logo

నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?

రాష్ట్రంలోని వికారాబాద్‌-సంగారెడ్డి-కర్ణాటకలోని బీదర్‌ పట్టణాల మధ్య రహదారి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆరు రోజుల క్రితం దిల్లీలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర పురోగతితో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలతో మెరుగైన రవాణాకు దోహదపడే రహదారులను పూర్తి చేయాలని కోరారు.

Published : 01 Jul 2024 01:00 IST

అందుబాటులోకి తెస్తే సాఫీగా అంతర్రాష్ట్ర రాకపోకలు

జహీరాబాద్‌ సమీపంలో బీదర్‌ సరిహద్దు

న్యూస్‌టుడే, జహీరాబాద్, తాండూరు: రాష్ట్రంలోని వికారాబాద్‌-సంగారెడ్డి-కర్ణాటకలోని బీదర్‌ పట్టణాల మధ్య రహదారి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆరు రోజుల క్రితం దిల్లీలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర పురోగతితో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలతో మెరుగైన రవాణాకు దోహదపడే రహదారులను పూర్తి చేయాలని కోరారు. ఇందులో భాగంగా జాతీయ రహదారులుగా విస్తరించాల్సిన రాష్ట్ర రహదారుల జాబితాలో వికారాబాద్‌ జిల్లా పరిధిలోని మన్నెగూడ-వికారాబాద్‌-తాండూరు, సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే జహీరాబాద్‌-బీదర్‌ రోడ్లు ఉన్నాయి. ప్రస్తుతం రెండు వరసలుగా ఉన్న 134 కిలోమీటర్ల ఈ రహదారిని నాలుగు వరుసలుగా మార్చితే రాకపోకలకు అనువుగా ఉంటుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ మార్గంగా గుర్తించాలని..

హైదరాబాద్‌ శివారు అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ చౌరస్తా వరకు 46.40 కిలో మీటర్ల బీజాపూర్‌ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించడంతో మన్నెగూడ నుంచి హైదరాబాద్‌ వరకు వాహనాల రాకపోకలు సాఫీగా సాగిపోతున్నాయి. మన్నెగూడ నుంచి జిల్లా కేంద్రం వికారాబాద్‌ మీదుగా వ్యాపార, వాణిజ్య కేంద్రంగా పేరున్న తాండూరు వరకు 60 కిలో మీటర్లు కేవలం రెండు వరుసలుగా మాత్రమే రోడ్డు ఉంది. దీంతో కర్ణాటక, మహారాష్ట్రల నుంచి తాండూరు మీదుగా హైదరాబాద్‌ వైపు రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్గ మధ్యలోని అనంతగిరి గుట్టపై ఏ వాహనం ఎప్పుడు బోల్తా పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వికారాబాద్‌ పరిధి శివసాగర్‌ రోడ్డు పక్కనే ఉండటం, ఇరుకుగా ఉన్న రైల్వే వంతెనతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీనికి తోడు తాండూరు-జహీరాబాద్‌ మధ్య 60 కిలో మీటర్ల దూరం మార్గం ఇరుకుగా ఉంది. జహీరాబాద్‌ నుంచి బీదర్‌ వరకు రెండు వరుసల రోడ్డు ఉన్నప్పటికీ వాహనాల రద్దీ అధికం కావడంతో నాలుగు వరుసలుగా విస్తరించాల్సిన అవసరం ఉంది. ఈ రోడ్లను కలిసి జాతీయ రహదారిగా గుర్తించి విస్తరించాలని తాజాగా ముఖ్యమంత్రి కోరడంతో ఈ ప్రాంత వాసుల్లో ఆశలు చిగురించాయి.

గతంలో ప్రతిపాదించినప్పటికీ..

తాండూరు నుంచి మన్నెగూడ రోడ్డును నాలుగు వరుసల రహదారిగా విస్తరించాలని 2023లో, జహీరాబాద్‌-బీదర్‌ మధ్య రహదారిని జాతీయ మార్గంగా విస్తరించాలని 2017లో నిర్ణయించారు. ముంబయి-హైదరాబాద్‌ రోడ్డును అనుసంధానిస్తూ బీదర్‌ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరిస్తామని 2017లో హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అప్పటి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని