logo

బోధనలో వినూత్నం

బోధనోపకరణాల్లో కొత్త ఒరవడిని తెచ్చిన సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని లచ్చపేట మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని మాధవికి గుర్తింపు లభించింది.

Published : 29 Jun 2024 02:10 IST

గుర్తింపు పొందిన లచ్చపేట ఉపాధ్యాయిని మాధవి

బొమ్మలాట ద్వారా బోధిస్తున్న ఉపాధ్యాయిని

దుబ్బాక, న్యూస్‌టుడే: బోధనోపకరణాల్లో కొత్త ఒరవడిని తెచ్చిన సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని లచ్చపేట మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని మాధవికి గుర్తింపు లభించింది. బోధనా పద్ధతులు, ప్రాథమిక విద్యలో వస్తున్న మార్పులను వివరిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణా సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో వచ్చిన ‘హార్బింజర్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌’ పుస్తకంలో ఆమె బోధనోపకరణాల అంశం ప్రచురితమైంది. ఈ పుస్తకం రెండు రోజుల క్రితం విడుదలైంది. 313 పేజీల ఈ పుస్తకంలో రాష్ట్రవ్యాప్తంగా వైవిధ్యంగా బోధిస్తున్న 55 మంది ఉపాధ్యాయుల గురించి ప్రస్తావించారు.

పుస్తకంలో ఇలా..

సొంతంగా తయారుచేసి..

లచ్చపేట బడిలో 2015 నుంచి మాధవి ఎస్‌జీటీగా పని చేస్తున్నారు. తక్కువ ఖర్చులో సొంతంగా ఆమె బోధనోపకరణాలు తయారు చేశారు. విద్యార్థులను ఆకట్టుకునేలా బోధిస్తున్నారు. ఈ బడిలో 1 నుంచి 5వ తరగతి వరకు 112 మంది విద్యార్థులు ఉన్నారు. కథల పుస్తకాలు, వాటి కార్డులు, చేతి వేళ్లను ఉపయోగించి బొమ్మలాట, సంభాషణల కార్డులు తదితరాలను ఆమె పాఠ్యాంశాలను బోధించేటపుడు ఉపయోగిస్తున్నారు. వాటి వినియోగం వల్ల బాలల్లో అభ్యాసంలో ఆసక్తి, వేదికపై భయం తొలగడం, సులభంగా అర్థం కావడం, భాషా నైపుణ్యాల వృద్ధికి అవకాశం ఉందని ఉపాధ్యాయిని మాధవి చెప్పారు. ఎస్‌సీఈఆర్‌టీ పుస్తకంలో పరివర్తనాత్మక కథలు, మై లిటిల్‌ వరల్డ్‌ అధ్యాయంలో ఉపాధ్యాయిని పద్ధతులను వివరించారు. 2018లో జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయినిగా ఆమె అవార్డు గెలుచుకున్నారు. కరోనా సమయం అనంతరం బాలలకు చదువుపై ఆసక్తి తగ్గింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉల్లాసంగా ఆసక్తి కనబరుస్తూ నేర్చుకునేందుకు తాను ఈ బోధన పద్ధతులను వినియోగిస్తున్నట్టు ఆమె చెప్పారు.  తమ పాఠశాలలోని విద్యార్థులు 28 మంది లచ్చపేట ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు ఎంపికయ్యారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని