logo

కలల గూడు.. సాకారమయ్యేదెప్పుడు?

పేద ప్రజల సొంతింటి కల నేరవేర్చేందుకు తూప్రాన్‌ పురపాలిక కేంద్రానికి 2018లో అప్పటి ప్రభుత్వం రూ.25.25 కోట్ల నిధులు మంజూరు చేసింది.

Updated : 27 Jun 2024 05:56 IST

ఆరేళ్లు గడిచినా అసంపూర్తిగా పనులు

తూప్రాన్‌లో రెండు పడక గదుల ఇళ్లు ఇలా..

న్యూస్‌టుడే, తూప్రాన్‌: పేద ప్రజల సొంతింటి కల నేరవేర్చేందుకు తూప్రాన్‌ పురపాలిక కేంద్రానికి 2018లో అప్పటి ప్రభుత్వం రూ.25.25 కోట్ల నిధులు మంజూరు చేసింది. మొత్తం 504 ఇళ్ల నిర్మాణానికి 2018లో పనులు ప్రారంభించారు. ఇవి ఆగుతూ సాగుతూ కొనసాగాయి. రెండేళ్ల క్రితం 300 గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగతా వాటిని మూడు నెలల్లో పూర్తి చేస్తామని అప్పటి పాలకులు, అధికారులు చెప్పారు. రెండేళ్లు గడుస్తున్నా అతీగతీ లేదు. రెండు పడక ఇళ్లకు సంబంధించి కొన్ని స్లాబ్‌లు పూర్తవ్వగా మరికొన్ని గోడల వరకు పూర్తయ్యాయి. 50పైగా పునాదుల స్థాయిలోనే ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సొంతింటి కల తీరుతుందని లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పాలకులు, అధికారులు వీటి పురోగతిపై ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు. దీంతో మరికొన్నాళ్లు ఎదురుచూపులు తప్పేలా లేవు.

పట్టాలిచ్చి.. పనులు మరిచి..

మొదటి విడతలో 240 మందికి మాజీ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. వారు గృహ ప్రవేశం చేశారు. మిగతా వారికి ఇవ్వకపోవడంతో వారు ఒకింత నిరసన తెలిపారు. దీంతో రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు పనులు పూర్తి కాకుండానే 60 మందికి పట్టాలు పంపిణీ చేశారు. వారు చివరి దశలో ఉన్న పనులను పూర్తి చేసుకొని గృహప్రవేశం చేశారు. ఆర్థికంగా లేని పేదలు మాత్రం ప్రభుత్వం పనులు ఎప్పుడు చేస్తుందోనని ఆశతో ఎదురు చూస్తున్నారు. 


కొత్త ప్రభుత్వానికి నివేదికలు పంపించాం
-మధుసూదన్, ఏఈ పంచాయతీరాజ్‌ తూప్రాన్‌

తూప్రాన్‌లో 32 ఇళ్లు మాత్రం ప్రారంభం కాలేదు. మరికొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. ఈ విషయమై కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ఎన్ని గృహాలు ఏఏ స్థాయిలో ఉన్నాయో సమగ్ర వివరాలను ఉన్నతాధికారులను అందజేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే దాని ప్రకారం నడుచుకుంటాం.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని