logo

రెప్పపాటులో కబళిస్తున్న మృత్యువు

తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లకు నిద్రమత్తు ఉంటుంది. పగలు, రాత్రి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిద్రమత్తులో రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.

Updated : 29 Jun 2024 05:43 IST

న్యూస్‌టుడే, చేగుంట

తెల్లవారుజామున వాహనాలు నడిపే డ్రైవర్లకు నిద్రమత్తు ఉంటుంది. పగలు, రాత్రి వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిద్రమత్తులో రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న 44వ జాతీయ రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు మాత్రం తగిన చర్యలు చేపట్టడంలేదు. శుక్రవారం మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం సమీపంలో 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీలో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పది మంది మేకల లోడ్‌తో రెండు రోజుల క్రితం స్వగ్రామాల నుంచి బయలుదేరారు. మరో గంటన్నరలో గమ్య స్థానానికి చేరుకుంటామని అనుకుంటున్న తరుణంలో శుక్రవారం తెల్లవారుజామున 4.45 గంటలకు ప్రమాదం జరిగింది. మేకల లోడుతో అతివేగంగా వెళ్తున్న లారీ డ్రైవర్‌.. ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా నిద్రమత్తులో అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టాడు. ముందు వెళ్తున్న లారీలో దాణా సంచులు ఉంటేనే ఐదుగురు మృతిచెందారు. అదే కంటెయినర్‌ కానీ.. ఇతర లారీలు ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ.. రహదారి మధ్యలో ఆగిపోయింది. ముందు వెళ్తున్న లారీని డ్రైవర్‌ పక్కకు నిలిపి వెళ్లిపోయాడు. ఈ ప్రమాదం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.

ఓవైపు నుజ్జయిన మేకల లారీ

క్రేన్‌తో మృతదేహం వెలికితీత

ప్రమాదంలో మరణించిన ఇద్దరి మృతదేహాలను వెలికితీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. లారీలో వెనకాల కూర్చున్న వారిలో ఇద్దరు మృతిచెందారు. పూర్తిగా మేకల మధ్య ఇరుక్కుపోవడంతో తీయటం కష్టంగా మారింది. చేగుంట కానిస్టేబుల్‌ రాయుడు, స్థానికులతో కలిసి ఇరుక్కున్న ఒక మృతదేహాన్ని క్రేన్‌కు కట్టి అతికష్టంమీద బయటకు తీశారు. అప్పటివరకు నలుగురు మాత్రమే మరణించారని అనుకున్నారు. మొత్తం పదిమంది లారీలో వచ్చినట్లు ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తి చెప్పటంతో వెతికారు. లారీలో ఉన్న మొత్తం మేకలను బయటకు తీయడంతో మరొకరి మృతదేహం కనిపించింది.


పాక్షికంగా దెబ్బతిన్న ధాన్యం లారీ

గతంలో ప్రమాదాలు

గతంలో కూడా ఈ ప్రాంతంలో పలు ఘటనలు జరిగాయి. ఇక్కడ జాతీయ రహదారి మరీ ప్రమాదకరంగా ఉంది. ఈ ప్రాంతంలో గతంలో నిజామాబాద్‌ వైపు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు రోడ్డు కిందికి దూసుకెళ్లటంతో ముగ్గురు మృతిచెందారు. అలాగే హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. లారీ ఢీకొనటంతో ఇద్దరు మరణించారు. చాలా సార్లు వాహనాలు ఢీకొనటం, బోల్తాపడటం వంటివి జరుగుతున్నాయి. మలుపులు ఉండటంతో వాహనాలు అతివేగంగా వస్తూ రోడ్డు కిందికి దూసుకెళ్లటమో లేక ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొనటమో జరుగుతున్నాయి. మలుపులు ఉన్న చోట యూ టర్నింగ్‌ ఉంది. వాహనాలు వేగంగా వస్తున్నప్పుడు ఇవి కనిపించడం లేదు. అయినా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మలుపులు, రోడ్డు ఎత్తుగా ఉండటం ప్రమాదాలు జరగటానికి కారణమవుతున్నాయి. గతంలో రెండు మూడు సార్లు బస్సులు కూడా ప్రమాదానికి గురయ్యాయంటే.. ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో తెలుస్తుంది.  



మేకల లారీ నుంచి తీస్తున్న మృతదేహం 

ఇతర వాహనంలో మేకల తరలింపు

ప్రమాదానికి గురైన లారీలో సుమారు 100 మేకలు అక్కడికక్కడే మృతిచెందాయి. ప్రాణంతో ఉన్న మేకలను ఇతర వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు వారిస్తున్నప్పటికీ.. కాళ్లు విరిగిన 25 వరకు మేకలను వడియారం, రామంతాపూర్, మాసాయిపేటకు చెందిన వారు తీసుకెళ్లారు. చనిపోయిన వాటిని లారీలోనే వదిలేశారు.  

ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తి నుంచి వివరాలు తెలుసుకుంటున్న తూప్రాన్‌ డీఎస్పీ వెంకట్‌రెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని