logo

సరికొత్త నడవడి.. అధ్యయన ఒరవడి

పంటల సాగులో సరికొత్త ఒరవడి.. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్‌ను ప్రత్యేకంగా నిలుపుతోంది. రైతుల్లో చైతన్యాన్ని గుర్తించిన అధికారులు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారింది.

Published : 29 Jun 2024 02:10 IST

ఆయిల్‌పామ్‌ తోటల వివరాలు తెలుసుకుంటున్న ఐఎఫ్‌ఎస్‌ శిక్షణ అధికారులు

న్యూస్‌టుడే, ములుగు: పంటల సాగులో సరికొత్త ఒరవడి.. సిద్దిపేట జిల్లాలోని మర్కుక్‌ను ప్రత్యేకంగా నిలుపుతోంది. రైతుల్లో చైతన్యాన్ని గుర్తించిన అధికారులు వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారింది. దేశంలోని వివిధ రంగాలకు చెందిన శిక్షణ ఉద్యోగులు, ఇతర ప్రాంతాల రైతులు క్షేత్రస్థాయి సందర్శనకు ఇక్కడికే వచ్చి అవగాహన పెంచుకుంటున్నారు. ఏకంగా ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ డీజీతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి సాగు విధానాలు తదితర అంశాలను అడిగి తెలుసుకోవడం గమనార్హం. ఇలా మర్కుక్‌ అధ్యయన కేంద్రంగా మారడం విశేషం.

ప్రత్యేకతలు..: రాష్ట్రంలోనే ప్రప్రథమంగా మర్కుక్‌ మండలంలోనే వెద పద్ధతిలో వరి సాగుకు శ్రీకారం చుట్టారు. సంప్రదాయ విధానానికి స్వస్తి పలికి ఈ కొత్త పద్ధతిలో పంట వేసి స్వల్ప వ్యవధిలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించి నిరూపించారు. ఇక్కడి స్ఫూర్తితో వెదసాగు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు ఇక్కడే మొదలైంది. ఇందులో సాధారణ పద్ధతి కంటే ఎక్కువ మొక్కలు నాటుకోవడమే కాకుండా దిగుబడి సైతం అధికంగా వస్తుంది. దీన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పాటిస్తున్నారు. వరిలో విత్తనోత్పత్తి కార్యక్రమానికి ఈ మండలంలోనే షురూ చేశారు. రైతులు తమ సొంత పొలాల్లో పండించిన పంట నుంచి విత్తనాలను ఉత్పత్తిచేస్తున్నారు.

వస్తున్నారిలా..: మర్కుక్‌ ఏవో టి.నాగేందర్‌రెడ్డి స్థానిక రైతులను కొత్త పంటలు వేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడి రైతులు అవలంబిస్తున్న విధానాలు, సాగు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఉన్నతాధికారులు తరలివస్తున్నారు. ఇటీవల ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ డీజీ క్యూయూ డొంగ్యూ ఆధ్వర్యంలో అధికారుల బృందం మర్కుక్‌ మండలంలో పర్యటించింది. క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. తాజాగా ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్‌ శిక్షణ అధికారులు, వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యాన అధికారులు పర్యటించారు. మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల రైతులు ఇక్కడికి వచ్చి అన్ని విషయాలపై అవగాహన పెంచుకున్నారు.

మిరప తోట

నిత్య ఆదాయం..: మరోవైపు నిత్యం ఆదాయం వచ్చేలా ప్రతి ఒక్క రైతు తమ భూమిలో సగం మేర కూరగాయలు వేసేలా చైతన్యం తీసుకొచ్చారు. ములుగు మండలం వంటిమామిడిలో కూరగాయల మార్కెట్‌ అందుబాటులోకి రావడంతో రైతులకు కలిసొచ్చింది. ఫలితంగా అత్యధికులు టమాట, వంగ, సొర, బీర, బీన్స్, చిక్కుడు, దొండకాయ, బెండ వంటివి పండిస్తున్నారు. బిందుసేద్యం ద్వారా నీటిని అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని