logo

ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల రాస్తారోకో

పాఠశాల ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా.. పాఠాలు చెప్పేందుకు గురువులు లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండల పరిధి శాలిపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 వరకు తరగతులు ఉన్నాయి.

Published : 29 Jun 2024 02:13 IST

గవ్వలపల్లి-రామాయంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తున్న విద్యార్థులు

చిన్నశంకరంపేట, న్యూస్‌టుడే: పాఠశాల ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా.. పాఠాలు చెప్పేందుకు గురువులు లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండల పరిధి శాలిపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 వరకు తరగతులు ఉన్నాయి. ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయకపోవడంతో శుక్రవారం పాఠశాల ముందు గవ్వలపల్లి-రామాయంపేట ప్రధాన రహదారిపై రెండు గంటలకుపైగా రాస్తారోకో చేపట్టి వంటావార్పు నిర్వహించారు. టీచర్స్‌ కావాలని ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. నేటికీ హిందీ, భౌతిక, జీవ, సాంఘీక శాస్త్రం ఉపాధ్యాయులు లేకపోవడంతో ఇతర పాఠశాల నుంచి పిలిపించి పాఠాలు బోధిస్తున్నారని వాపోయారు. విద్యా వాలంటీర్లతో బోధించడంతో ఉత్తీర్ణత తగ్గిపోయిందని తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈవో బుచ్చయ్య నాయక్, కాంప్లెక్స్‌ హెచ్‌ఎం భాస్కరరావు పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోందని, 15 రోజుల్లో సర్దుబాటు చేసి పాఠశాలకు పంపిస్తానని ఎంఈవో తెలిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన మరుగుదొడ్లు, వంటశాల గది, ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈవో బుచ్చయ్యనాయక్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని