logo

సహకారం.. మహళాభ్యున్నతికి దోహదం

ఓ వైపు రుణాలు అందిస్తూ.. ఎరువులు..విత్తనాలు అందుబాటులో ఉంచుతూ డీసీసీబీ (డిస్ట్రిక్ట్‌ కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు) అన్నదాతలకు చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో మహిళాభ్యున్నతికి సైతం బాటలు వేస్తోంది.

Published : 29 Jun 2024 02:11 IST

పొదుపు సంఘాలకు డీసీసీబీ రుణాల అందజేత
రాష్ట్రంలో ప్రథమ స్థానం
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్, సిద్దిపేట, మెదక్‌

మహిళా సంఘం సభ్యులకు రుణాలు అందిస్తున్న అధికారులు

ఓ వైపు రుణాలు అందిస్తూ.. ఎరువులు..విత్తనాలు అందుబాటులో ఉంచుతూ డీసీసీబీ (డిస్ట్రిక్ట్‌ కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు) అన్నదాతలకు చేయూతనిస్తోంది. ఇదే క్రమంలో మహిళాభ్యున్నతికి సైతం బాటలు వేస్తోంది. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా సహకార బ్యాంకులు ప్రోత్సహిస్తున్నాయి. వాణిజ్య బ్యాంకులకు దీటుగా సంఘాలకు రుణాలు అందిస్తున్నాయి. వసూలైన వడ్డీలో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లిస్తూ ఆదర్శంగా నిలుస్తుండటం గమనార్హం. రాష్ట్రంలో మెదక్‌ డీసీసీబీ మహిళా సంఘాలకు రుణాల మంజూరులో ముందంజలో నిలవడం విశేషం.

రాష్ట్రంలో మొత్తం 9 డీసీసీబీలు ఉన్నాయి. బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు రుణాలు అందిస్తూ వ్యాపారాల నిర్వహణకు ప్రోత్సహిస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా రూ.410 కోట్లు పంపిణీ చేశారు. గడిచిన ఐదేళ్లలో ఇదే అత్యధికం కావడం విశేషం. 2022-23లోనూ ఇదే అంశంలో రాష్ట్రంలో తొలి స్థానాన్ని దక్కించుకొని ప్రభుత్వం నుంచి పురస్కారాన్ని అందుకున్న విషయం విదితమే.

ఆర్థిక అక్షరాస్యతకు ప్రాధాన్యం: సాధారణంగా వాణిజ్య బ్యాంకులు పొదుపు సంఘాలకు రుణాలు అందించి ఊరుకుంటాయి. డీసీసీబీ ప్రతినిధులు రుణాలు ఇవ్వడంతో పాటు మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత అవగాహన పెంచడంపై ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆర్థికంగా ఎదిగేందుకు రుణాలను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై అవగాహన కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు. రుణం మంజూరుతో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు.

బీమా, ఇతర సదుపాయాలు..: సహకార బ్యాంకుల ద్వారా ప్రధానమంత్రి బీమా పథకాలను మహిళా సంఘాల సభ్యులకు అమలు చేస్తున్నారు. ఏడాదికి రూ.12 చెల్లిస్తే ప్రమాద బీమా, రూ.330తో సాధారణ బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ప్రమాద బీమా చేసుకున్న వారు ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.2 లక్షలు, సాధారణ బీమా పథకంలో చేరిన వారు ఆత్మహత్య మినహా ఎలా మృతిచెందినా రూ.2లక్షలు, రెండు బీమా పథకాల్లో చేరితే రూ.4లక్షలు సాయం అందిస్తారు. వీటిని సంఘాల సభ్యులు వినియోగించుకునేలా చూస్తున్నారు.


కుటుంబానికి చేదోడుగా..

గజ్వేల్‌ మండలం బూర్గుపల్లికి చెందిన రేణుకది పేద కుటుంబం. ఏడాది కిందట స్థానిక మహిళా సంఘంలో చేరారు. డీసీసీబీ రుణం మంజూరు విషయం తెలుసుకున్న రేణుక.. ఆరు నెలల కిందట దరఖాస్తు చేసుకున్నారు. రూ.2 లక్షల రుణం మంజూరైంది. వీటితో గ్రామంలో పిండి గిర్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వ్యాపారం ద్వారా వస్తున్న నగదుతో రుణ వాయిదాను చెల్లిస్తూనే, కుటుంబానికి చేదోడుగా నిలిచారు. గతంలోనూ రుణం తీసుకోగా, క్రమం తప్పకుండా చెల్లించారు. రానున్న రోజుల్లో వ్యాపారాన్ని విస్తరించాలని ఆమె యోచిస్తున్నారు.

న్యూస్‌టుడే, గజ్వేల్‌ గ్రామీణ


సొంతంగా వ్యాపారం..

నర్సాపూర్‌ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన మమత..ఐదేళ్ల క్రితం బంతి పువ్వు పేరిట ఏర్పాటైన స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా చేరారు. ప్రతి నెలా రూ.400 వరకు పొదుపు చేస్తూ వచ్చారు. సొంతంగా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో గ్రామైక్య సంఘం నుంచి రూ.2 లక్షలు, డీసీసీబీ నుంచి రూ.3 లక్షలు రుణం తీసుకొని శుద్ధిజల కేంద్రాన్ని ప్రారంభించారు. తీసుకున్న రుణ వాయిదాలను సక్రమంగా చెల్లిస్తూ ముందుకు సాగుతున్నారు. సంపాదనలో కొంత మేర పిల్లల చదువుకు వెచ్చిస్తున్నారు. భర్త ఆంజనేయులు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారు.

న్యూస్‌టుడే, నర్సాపూర్‌


వడ్డీ తిరిగి ఇచ్చేస్తూ..

సంగారెడ్డి జిల్లాలోని మహిళా సంఘాలకు 2020 జులై 1 నుంచి వసూలైన వడ్డీలో 5 శాతం తిరిగి సంఘాల అభ్యున్నతికి తిరిగి ఇస్తుండటం విశేషం. మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలపై 12 శాతం వడ్డీని వసూలు చేస్తున్నారు. డీసీసీబీ, సెర్ప్‌ అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం వసూలైన వడ్డీలో 5 శాతం తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇప్పటివరకు రూ.కోటి వరకు జిల్లా సమాఖ్యకు అందజేశారు. ఇలా వెనక్కి ఇచ్చిన వడ్డీలో ఒక శాతం జిల్లా సమాఖ్య, 2 శాతం మండల సమాఖ్యలకు, మిగిలిన దాన్ని గ్రామైక్య సంఘాలకు కేటాయించి సంఘాల అభ్యున్నతికి బాటలు వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని