logo

చిన్నతరహా.. ఉపాధి మెరువ..

యువతను ప్రోత్సహిస్తున్నాంచిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహిస్తున్నాం.

Published : 27 Jun 2024 01:30 IST

ఉమ్మడి మెదక్, వికారాబాద్‌ జిల్లాల్లో ప్రోత్సహిస్తే ప్రయోజనం

సంగారెడ్డిలో అవగాహన కల్పిస్తున్న అధికారులు 

 

  • గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో సంగారెడ్డి జిల్లాలో 272 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వాటిలో   రూ.3,455 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ పరిశ్రమలతో 17,950 మందికి ఉపాధి లభిస్తోంది. ఈ సంవత్సరం 55 ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు వచ్చాయి.
  • సిద్దిపేట జిల్లాలో రూ.3,949 కోట్ల పెట్టుబడితో 174 పరిశ్రమలు ఏర్పాటు చేశారు. వీటిలో 8,826 మందికి ఉపాధి లభిస్తోంది.
  •  వికారాబాద్‌ జిల్లాలో 8 మాత్రమే చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 30 ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో అందరికీ కొలువులు దక్కడం కష్టమే. నిరుద్యోగిత తగ్గాలంటే ప్రధానంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల్సిందే. ఇదే ఉద్ధేశంతో ప్రభుత్వం పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తోంది. యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి సహకారం అందిస్తోంది. చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటుచేసే వారికి రాయితీ పథకాలు సైతం అమలుచేస్తోంది. నేడు ‘సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహక దినోత్సవం’ సందర్భంగా కథనం.
ద్వితీయ స్థానంలో సంగారెడ్డి: పారిశ్రామికంగా సంగారెడ్డి జిల్లా ఇప్పటికే అభివృద్ధి పథంలో ఉంది. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల్లో ఈ సంవత్సరం జిల్లా రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో ఉండటం విశేషం. చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుకు ప్రోత్సాహం మాత్రం అంతంతమాత్రంగా ఉంది. ప్రభుత్వపరంగా సాయం అందిస్తే చిన్నతరహా పరిశ్రమలు భారీగా నెలకొల్పేందుకు యువత సిద్ధంగా ఉంది. మెదక్, సిద్దిపేట, వికారాబాద్‌ జిల్లాల్లోనూ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నా ప్రోత్సాహం కరవైంది.
బ్యాంకర్లు సందేహాలు తీర్చాలి: ప్రభుత్వం రాయితీ నిధుల్ని ఆలస్యంగానైనా విడుదల చేస్తున్నా బ్యాంకర్ల తీరుతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారు కావడంతో తాము ఇచ్చే రుణాన్ని తిరిగి చెల్లిస్తారో లేదోనన్న అనుమానిస్తున్నారు. ప్రభుత్వం రాయితీ మంజూరు చేసినా బ్యాంకు రుణం అందకపోవడంతో యూనిట్లు గ్రౌండింగ్‌కు నోచని పరిస్థితి. బ్యాంకు అధికారులు తీరు మార్చుకుంటే ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది.
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల విజ్ఞప్తులు ఇవీ: చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వమే భూమి కేటాయించాలి. ప్రస్తుతం భూముల ధరలు పెరగడంతో భూమిని కొనుగోలు చేసి పరిశ్రమల ఏర్పాటు కష్టంగా మారింది.

  • వ్యవసాయానికి ఇస్తున్న మాదిరిగా ఏడాది వరకైనా ఉచిత విద్యుత్తు నిరంతరం ఇవ్వాలి.
  •  నీటి కనెక్షన్‌ సదుపాయం కల్పించాలి.
  •  రాయితీ నిధుల విడుదల జాప్యం లేకుండా చూడాలి.
  •  బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు అధికారులు చొరవ చూపాలి.

న్యూస్‌టుడే, జిన్నారం: జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో మూడేళ్ల క్రితం ఎంఎస్‌ఎంఈ ద్వారా రూ.5 కోట్ల రుణం పొందిన ఓ పరిశ్రమ లక్ష్యం దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం పరిశ్రమ ద్వారా రూ.18 కోట్ల టర్నోవర్‌ సాగుతుండగా 65 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. పరోక్షంగా మరో 40 మందికి ప్రయోజనం కలుగుతుంది. ఏటా రూ.20 లక్షల దాకా వివిద రకాల ప్రభుత్వ సంస్థలకు పన్నుల రూపేణా చెల్లిస్తుంది.

  • ఖాజీపల్లి పారిశ్రామిక వాడలో రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన యూనిట్‌ రూ.4 కోట్ల రుణం పొందింది. ఎలక్ట్రానిక్స్‌ సామగ్రిని తయారు చేసే ఈ పరిశ్రమ వల్ల 45 మంది ప్రత్యక్షంగా 32 మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వ విభాగాలకు రూ.12 లక్షల దాకా పన్నులు చెల్లిస్తున్నారు. సమీపంలో హోటల్‌ వంటి వ్యాపారాలు చేసుకుంటున్నారు.
  • ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో ఎలక్ట్రిక్‌ ఉత్పత్తులు చేసే పరిశ్రమను రూ.8 కోట్లతో ఏర్పాటు చేశారు. నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన ఈ యూనిట్‌ టర్నోవర్‌ 22 వేలకు చేరింది. 80 మందికి ఉపాధిని ఇవ్వటంతో పాటు రూ.30 లక్షల దాకా పన్నులు చెల్లిస్తున్నారు.

    యువతను ప్రోత్సహిస్తున్నాం

చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహిస్తున్నాం. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా అందిన దరఖాస్తులను పరిశీలించి ఎప్పటికప్పుడు అనుమతులు జారీ చేస్తున్నాం. పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటికే 55 పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయి.

ప్రశాంత్‌కుమార్, జిల్లా పరిశ్రమ కేంద్రం జనరల్‌ మేనేజర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని