logo

పన్ను తాఖీదు ఆలస్యం.. ప్రజలపై వడ్డీ భారం

ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్‌ నోటీసుల పంపిణీలో జాప్యంతో ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపునకు ఆన్‌లైన్‌ తాఖీదులను ఏప్రిల్‌లోనే పంపిణీ చేయాలి.

Published : 29 Jun 2024 02:08 IST

న్యూస్‌టుడే, హుస్నాబాద్‌: ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్‌ నోటీసుల పంపిణీలో జాప్యంతో ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపునకు ఆన్‌లైన్‌ తాఖీదులను ఏప్రిల్‌లోనే పంపిణీ చేయాలి. వాటి ఆధారంగా పన్ను చెల్లిస్తారు. జూన్‌ 30, డిసెంబరు 31 లోపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విధించిన  పన్నును మొదటి దఫా జూన్‌ 30లోగా చెల్లించకపోతే తర్వాత నెలకు రెండు శాతం చొప్పున వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి నెల 2 శాతం వడ్డీ జరిమానాగా విధింపు ఉంటుంది. తాఖీదులు అందకపోయినా గడువు తేదీ దాటితే వడ్డీ భారం మినహాయింపు ఉండదు. హుస్నాబాద్‌లో పురపాలిక అధికారులు జూన్‌ 30 సమీపించినా నోటీసుల జారీ పూర్తి కాలేదు. వారం రోజుల నుంచి పంపిణీ చేస్తున్నారు.

గృహ యజమానుల ఆందోళన

హుస్నాబాద్‌ పట్టణంలో 20 వార్డుల్లో దాదాపు 7 వేల గృహాలు ఉన్నాయి. పురపాలికలో ఉన్న 20 మంది వార్డు ఆఫీసర్లతో పంపిణీ చేపడుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో తాఖీదుల జారీలో ఆలస్యం జరుగుతోంది. వడ్డీని చెల్లించక తప్పదేమోనని గృహ యజమానులు మదనపడుతున్నారు. ఈ విషయమై పురపాలిక కమిషనర్‌ మలికార్జున్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా తమ డైరెక్టర్‌  కార్యాలయం  నుంచి నోటీసులు ఆలస్యంగా సరఫరా అయ్యాయని తెలిపారు.

సిబ్బంది కరవు

పురపాలికలో ఆస్తి పన్ను డిమాండ్‌ నోటీసుల జారీలో జాప్యం కొనసాగుతుండగా .. మరోవైపు చెల్లించేందుకు కార్యాలయానికి వస్తే సిబ్బంది ఉండటం లేదు. ఇంటింటికీ తిరిగి వసూలు చేపడితే సరిగా జరగవు. పురపాలిక కార్యాలయానికి వచ్చి మూడు విభాగాల్లో తిరిగినా ఆస్తి పన్ను తీసుకునేవారు లేరని స్థానికుడు అనిల్‌ వాపోయారు. ప్రజలు పన్ను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని