logo

చిన్నారుల ఆరోగ్యానికి పంచసూత్రం

చిన్నారులే జాతి సంపద. దీనిని దృష్టిలో ఉంచుకొని రేపటి పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ.. పోషణలోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు.

Published : 29 Jun 2024 02:05 IST

అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలుకు కార్యాచరణ

మారేపల్లిలో చేతుల శుభ్రతపై అవగాహన

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: చిన్నారులే జాతి సంపద. దీనిని దృష్టిలో ఉంచుకొని రేపటి పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ.. పోషణలోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే చిన్నారుల ఆరోగ్యానికి పంచ సూత్రాల అమలుపై ప్రత్యేక దృష్టిసారించింది.

ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో..: జిల్లాలో ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి పరిధిలో 1,504 అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. మూడేళ్ల వయసు దాటిన వారికి ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్య నేర్పిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు సైతం పౌష్టికాహారం అందిస్తూ ఆరోగ్యపరమైన విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు.

అమలు చేయనున్నవి..

1000 రోజుల ప్రణాళిక: జిల్లాలో పోషణలోపంతో ఉన్న చిన్నారులపై ప్రత్యేక కార్యక్రమం. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి 1000 రోజుల పాటు ఇది కొనసాగుతుంది. చిన్నారుల్లో మార్పునకు అవసరమైన చర్యలు తీసుకుంటారు.
పౌష్టికాహారం: చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలకు పోషణలోపమే కారణం. బాల్యదశలో సరైన పౌష్టికాహారం అందించకపోతే ఎదురయ్యే ఇబ్బందులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం పంపిణీ చేస్తారు.

రక్తహీనతను నివారించడం: పేదరికం కారణంగా చిన్నారుల్లో రక్తహీనత సమస్య తలెత్తుతోంది. ఇలా ఇబ్బంది పడుతున్న చిన్నారులను గుర్తించి అదనపు పౌష్టికాహారం అందిస్తారు.

డయేరియాపై అవగాహన: కలుషిత నీరు తదితర కారణాలతో చిన్నారులు డయేరియా బారిన పడుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదమూ ఉంది. డయేరియాకు ఎలా దూరంగా ఉండాలంటూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు సూచనలు చేస్తారు.

శుభ్రత: వ్యాధులు ఎక్కువగా ఆహార పదార్థాల శుభ్రత పాటించకపోవడం వల్లే వస్తుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలు అధికంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా ఉండే ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ చిన్నారులు తరచూ చేతులను శుభ్రం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు.

బాలల ఎదుగుదలే లక్ష్యం

చిన్నారులు ఆరోగ్యంగా ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో పంచసూత్రాలు పక్కాగా అమలయ్యేలా చూస్తున్నాం. పోషణలోపం కారణంగా వయసుకు తగ్గట్టుగా ఎత్తు, బరువులేని చిన్నారులను గుర్తించడంతో పాటు వారిపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాం. పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూస్తున్నాం. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం.

లలితకుమారి, జిల్లా సంక్షేమాధికారిణి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని