logo

ఉద్యాన పంటకు బిందు రాయితీ

తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి బిందు సేద్యం పరికరాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో పామాయిల్‌ సాగుకు మాత్రమే బిందు సేద్యం విధానం అమలయ్యేది.

Published : 29 Jun 2024 02:09 IST

లక్ష్మీనగర్‌లో మిరప పంట

న్యూస్‌టుడే, సిద్దిపేట అర్బన్, మిరుదొడ్డి: తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి బిందు సేద్యం పరికరాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో పామాయిల్‌ సాగుకు మాత్రమే బిందు సేద్యం విధానం అమలయ్యేది. 2024-25 వానాకాలం సీజన్‌ నుంచి మిగతా వాటికీ ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. పదేళ్ల నుంచి ఎదురుచూస్తున ఉద్యాన సాగు రైతులకు ఊరట లభించనుంది.

పెరగనున్న 40 శాతం దిగుబడి

జిల్లాలో ఈ సీజన్‌లో మిర్చి, మామిడి, బొప్పాయి, అరటి, జామ, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, ద్రాక్ష , ఆయిల్‌పామ్, కూరగాయల పంటల సాగుకు బిందు సేద్యం విధానం అమలు కానుంది. సుమారు 25 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతాయి. మొదటి విడతలో జిల్లాకు 1,300 ఎకరాల్లో కొత్తగా బిందు సేద్యం చేసేలా ఉద్యాన శాఖ ప్రణాళిక వేసింది. ఆమేరకు పరికరాలు అందిస్తుంది. అర్హులైన అన్నదాతలను ముందుగా గుర్తిస్తారు. కేవలం 50 శాతం నీటితో... ఎరువులు, కూలీల ఖర్చు తగ్గించుకొని చేపట్టవచ్చు. సుమారు 40 శాతం దిగుబడి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

రాయితీ ఇలా..: ఎస్సీ, ఎస్టీ రైతులకు శత శాతం ఉచితంగా రాయితీపై బిందు సేద్యం పరికరాలను ప్రభుత్వం అందజేస్తుంది. చిన్న, సన్నకారు కర్షకులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీ వర్తిస్తుంది. ఒక్కో యూనిట్‌ ధర ప్రకారం ప్రతి హెక్టార్‌కు రూ.33,500 నుంచి రూ.1,44,000 వరకు రాయితీ అందుతుంది. పదేళ్ల నుంచి వేల సంఖ్యలో అన్నదాతలు పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సరఫరా చేసేందుకు ఎనిమిది కంపెనీలకు ప్రభుత్వం అనుమతించింది. రైతులందరికీ త్వరగా లబ్ధి చేకూరేలా అధికారులు చర్య తీసుకోవాలని.. కొన్ని ఎకరాలకే పరికరాలు ఇచ్చే అవకాశం ఉండటంతో ఇతరులు నిరాశకు గురవుతారని టమాట వేసిన శ్రీనివాసరెడ్డి అన్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

సువర్ణ, జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి

సూక్ష్మ సేద్యం వైపు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక రాయితీలు అందిస్తోంది. బిందు సేద్యం విధానంపై అవగాహన కల్పిస్తున్నాం. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని