాసర్‌పురా యూపీహెచ్‌సీ వైద్యాధికారి డా.జి.శ్రీకాంత్‌.. ఐదేళ్లుగా సేవలు కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే కాయకల్ప పురస్కారాన్ని మూడేళ్లు వరుసగా అందుకోవడం విశేషం. రోజులో ఇక్కడ 100 మందికి ఓపీ సేవలు అందుతున్నాయి. రోగ నిర్ధారణ పరీక్షల్లో ప్రతిసారి ప్రత్యేకతను చాటుతోంది. 16 ఏళ్ల లోపు బాలలకు టీకాలను పంపిణీ చేస్తున్నారు. లక్ష్యంలో వంద శాతాన్ని అధిగమిస్తున్న ఆసుపత్రిగా గుర్తించారు. నెలలో దాదాపు 350 మంది గర్భిణులకు పరీక్షలు చేస్తున్నారు. మందులు పంపిణీ చేస్తున్నారు. మొత్తం 30 మంది ఆరోగ్య సిబ్బంది పని చేస్తున్నారు. ఉదయం 9 నుంచి 4 గంటల వరకు ఈ ఆసుపత్రి తెరిచి ఉంటోంది. గతంలో గర్భిణులకు పరీక్షల నిమిత్తం అంగన్‌వాడీ కేంద్రాలకు వైద్య సిబ్బంది నేరుగా వెళ్లే వారు. ఏటా వివిధ రకాల సేవలతో ప్రత్యేకతను చాటుతున్నారు.

శ్రీకాంత్, సిద్దిపేట నాసర్‌పురా వైద్యాధికారి

తితిదేకు రూ.కోటి స్థలం

న్యూస్‌టుడే, చేగుంట: ప్రైవేటు వైద్యులందరూ వ్యాపారదృక్పథంతో ఉండరు. కొందరు సమాజ సేవలో తరిస్తారు. మెదక్‌ జిల్లా నార్సింగికి చెందిన డాక్టర్‌ టీవీపీ చారి.. తిరుమల తిరుపతి దేవస్ధానం (తితిదే) కల్యాణ మండపానికి జాతీయ రహదారి పక్కనే ఉన్న రూ.కోటి విలువైన ఎకరం స్థలాన్ని కొన్నేళ్ల క్రితం దానం చేశారు. గ్రామస్థుల కోరిక మేరకు ఆ స్థలాన్ని తితిదేకు రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చారు. ఆయన అంతవిలువైన స్థలం ఇచ్చినా నేటికీ కల్యాణ మండపం నిర్మించలేదు. ఆయన లయన్స్‌ క్లబ్‌లో జిల్లా గవర్నర్‌ స్థాయిలో సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుమారులు కూడా వైద్యులే. నార్సింగి గ్రామాభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తున్నారు.

క్లిష్టమైన ప్రసవాలకు భరోసా

సంగారెడ్డి అర్బన్, న్యూస్‌టుడే: గర్భిణులు కొందరికి ప్రసవ సమయంలో క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. కొందరు డాక్టర్లు హైదరాబాద్‌కు సిఫారసు చేయడం చూస్తుంటాం. ప్రసవమైనా, గర్భాశయాల సమస్యలైనా సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలోని వైద్యురాలు ఎం.నాగలక్ష్మి మాత్రం వారికి పూర్తి భరోసా ఇచ్చి నైపుణ్యంగా చికిత్స చేసి మహిళలకు సాంత్వన కలిగిస్తూ గుర్తింపు పొందారు. జిల్లాలో ఎక్కడైనా నాగలక్ష్మి మేడమ్‌ హస్తవాసిపై మహిళలకు అపారమైన భరోసా ఉంటోంది. ముఖ్యంగా ఆమె మాట్లాడగానే సగం బాధ తగ్గినట్టుంటుందని ఆస్పత్రికి వచ్చేవారు చెబుతుంటారు. 1999లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌గా నాగలక్ష్మి నియమితులయ్యారు. హైదరాబాద్, వరంగల్‌లో పనిచేశారు.2022లో సంగారెడ్డికి వచ్చారు. ఆమె ప్రస్తుతం ఫ్రొఫెసర్‌ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. గర్భిణులకు నెలల ముందు నుంచే జాగ్రత్తలు పాటించేలా చూడటం ఈమె ప్రత్యేకత.సాధారణ ప్రసవం విజయవంతమయ్యేలా చేస్తారు.

కుటుంబమంతా ఒకటే వృత్తి

వికారాబాద్‌ కలెక్టరేట్‌: వికారాబాద్‌ జిల్లా డాక్టర్‌ రవీందర్‌యాదవ్‌.. వైద్య రంగంలోనే ఉన్న అమ్మానాన్నల ప్రోత్సాహంతో అదే వృత్తిని చేపట్టారు. కొడంగల్‌కు చెందిన ఆయన తండ్రి దస్తప్ప.. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తాండూరులో ఫార్మసిస్టుగా పదవీ విరమణ పొందారు. తల్లి జయలక్ష్మి ఆర్‌ఏంపీ. రవీందర్‌ రెండేళ్లక్రితం జిల్లా ఉప వైద్యాధికారిగా బాధ్యతలను స్వీకరించారు. క్షయ, కుష్టు, సీజనల్‌ వ్యాధుల నివారణ ప్రోగ్రాం అధికారిగా బాధ్యతలు చేపట్టారు. టీహబ్, బ్లడ్‌ బ్యాంక్‌ కేంద్రం ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. విధినిర్వహణలో నిక్కచ్కిగా ఉండటం.. సిబ్బంది స్పందించేలా చూడటం వీరి ప్రత్యేకత. వీరి పిల్లలు ఇద్దరూ వైద్య విద్యనే అభ్యసిస్తున్నారు. భార్య కొడంగల్‌ మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా, మరోవైపు డాక్టర్‌గా ప్రజలకు సేవలందిస్తున్నారు. 

జిల్లాలోని వివిధ విభాగాల్లో ప్రభుత్వ వైద్యులు
సిద్దిపేట 396
సంగారెడ్డి 340
మెదక్‌ 98
వికారాబాద్‌  196 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని