logo

సమగ్ర ప్రగతికి సమష్టి కృషి

‘ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇక పాలనపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. జిల్లా అన్ని రంగాల్లో ముందుండేలా చూస్తున్నాం. సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నాం.

Published : 01 Jul 2024 01:03 IST

‘న్యూస్‌టుడే’తో జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతి 

‘ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇక పాలనపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. జిల్లా అన్ని రంగాల్లో ముందుండేలా చూస్తున్నాం. సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నాం. కలెక్టరేట్‌లో అధికారులు సమయపాలన పాటించేలా బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తున్నాం. అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు పెంచుతాం. తద్వారా ప్రజా   సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు వీలుంటుందని..’ జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. కలెక్టర్‌తో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించిది. వివరాలు ఇలా..

ప్రభుత్వ భూముల రక్షణ

జిల్లాలో ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించాం. ప్రభుత్వ భూముల్లో సూచికలు, కంచెలు ఏర్పాటు చేయాలని సూచించాం. రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని, ఒక్క గుంట కూడా కబ్జా కాకుండా చూడాలని ఉత్తర్వులిచ్చాం. ప్రభుత్వ భూములకు సంబంధించిన కబ్జాలపై సమాచారం వచ్చిన వెంటనే సంబంధిత అధికారులతో విచారణ చేయిస్తున్నాం.

‘ధరణి’ దరఖాస్తులపై రోజువారీ సమీక్ష

ధరణి పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఆర్డీవోలు, తహసీల్దార్లకు రోజువారీ లక్ష్యాలను నిర్దేశించాం. దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన చేయిస్తున్నాం. పెండింగ్‌ దరఖాస్తులపై నిత్యం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నాం. అనర్హత గల దరఖాస్తులను తిరస్కరిస్తున్నాం. దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు తప్పవు.

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం

వర్షాకాలం కావడంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించాం. మున్సిపాలిటీ కమిషనర్లను అప్రమత్తం చేశాం. నీటి నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడంతోపాటు దోమల నివారణకు ఆయిల్‌ బాల్స్‌ సిద్ధం చేయమని సూచించాం.

పర్యాటకాభివృద్ధి దిశగా

సంగారెడ్డి మండలం కల్పగూరు శివారులోని మంజీరను పర్యాటకపరంగా అభివృద్ధి చేసే దిశగా ముందుకుసాగుతున్నాం. ఎకో టూరిజం విభాగం ఆధ్వర్యంలో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. సందర్శకులు రాత్రి  సమయంలోనూ ఇక్కడ విడిది చేసేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మంజీరకు రాంసర్‌ సైట్‌ జాబితాలో చోటు దక్కితే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధ్యమవుతుంది. 

విద్యా సంస్థల్లో సదుపాయాల మెరుగుకు..

ప్రభుత్వ విద్యా సంస్థల్లో సదుపాయాల మెరుగుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. పాఠశాలల్లో అభివృద్ధి పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయి. కార్పొరేట్‌ సామాజిక (సీఎస్‌ఆర్‌) కింద పరిశ్రమల సహకారంతో జిల్లాలోని కస్తూర్బా, వసతి గృహాలు, ఆదర్శ పాఠశాలల్లో కనీస సదుపాయాల కల్పనకు కార్యాచరణ రూపొందించాం. సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రహరీ నిర్మాణానికి నిధులు కేటాయించాం. 

ప్రజావాణి మరింత జవాబుదారీగా..

కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇక్కడికి వచ్చి అర్జీలు ఇచ్చిన వారందరికీ న్యాయం జరిగేలా చూస్తున్నాం. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్ని శాఖల అధికారుల్ని ఆదేశించాం. అర్జీదారులకు తమ దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేలా చరవాణికి సందేశం పంపేందుకు ఏర్పాట్లు చేస్తాం. అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచుతాం. 

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని