logo

సాగు పెరిగేలా.. అవసరాలు తీరేలా..

డిమాండ్‌కు అనుగుణంగా సాగు ఉండాలి. అప్పుడే రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు వీలుంటుంది. ఇదే ఉద్దేశంతో ఉద్యాన శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది.

Published : 27 Jun 2024 01:57 IST

ఉద్యానశాఖ కార్యాచరణ 

షేడ్‌నెట్‌ కింద కూరగాయల సాగు 
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: డిమాండ్‌కు అనుగుణంగా సాగు ఉండాలి. అప్పుడే రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు వీలుంటుంది. ఇదే ఉద్దేశంతో ఉద్యాన శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. జిల్లాలోని పట్టణాలకు సరిపడా సాగు విస్తీర్ణం ఉండేలా చూడటంతోపాటు రాష్ట్ర రాజధాని వాసుల అవసరాలు తీర్చేలా ముందుకు సాగేందుకు రైతులను సమాయత్తం చేస్తున్నారు. ఇందుకోసం వానాకాలం సీజన్‌కు ప్రణాళిక ఖరారు చేశారు.
లక్ష్యం 29,705 ఎకరాలు: పంట విత్తు నాటే సమయం నుంచి కోతకొచ్చి ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించేదాకా అన్నదాతలకు కష్టాలే. దిగుబడులు ఆశించిన మేర రావడంతోపాటు గిట్టుబాటు ధర దక్కితేనే ఆరుగాలం శ్రమకు ఫలితం ఉంటుంది. వానాకాలంలో మెరుగైన దిగుబడులు, గిట్టుబాటు ధర దక్కేలా రైతులను సరైన బాటలో నడిపించే దిశగా ఉద్యాన శాఖ ముందుకు సాగుతోంది. గతేడాది వానాకాలంలో 28,291 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేశారు. ఈ సారి విస్తీర్ణం వెయ్యి ఎకరాల మేర పెరుగుతుందని అంచనా వేశారు. 29,705 ఎకరాలు సాగుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించారు. 

అన్నదాతలకు అవగాహన కార్యక్రమాలు

జిల్లాలో ఎనిమిది పురపాలక సంఘాలు ఉన్నాయి. ఆయా పట్టణాల్లో జనాభా అవసరాలకు అనుగుణంగా ఏయే కూరగాయల సాగు విస్తీర్ణం ఎంతమేర పెంచాలనే అంచనాలను సిద్ధం చేశారు. జిల్లా జనాభా 15.27 లక్షలు ఉండగా ప్రతి సంవత్సరం కూరగాయలు 1.17 లక్షల మెట్రిక్‌ టన్నులు అవసరం. జిల్లాలో 1.16లక్షల మెట్రిక్‌ టన్నుల కూరగాయలు మాత్రమే పండిస్తున్నారు. టమాట, వంకాయ అవసరానికి మించి ఉత్పత్తి అవుతున్నాయి. కొన్నిరకాల కూరగాయలు అవసరానికి మించి సాగు చేస్తుండగా మరికొన్ని అవసరాలకు సరిపడా సాగుచేయక పోవడంతో ఇతర ప్రాంతాలపై ఆధార పడాల్సి వస్తోంది. తీగజాతి కూరగాయలు సాగు తక్కువగా ఉందని అధికారులు గుర్తించారు. పండ్ల తోటల విస్తీర్ణం పెంచే అంశానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. డిమాండ్‌ను బట్టి సాగు చేయాల్సిన పంటలపై రైతులను చైతన్యం చేసేందుకు ఉద్యానశాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు.

మార్కెట్‌ సదుపాయం ఎక్కువే: గుమ్మడిదల, సంగారెడ్డి, కంది, సదాశివపేట, కొండాపూర్, జహీరాబాద్, హత్నూర, మొగుడంపల్లి, కోహీర్‌ తదితర మండలాల్లో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంది. పండ్లు, పూలు, కూరగాయలను జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో జరిగే సంతల్లో విక్రయిస్తుంటారు. ఇక్కడి నుంచే హైదరాబాద్‌కు కూడా తరలిస్తుంటారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో మిగతా జిల్లాలతో పోల్చితే జిల్లాకు అనుకూల పరిస్థితులు ఉండటంతో రైతులను ప్రోత్సహించేందుకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు.

శ్రమకు ఫలితం దక్కేలా ప్రణాళికలు

ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతుల శ్రమకు ఫలితం దక్కేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఏయే పంటలు ఎంతమేర సాగు చేయాలన్న అంశాలతో అంచనాలు రూపొందించాం. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని సాగు చేస్తేనే గిట్టుబాటు ధర దక్కేందుకు వీలుంటుంది. ఉద్యాన రైతులు లాభాల దిశగా పయనించేలా చూస్తాం.
-సోమేశ్వరరావు, ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖల జిల్లా అధికారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు