logo

బైకులు కొల్లగొట్టి.. ఆన్‌లైన్‌లో బేరానికిపెట్టి!

కారు డ్రైవరుగా పనిచేసే అతని గురంతా అత్యాధునిక బైకులపైనే.. వాటికి ఉండే డిమాండ్‌ దృష్ట్యా అపహరించడం.. రాష్ట్ర వ్యాప్తంగా వాటిపైనే తిరగడం..

Published : 27 Jun 2024 01:34 IST

అంతర్‌ జిల్లా దొంగ అరెస్టు

19 వాహనాలు, రూ.45 వేలు స్వాధీనం

నిందితుడితో సీపీ అనూరాధ, అదనపు డీసీపీ మల్లారెడ్డి, సీఐ లక్ష్మీబాబు తదితరులు 

సిద్దిపేట టౌన్, న్యూస్‌టుడే: కారు డ్రైవరుగా పనిచేసే అతని గురంతా అత్యాధునిక బైకులపైనే.. వాటికి ఉండే డిమాండ్‌ దృష్ట్యా అపహరించడం.. రాష్ట్ర వ్యాప్తంగా వాటిపైనే తిరగడం.. ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టడం.. వచ్చిన సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడుపుతుంటాడు. ఇప్పటికే నాలుగుసార్లు జైలుకు వెళ్లివచ్చినా బుద్ధిమార్చుకోలేదు. అంతర్‌జిల్లా దొంగగా పేరు గాంచిన అతన్ని తాజాగా సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేసి 19 అత్యాధునిక బైకులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కమిషనరేట్‌లో సీపీ అనూరాధ బుధవారం వివరాలు వెల్లడించారు. నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం ధర్మారం గ్రామానికి చెందిన కుమ్మరి సాయికుమార్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. జల్సాలకు అలవాటు పడి అత్యాధునిక ద్విచక్రవాహనాలు చోరీ చేస్తున్నాడు. రెండేళ్ల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, మెదక్, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో 19 బైకులను అపహరించాడు. వాటిపైనే జిల్లాలు తిరుగుతూ.. అనుమానం రాకుండా కొన్నింటిని ఆన్‌లైన్‌లో విక్రయిస్తాడు. తద్వారా వచ్చే సొమ్ముతో జల్సాలు చేస్తుంటాడు. సిద్దిపేటలోని గణేశ్‌నగర్‌కు చెందిన విఠాల రవికుమార్‌ ద్విచక్ర వాహనం మార్చి 26న అపహరణకు గురైంది. సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. వన్‌టౌన్‌ సీఐ లక్ష్మీబాబు, ఎస్సై నరసింహారావు ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం మోడ్రన్‌ బస్టాండ్‌ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా ద్విచక్ర వాహనంపై సాయికుమార్‌ అనుమానాస్పదంగా కనిపించాడు. అదుపులోకి తీసుకొని విచారించగా.. తొమ్మిది జిల్లాల్లో చేసిన వాహనాల చోరీల చిట్టా విప్పాడు. అతని నుంచి 19 బైకులు, రూ.45 వేలు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన వన్‌టౌన్‌ సీఐ లక్ష్మీబాబు బృందాన్ని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. అదనపు డీసీపీ మల్లారెడ్డి, ఏసీపీ మధు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని