logo

తపాలా శాఖ.. సొంతంగా సమకూర్చుకోక..

తపాలా కార్యాలయాలను బ్యాంకుల మాదిరి అన్నిరకాలుగా అభివృద్ధి పరుస్తున్నారు. గ్రామస్థాయిలో సేవలు చొచ్చుకుపోవడంతో ఇంటికో ఖాతాదారైనా తప్పక ఉంటారు. బ్రాంచి కార్యాలయాల్లోనే లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి.

Updated : 01 Jul 2024 02:33 IST

తపాలా కార్యాలయాలను బ్యాంకుల మాదిరి అన్నిరకాలుగా అభివృద్ధి పరుస్తున్నారు. గ్రామస్థాయిలో సేవలు చొచ్చుకుపోవడంతో ఇంటికో ఖాతాదారైనా తప్పక ఉంటారు. బ్రాంచి కార్యాలయాల్లోనే లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. సబ్‌ డివిజన్‌ కార్యాలయాల్లో ప్రతి నెల కోట్ల రూపాయల వ్యవహారాలు చేపడుతున్నారు. ఇంతటి విస్తృతి ఉన్నప్పటికీ సబ్‌ డివిజన్‌ కార్యాలయాలు దాదాపు అద్దె భవనాల్లో కునారిల్లుతున్నాయి. కొన్నిచోట్ల సొంత స్థలాలు ఉన్నప్పటికీ నిధులు మంజూరు కాకపోవటంతో ఏళ్ల తరబడి భవన నిర్మాణాలు చేపట్టడం లేదు. స్థలాలను ఆక్రమణల నుంచి కాపాడుకోవటానికి సిబ్బంది నానాతంటాలు పడుతున్నారు. వినియోగదారులు, సిబ్బంది సౌకర్యానికి స్థలాల్లో భవనాలు నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

అద్దెల భారం.. అరకొర వసతి

మెదక్‌ టౌన్, సిద్దిపేట అర్బన్, న్యూస్‌టుడే: మెదక్‌ డివిజన్‌ పరిధిలో మొత్తం 11 చోట్ల తపాలా శాఖకు సంబంధించిన స్థిరాస్తులు ఉన్నాయి. మెదక్‌ పట్టణంలోని డివిజన్‌ కార్యాలయంతో పాటు ఉద్యోగుల నివాస సముదాయంలోని 12 గృహాలు, సిద్దిపేట ప్రధాన కార్యాలయంతో పాటు రెండు చోట్ల ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటితో పాటు దుబ్బాకలో పక్కా భవనం, గత ఏడాది నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చిన చేగుంట మండలంలోని మక్కరాజ్‌పేట, రామాయంపేటలో పక్కా భవనాలు ఉన్నాయి. సిద్దిపేట, చేగుంట, తూప్రాన్, టేక్మాల్‌ తదితర ప్రాంతాల్లో విలువైన స్థలాలు ఉన్నాయి. వీటిలో పక్కా భవనాల నిర్మాణాలు చేపట్టి అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు పట్టించుకోవటంలేదు. ప్రతి నెల ఆ ప్రాంతాల్లో భవనాలకు అద్దెలు చెల్లించాల్సి వస్తోంది. అద్దెల భారం పడటమే కాకుండా ఆయా భవనాల్లో సరైన సదుపాయాలు లేవు. వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.

సిద్దిపేటలో స్థలానికి ప్రహరీ ఏర్పాటు

నిర్మాణానికి నిధుల లేమి

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి డివిజన్‌లో సంగారెడ్డి, జహీరాబాద్, రామచంద్రాపురంలలో తపాలా కార్యాలయాలు ఉన్నాయి. సంగారెడ్డి పట్టణంలోని బైపాస్‌ రహదారిలో రెండు ఎకరాల స్థలాన్ని తపాలా శాఖకు 15 సంవత్సరాల క్రితం కేటాయించారు. ఈ స్థలంలో నిర్మాణాలు ఏవీ చేయకపోవడంతో మున్సిపల్‌ అధికారులు కూరగాయల మార్కెట్‌కు కేటాయించారు. అక్కడ ఉన్న తపాలా శాఖ బోర్డులను తొలగించారు. సదాశివపేట పట్టణంలోని గాంధీ చౌక్‌ వద్ద స్థలాన్ని కార్యాలయానికి కేటాయించినా అది నిరుపయోగంగానే ఉంటోంది. భవనం నిర్మించేందుకు నిధులు కేటాయించాలని వినియోగదారులు కోరుతున్నారు. మిగతా చోట్ల అన్ని పోస్టాఫీసులు అద్దె భవనాల్లో ఉండటంతో అరకొర వసతులతో సిబ్బంది, వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. 

కూరగాయల మార్కెట్‌కు కేటాయించిన సంగారెడ్డి తపాలా శాఖ స్థలం

 

ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపిస్తాం

మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలో ఉన్న తపాలా శాఖకు సంబంధించిన ఖాళీ స్థలాలు మా సంరక్షణలో ఉన్నాయి. ఆక్రమణాలకు గురికాకుండా కొన్ని చోట్ల ప్రహరీ నిర్మాణాలు చేపట్టాం. గత సంవత్సరమే రెండు ప్రాంతాల్లో పక్కా భవనాలు నిర్మించాం. మెదక్‌లోని నివాస సముదాయంలోని గదుల మరమ్మతులకు రూ.20 లక్షలు మంజూరయ్యాయి. సొంత స్థలాలు ఉన్న ప్రాంతాల్లో భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులు పంపిస్తాం.

శ్రీహరి, పర్యవేక్షకుడు, మెదక్‌ డివిజన్‌ తపాలా కార్యాలయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని