logo

ఫోన్‌ పోతే దొరుకునులే..

నిత్యావసర వస్తువుల జాబితాలో చరవాణి చేరింది. సామాజిక మాధ్యమాల వినియోగం, డిజిటల్‌ లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారాలకు వినియోగం తప్పనిసరిగా మారింది. అనుకోని పరిస్థితుల్లో చరవాణి పోగొట్టుకుంటే.. చోరీకి గురైతే.. ఆందోళనకు గురవుతుంటారు.

Published : 29 Jun 2024 02:06 IST

సీఈఐఆర్‌ పోర్టల్‌తో సత్ఫలితాలు
842 మందికి ఊరట
న్యూస్‌టుడే, సిద్దిపేట

కోల్పోయిన ఫోన్లను తిరిగి పొందిన బాధితులతో సీపీ అనూరాధ

నిత్యావసర వస్తువుల జాబితాలో చరవాణి చేరింది. సామాజిక మాధ్యమాల వినియోగం, డిజిటల్‌ లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారాలకు వినియోగం తప్పనిసరిగా మారింది. అనుకోని పరిస్థితుల్లో చరవాణి పోగొట్టుకుంటే.. చోరీకి గురైతే.. ఆందోళనకు గురవుతుంటారు. కొన్నాళ్లుగా ఆ పరిస్థితుల్లో మార్పు వస్తోంది. పోగొట్టుకున్న ఫోన్‌ను తిరిగి సులువుగా పొందేందుకు ప్రవేశపెట్టిన సీఈఐఆర్‌ (సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌) పోర్టల్‌ సత్ఫలితాలను ఇస్తోంది. పోలీసు కమిషనరేట్‌ పరిధిలో గత ఏడాది ఏప్రిల్‌ 20 నుంచి నుంచి ఇప్పటి వరకు 842 సెల్‌ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించారు.

2,522 మంది ఫిర్యాదు

జిల్లాలో మొత్తం 26 పోలీసు ఠాణాలు ఉన్నాయి. ఆయా ఠాణాల పరిధిలో పోర్టల్‌ అందుబాటులోకి వచ్చింది మొదలు ఇప్పటి వరకు 2522 మంది ఫిర్యాదు చేశారు. ఫోన్లకు సంబంధించి సమీప పోలీసు ఠాణా, మీసేవ కేంద్రాలు, సాంకేతికతపై పట్టున్న వారు నేరుగా ఆన్‌లైన్‌ వేదికగా ఫిర్యాదు చేసే విధానం అమలవుతోంది. www.ceir.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్‌ కావాలి. అందులో సూచించిన మేర ఫోన్‌ నంబరు, ఐఎంఈఐ సంఖ్య, కంపెనీ పేరు, మోడల్, బిల్లు వివరాలతో పాటు ఏ తేదీ.. ఎక్కడ పోయింది.. ఇతరత్రా వివరాలతో ఫిర్యాదు నమోదు చేయాలి. బాధితుని పేరు, చిరునామా, గుర్తింపు పత్రం, ఓటీపీ కోసం మరో చరవాణి నంబరు, మెయిల్‌ ఐడీని నిక్షిప్తం చేయాలి. ఈ ప్రక్రియ పూర్తవగానే ఐడీ నంబరు వస్తుంది. తద్వారా చరవాణి వివరాలు(స్థాయి) తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. మరోవైపు ఆయా వివరాల నమోదుతో 24 గంటల వ్యవధిలో చరవాణి పనిచేయకుండా బ్లాక్‌ చేస్తారు. ఎవరు వినియోగించారనేది గుర్తించేందుకు నిఘా పెడతారు. ఫోన్‌ స్వాధీనం చేసుకున్న తరువాత ఐడీ నంబరు ద్వారా తిరిగి చరవాణి అన్‌బ్లాక్‌ చేసి వినియోగించేలా చర్యలు తీసుకుంటారు. 

బాధితులకు బాసట

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పోర్టల్‌ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి పరిస్థితుల్లో మార్పు మొదలైంది. కొన్ని సందర్భాల్లో బాధితులకు గంటలు, రోజుల్లో లభ్యమవుతున్నాయి. మరికొన్ని కేసుల్లో నెలల సమయం పడుతోంది. కోల్పోయిన, దొంగతనానికి గురైన ఫోన్‌ తిరిగి పొందే విధానం, సీఈఐఆర్‌ పోర్టల్‌ పనితీరుపై పోలీసులు, కళాబృందం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోలీసు కమిషనర్‌ అనూరాధ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ.. ‘నూతన సాంకేతికత సాయంతో పోయిన ఫోన్లను తిరిగి అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. బాధితులు ఎలాంటి సంకోచం లేకుండా సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ఫోన్‌ ఏదైనా ప్రతి సమాచారం ముఖ్యమే. ఒకవేళ కోల్పోతే.. సంబంధిత పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేయాలి.’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని