logo

బడుగులపై పిడుగు

వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు, కూలీలు వాన పడగానే సమీప చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వారిపై పిడుగులు పడటంతో మృత్యువాత పడుతున్నారు.

Published : 29 Jun 2024 02:05 IST

అందని ప్రభుత్వ ఆర్థిక సహాయం

వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు, కూలీలు వాన పడగానే సమీప చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వారిపై పిడుగులు పడటంతో మృత్యువాత పడుతున్నారు. గత ఆరేళ్లలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపారు. ఇందుకు సంబంధించి, పోలీసు, రెవెన్యూ శాఖల నివేదికలను ప్రభుత్వానికి పంపించినప్పటికీ.. వారికి అందాల్సిన రూ.5 లక్షల పరిహారం ఆరేళ్లలో ఒక్కరికీ మంజూరు కాలేదు. - న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్, జోగిపేట, కోహీర్, గుమ్మడిదల.


కౌలు రైతు కన్నీటి గాథ

పాపయ్య భార్య భారతమ్మ, కుమారుడు పాండు

అందోలు మండలం ఎర్రారం గ్రామానికి చెందిన బోయిని పాపయ్య ఈ ఏడాది మే 7న పిడుగు పడి మృతి చెందాడు. కౌలుకు తీసుకున్న పొలంలో పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. పాపయ్యకు భార్య భారతమ్మ ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉండేవారు. 15 ఏళ్ల క్రితం కూతురు దుర్గ చిన్న వయసులోనే అనారోగ్యంతో మృతి చెందింది. నాలుగేళ్ల క్రితం పెద్ద కుమారుడు మహేష్‌ బలవర్మణానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది మే నెలలో పాపయ్య అకాల మరణంతో కుటుంబ భారమంతా చిన్న కుమారుడు పాండుపై పడింది. భర్త మరణంతో భారతమ్మ అనారోగ్యం పాలైంది. 


ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో..

భిక్షపతి కూతుళ్లు సంజన, లాస్య

గుమ్మడిదల మండలం అనంతారం గ్రామానికి చెందిన భిక్షపతి ఈ ఏడాది మే నెలలో పిడుగుపడి మృతి చెందారు. ఆయనకు భార్య విజయలక్ష్మి, ఇద్దరు పిల్లలు సంజన, లాస్య ఉన్నారు. పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు. ఇంటి పెద్ద దిక్కు మరణంతో.. ఆ కుటుంబంపై తీవ్ర ఆర్థిక భారం పడింది. విజయలక్ష్మి కూలీ పనులు చేస్తూ పిల్లలను చదివిస్తోంది. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారు.


అనాథలైన ఇద్దరు పిల్లలు

తండ్రి బుచ్చయ్యతో పిల్లలు(పాత చిత్రం)

పిడుగు పడి తల్లి, అనారోగ్యంతో తండ్రి మరణించడంతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు. కోహీర్‌ పట్టణానికి చెందిన బుచ్చయ్య, స్వప్న భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు అభిషేక్, సంజన. దంపతులిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. కొన్నేళ్ల క్రితం బుచ్చయ్య కాలు విరగడంతో మంచాన పడ్డారు. స్వప్న భర్తకు సపర్యలు చేస్తూ పిల్లలను చదివించేది. 2023, నవంబరు 8న పొలం పనులు ముగించుకొని వస్తుండగా పిడుగుపడి మృత్యువాత పడింది. నెల క్రితం బుచ్చయ్య ఆరోగ్యం విషమించి మరణించాడు. ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందలేదు. స్వప్న తన పెద్దమ్మ ఇంటి వద్ద ఉంటూ, అభిషేక్‌ ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నారు.


ప్రభుత్వానికి నివేదిక అందజేశాం

జిల్లాలో పిడుగులు పడి మృతి చెందిన వారి జాబితాతో నివేదికను ప్రభుత్వానికి అందజేశాం. వారికి రావాల్సిన రూ.5 లక్షల నష్ట పరిహారం ఇప్పటికీ మంజూరు కాలేదు. మంజూరైన వెంటనే నేరుగా బాధిత కుటుంబీకులకు చెక్కుల రూపంలో రెవెన్యూ అధికారులు అందజేస్తారు.

పద్మజారాణి, డీఆర్‌వో.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని