logo

భగీరథ సర్వేలో తాత్సారం

ఇంటింటికీ శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రారంభించింది.

Updated : 27 Jun 2024 05:49 IST

 గౌడిచెర్లలో ఇంటింటి సర్వే 

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌: ఇంటింటికీ శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ప్రజలు, కుటుంబాలు పెరిగాయి. నీటి వినియోగం అధికమైంది. ఇందుకు అనుగుణంగా అధిక నీటిని సరఫరా చేసేందుకు ఇంటింటి సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలో సర్వే ప్రారంభమైనప్పటికీ నత్తనడకన సాగుతోంది. ఇప్పటికే పలుసార్లు జిల్లా అధికారులు గడువు పొడిగించినప్పటికీ పురోగతి కనిపించడం లేదని అధికారులు అనధికారికంగా అభిప్రాయపడుతున్నారు. 

గడువు పెంచినప్పటికీ..

జిల్లాలో ఇంటింటి సర్వేను ఈ నెల 20లోగా పూర్తి చేయాలని జిల్లా అధికారులు క్షేత్ర అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని గుర్తించిన అధికారులు గడువును ఈ నెల 30 వరకు పొడగించారు. పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, ఉపాధి హామీ సిబ్బంది కలిసి సర్వే చేయాలని ఆదేశాలున్నప్పటికీ.. పంచాయతీ కార్యదర్శులే సర్వేలో పాల్గొంటున్నారు. ప్రాంతాల వారీగా కొన్ని చోట్ల 50-60 శాతం, మరికొన్ని ప్రాంతాల్లో 90 శాతం వరకు సర్వే పూర్తయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. పంచాయతీ కార్యదర్శులు రెండు మూడు గ్రామాలకు ఒకరే ఉండటం, వారు ఇతర విధుల్లోనూ పాల్గొంటుండటంతో సర్వే ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని పలువురు పేర్కొంటున్నారు. 

ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలి

జిల్లాలో మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సరఫరా అవుతున్న నీటి వివరాలు సేకరించడం, అదనపు నీటి అవసరాలు గుర్తించేందుకు కలెక్టర్‌ ఆదేశాలతో సర్వే నిర్వహిస్తున్నాం. ఆయా వివరాలు ప్రత్యేక యాప్‌లో నమోదు చేయిస్తున్నాం. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం. ఈ నెల 30లోపు సర్వే పూర్తి చేయాలి. లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగాలి.

- ఎస్‌కే పాషా, ఈఈ, మిషన్‌ భగీరథ.


మిషన్‌ భగీరథ స్వరూపం ఇలా..

  • మండలాలు: 27
  • మొత్తం ఆవాస ప్రాంతాలు :943
  • జిల్లాలో కుటుంబాలు: 2,41,773
  • నల్లా కనెక్షన్లు: 2,53,747 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు