logo

భక్తుడిపై దాడి

కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి వచ్చిన భక్తుడిపై స్థానిక యువకులు దాడి చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. బాధితుడు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగు చూసింది.

Published : 01 Jul 2024 01:10 IST

గంజాయి మత్తులో కొట్టినట్టుగా అనుమానం 

కరుణాకర్‌

చేర్యాల, న్యూస్‌టుడే: కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి వచ్చిన భక్తుడిపై స్థానిక యువకులు దాడి చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. బాధితుడు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌ అల్వాల్‌కి చెందిన కరుణాకర్‌ తన మిత్రులతో కలిసి శనివారం సాయంత్రం కొమురవెల్లికి చేరుకున్నారు. అర్ధరాత్రి 12.30 గంటలకు ఆలయం వద్ద కరుణాకర్‌తో పాటు స్థానిక యువకులు గొడవ పడ్డారు. పరస్పరం దూషించుకోగా ఇనుప రాడ్లతో కొట్టుకున్నారు. దాడిలో హైదరాబాద్‌కి చెందిన కరుణాకర్‌ తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రుడిని అదే రాత్రి 108 అంబులెన్స్‌లో సిద్దిపేట ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. యువకులు గంజాయి మత్తులోనే గొడవ పడ్డారని, వారి వద్ద ప్యాకెట్లు కూడా లభించాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారని, ఈ క్రమంలోనే కొమురవెల్లిలో గంజాయి అమ్మకాలు, వినియోగం ఈ మధ్య ఎక్కువైందని స్థానికులు అంటున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే మాదకద్రవ్యాల అమ్మకాలు సాగుతున్నాయని, పలుమార్లు సమాచారం ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందని పలువురు యువకులు వాపోతున్నారు. స్థానిక యువకుడు గణేశ్‌.. గొడవ జరుగుతుండగా నిందితులను అడ్డుకునే యత్నం చేయగా ఆయనను నెట్టేశారు. గణేశ్‌ చేతికి గాయాలయ్యాయి. ఈ విషయమై చేర్యాల సీఐ ఎల్‌.శ్రీను మాట్లాడుతూ మద్యం మత్తులోనే ఘర్షణ జరిగిందని తెలిపారు. బాధితుడు కరుణాకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొమురవెల్లికి చెందిన ఎస్‌.నవీన్, శ్రీకాంత్, వినయ్, శివమణి, డి.నవీన్, పి.పవన్, ఆర్‌.రాజుపై హత్యాయత్నం కేసు నమోదైనట్లు, విచారణ కొనసాగుతోందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని