logo

స్వయం ఉపాధితో చక్కటి భవిత

వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన శిక్షణ లేక ముందడుగు వేయలేకపోతారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

Published : 29 Jun 2024 02:14 IST

నిరుద్యోగ యువతకు వరంగా మారిన శిక్షణ కేంద్రం

చరవాణి మరమ్మతులో శిక్షణ

న్యూస్‌టుడే-మెదక్‌: వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన వారు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైన శిక్షణ లేక ముందడుగు వేయలేకపోతారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. రెండేళ్ల కిందట ఏర్పాటైన ఈ శిక్షణ కేంద్రం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు స్వయం ఉపాధి వైపు అడుగులు వేయగా.. మరికొందరు ఆయా చోట్ల ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. గతేడాది అదనంగా మరో రెండు కోర్సులను ప్రవేశపెట్టింది. మూడు నెలల పాటు కొనసాగే శిక్షణకు నామమాత్రపు రుసుమును వసూళ్లు చేస్తున్నారు. ఈ అంశంపై ‘న్యూస్‌టుడే’ కథనం...

7 బ్యాచులు పూర్తి..

డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇప్పించి, ఉపాధి కల్పించేందుకు జిల్లా యువజన, క్రీడలశాఖ ముందుకొచ్చింది. 2022 జూన్‌ 1న మెదక్‌లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్యాషన్‌ డిజైనింగ్‌-జరోసి, బ్యూటీషియన్‌ కోర్సు, కంప్యూటర్, మొబైల్‌ సర్వీసింగ్, సీసీ టీవీ మరమ్మతు, హౌజ్‌ వైరింగ్‌ వంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో కోర్సులో 30 మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఫ్యాషన్‌ డిజైనింగ్, బ్యూటీషియన్‌ కోర్సుకు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మిగిలిన కోర్సులకు పదోతరగతి ఉత్తీర్ణులు లేదా అనుత్తీర్ణులై ఉండాలి. ఇప్పటి వరకు 7 బ్యాచ్‌లు పూర్తయ్యాయి. శిక్షణ పూర్తయ్యాక పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ధ్రువపత్రం ఇస్తారు.

832 మంది శిక్షణ పొంది..

వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఇప్పటి వరకు 832 మంది శిక్షణ పొందారు. ఈ నెలాఖరుతో ఎనిమిదో బ్యాచ్‌ పూర్తికానుంది. ఎక్కువగా కంప్యూటర్, బ్యూటీషియన్‌ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటున్నారు. తర్ఫీదు పొందిన వారిలో పలువురు స్వయం ఉపాధి పొందుతున్నారు. సుమారు 80 మంది వివిధ దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. శిక్షణ పొందిన వారిలో మరికొందరు పలు చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు.

1 నుంచి కొత్త బ్యాచ్‌ ప్రారంభం...

ప్రస్తుతం ఏడు కోర్సుల్లో తర్ఫీదునిస్తున్నారు. థియరీ తరగతులతో పాటు యంత్రాలు, పరికరాలతో శిక్షణ చేయిస్తున్నారు. కంప్యూటర్‌ కోర్సుకు రూ.1,000, మిగిలిన కోర్సులకు ఫీజు రూ.1,500, పరీక్ష ఫీజు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. కోర్సు మూడు నెలల పాటు కొనసాగుతుంది. తొమ్మిదో బ్యాచ్‌లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వచ్చే నెల 1 నుంచి కొత్త బ్యాచ్‌ ప్రారంభం కానుంది.


10లోగా దరఖాస్తు చేసుకోవచ్చు

- నాగరాజు, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి

నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం వరంగా మారుతోంది. కేంద్రం ఏర్పాటై రెండేళ్లు పూర్తయింది. ఏడు కోర్సుల్లో శిక్షణ పొందిన వారు ఉపాధి పొందుతున్నారు. కొత్త బ్యాచ్‌లో చేరే వారు వచ్చేనెల 10లోగా దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్‌ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మెమో, రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటోలను అందించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని