logo

చిన్నారుల పెదాలపై చిరునవ్వు

చిన్నారుల మోముల్లో చిరునవ్వులు చిందించడమే లక్ష్యంగా ఏటా జులైలో ఆపరేషన్‌ ముస్కాన్‌ నిర్వహిస్తున్నారు. ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమం పక్కాగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

Updated : 01 Jul 2024 06:12 IST

జిల్లాలో నేటి నుంచి ఆపరేషన్‌ ముస్కాన్‌ 

పరిశ్రమలో అధికారుల తనిఖీలు

న్యూస్‌టుడే, సిద్దిపేట: చిన్నారుల మోముల్లో చిరునవ్వులు చిందించడమే లక్ష్యంగా ఏటా జులైలో ఆపరేషన్‌ ముస్కాన్‌ నిర్వహిస్తున్నారు. ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమం పక్కాగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వివిధ శాఖల అధికారులు సంయుక్తంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పోలీసు కమిషనర్‌ డా.బి.అనూరాధ నేతృత్వంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా ఆవిర్భావం నుంచి ఏడేళ్లలో 306 మందికి విముక్తి కల్పించారు. 

సమష్టిగా శాఖలు.. 

ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా తప్పిపోయిన చిన్నారులను దర్పణ్‌ యాప్‌ ద్వారా గుర్తిస్తారు. బాల కార్మికులకు విముక్తి కల్పిస్తారు. బిక్షాటన చేసేవారికి, వీధి బాలలు, బడి ఈడు పిల్లలను బడుల్లో చేర్పిస్తారు. ముఖ్యంగా ఇటుక బట్టీలు, పరిశ్రమలు, దుకాణాలు, హోటళ్లపై దృష్టి సారించి తనిఖీలు చేయనున్నారు. ఇందుకోసం సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్‌ డివిజన్లలో ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసు, బాలల సంక్షేమ సమితి, జిల్లా బాలల పరిరక్షణ, కార్మిక, విద్య, వైద్య విభాగాల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది భాగస్వాములుగా ఉన్నారు.

నిబంధనల విస్మరణ.. 

గత ఏడాది ముస్కాన్‌ ద్వారా 48 మంది బాల కార్మికులను గుర్తించారు. 18 ఏళ్లలోపు వారిని పనుల్లోకి తీసుకోవద్దనే నిబంధన ఉన్నా యజమానులు విస్మరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో బాలలను గుర్తించి బాలల సంక్షేమ సమితి ఎదుట హాజరుపర్చనున్నారు. ఇతర రాష్ట్రాల వారైతే సంరక్షణ కేంద్రాలకు తరలిస్తారు. కుటుంబ సభ్యులు, సంబంధీకులను రప్పించి కౌన్సెలింగ్‌ చేసి అప్పగిస్తారు. యజమానిపై చర్యలు తీసుకొంటారు. 

సంరక్షణ కేంద్రాల్లో తనిఖీ..

జిల్లాలో ఐదు బాలల సంరక్షణ కేంద్రాలు కొనసాగుతున్నాయి. అందులో సిద్దిపేట బాల సదనం, శిశుగృహ (ప్రభుత్వం) సహా బెజ్జంకి, కొండపాక, ప్రజ్ఞాపూర్‌లో స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే కేంద్రాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 90 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఈ కేంద్రాలను సందర్శించి తప్పిపోయిన చిన్నారులను ‘దర్పణ్‌’(ముఖ గుర్తింపు) యాప్‌ ద్వారా గుర్తిస్తారు.

బాధ్యులపై చర్యలు తప్పవు 

రాము, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి

సీపీ అనూరాధ, జిల్లా సంక్షేమ అధికారి శారద నేతృత్వంలో అన్ని శాఖల యంత్రాంగం సమన్వయంతో తనిఖీలు చేపడతాం. బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవు. అలాంటి వారు ఎవరైనా కనిపిస్తే డయల్‌-100 లేదా చైల్డ్‌ లైన్‌ టోల్‌ ఫ్రీ నం.1098 సంప్రదించాలి. 

వలస కార్మికుల పిల్లలు ఎక్కువగా..

ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బిహార్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు వందల సంఖ్యలో జిల్లాలో ఉపాధి పొందుతున్నారు. కొందరు కుటుంబ సభ్యులతో సహా వలస వస్తున్నారు. ఇటుక బట్టీలు, భవన నిర్మాణం రంగం, ఇతర చోట్ల ఎక్కువ శాతం బాలలు పనుల్లో కనిపిస్తున్నారు. కీలకంగా మారాల్సి ఉన్న కార్మిక శాఖ నామమాత్రంగా వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. అధికారులు తనిఖీ చేసినన్ని రోజులు దూరంగా ఉంటున్న బాలకార్మికులు తరువాత పనుల్లో చేరుతుండటం గమనార్హం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని