logo

వరి సాగు పై సందిగ్ధం

వానాకాలం సీజన్‌లో వరి సాగు చేద్దామనుకున్న రైతులు వర్షాలు లేక మదనపడుతున్నారు.

Updated : 27 Jun 2024 05:48 IST

వర్షాల్లేక ముందుకు సాగని నారుమడులు

నీటి ఎద్దడిపై రైతుల్లో అంతర్మథనం

గజ్వేల్‌లో ఇంకా వరి నారు పోయకుండా కనిపిస్తున్న మడికట్లు 

గజ్వేల్, న్యూస్‌టుడే: వానాకాలం సీజన్‌లో వరి సాగు చేద్దామనుకున్న రైతులు వర్షాలు లేక మదనపడుతున్నారు. వర్షాలు వస్తాయా? వరి సాగు చేద్దామా? వద్దా? అని అంచనాలు వేసుకుంటున్నారు. ఇప్పుడు వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువు, వాగుల్లో నీరు చేరితే పంట సునాయాసంగా గట్టెక్కుతాయి. వర్షాలు తక్కువగా కురిస్తే పంట పాలు తాగే దశలో నీటి ఎద్దడి నెలకొంటే ఇబ్బందులు తలెత్తే అవకాశాలుంటాయి. 

ఆలస్యంపై ఆందోళన

మేడిగడ్డ మరమ్మతుల నేపథ్యంలో ఎత్తిపోతలు సాగుతాయా? ప్రాజెక్టుల్లో నీటిని నింపుతారా? అనేదానిపై స్పష్టత లేకపోవటం రైతులను కలవరపెడుతోంది. ఏటా రైతులు రోహిణి కార్తెలో వరి నారుమడులు సిద్ధం చేసుకొని నెల రోజులు దాటగానే నాట్లు ప్రారంభిస్తారు. రోహిణి కార్తె దాటిపోయినా ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా పాతిక శాతం కూడా నారుమళ్లు సిద్ధం కాలేదు. సాగు ఆలస్యం అవుతుండటం పట్ల రైతులు ఆవేదన చెందుతున్నారు. గత యాసంగి సాగు వరి నాట్లు జనవరి 15 వరకు పూర్తవ్వాల్సి ఉండగా ఫిబ్రవరి నెలఖారు వరకు సాగాయి. ఫలితంగా జిల్లాలో వరి నూర్పిళ్లు మే నెలాఖరు వరకు సాగాయి. 

బోరు మోటార్లే ఆధారం 

రోహిణి కార్తెలో వరి నార్లు పోసుకుంటే పంటలకు చీడపీడలు ఆశించక ఆశాజనక దిగుబడి వస్తుందని రైతులు విశ్వసిస్తుంటారు. కానీ చేతికొచ్చిన యాసంగి ధాన్యం ఆరబెట్టుకోవటం, మార్కెట్లకు తరలించి విక్రయించడం పనుల్లోనే నిమగ్నమయ్యారు. ఇప్పుడిప్పుడు రైతులు పొలాలకు నీరు పెట్టడం ప్రారంభించారు. కొన్ని చోట్ల ఇంకా మోటార్లు తిప్పడం ఆరంభించనే లేదు. ఫలితంగా ఈ వానాకాలం సీజన్‌ సైతం నెల రోజులు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావం ఎలా ఉంటుంది? జూన్‌లో పోసిన నారు జూలైలో నాటు వేస్తే నవంబర్‌లో కోతకు వస్తుంది. అంటే అక్టోబరులోనే వర్షాకాలం ముగియనుంది. పూర్తిగా బోరు మోటార్లపైనే ఆధారపడి వరి పంటను గట్టెక్కించాల్సి ఉంటుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రోహిణిలో నారు పోయకుండా నాట్లు వేస్తే చీడపీడలకు మందులు పిచికారి, దిగుబడి కోసం అధికంగా ఎరువుల వాడాల్సి వస్తుందని, దీంతో ఖర్చు కూడా పెరిగిపోతుందని అంచనా వేసుకుంటున్నారు. 

3 లక్షల ఎకరాల్లో వరి 

జిల్లాలో మూడు లక్షల మంది రైతులున్నారు. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో మొత్తం 5.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో ప్రధానంగా 3 లక్షల ఎకరాల్లో వరి, 60 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 1.80 లక్షల ఎకరాల్లో పత్తి, 10 వేల ఎకరాల్లో కంది సాగయ్యే అవకాశాలున్నాయి. జిల్లాలో సుమారు 1.60 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. దాదాపు 1.70 లక్షల బోరు బావులు ఉన్నట్లు అంచనా. మొత్తంగా దోబూచులాడుతున్న కాలంతో కర్షకులు పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని