logo

ఆన్‌లైన్‌లో నిత్యావసరాల నమోదు

వసతిగృహాల్లో ఉండే వస్తువులు పక్కదారి పట్టకుండా మరింత సమర్థంగా నిర్వహణ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది

Published : 27 Jun 2024 01:05 IST

కస్తూర్బా పాఠశాలల్లో అమలు
అక్రమాలకు చెక్‌ పెట్టనున్న ప్రభుత్వం

చిన్నశంకరంపేట కస్తూర్బాలో వివరాలు నమోదు చేస్తున్న ప్రత్యేక అధికారిణి గీత 

న్యూస్‌టుడే, మెదక్‌ : వసతిగృహాల్లో ఉండే వస్తువులు పక్కదారి పట్టకుండా మరింత సమర్థంగా నిర్వహణ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే అధికారులు హాస్టల్‌ మేనేజ్‌మెంట్‌ ఆన్‌లైన్‌ సిస్టం రూపకల్పన చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. 
జిల్లాలో కేజీబీవీలు 15 వరకు ఉన్నాయి. వీటిలో 4,022 మంది విద్యార్థినులు చదువుతున్నారు. పాఠశాలలకు నిత్యావసర సరకులు, కూరగాయలు, తదితర సామగ్రి సరఫరాకు జిల్లాస్థాయిలో టెండర్లు పిలిచి గుత్తేదారులను ఎంపిక చేసి అందిస్తున్నారు. ప్రతి రోజూ వచ్చిన సరకుల ప్రారంభ నిల్వ, వినియోగించాక ముగింపు నిల్వలను రికార్డుల్లో రాస్తున్నారు. విద్యాలయాల్లో అకౌంటెంట్లు ఈ విధులను నిర్వహిస్తున్నారు. 

పక్కా పర్యవేక్షణ...

మండల, జిల్లాస్థాయి అధికారులు తనిఖీలు చేసి రికార్డుల పరిశీలించినప్పుడు సరకుల కొరత నిల్వల్లో తేడాలు గుర్తిస్తున్నారు. నిబంధనల మేరకు చికెన్, పాలు, గుడ్లు సరఫరా చేయకుండా టెండరుదారుతో కుమ్మకై పక్కదారి పట్టించడం లాంటి అక్రమాలు గతంలో బయటపడ్డాయి. కొన్ని సార్లు సరకుల వివరాల నమోదు చేయని సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టి వాటి ఉపయోగాన్ని, నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు తీసుకొచ్చిన ఆన్‌లైన్‌ సిస్టం ద్వారా రోజూ సమగ్ర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

నమోదు చేయాల్సినవి...

నిత్యం http:- /// Scholledu.- telangana.- gov.- in /KGBV_UAT/scholl  వెబ్‌సైట్‌లో విద్యార్థుల సంఖ్య, క్రితం రోజు ముగింపు నిల్వ ఆరోజు ప్రారంభ నిల్వగా పేర్కొంటూ ఏ రోజుకారోజు గుత్తేదారు అందించిన సరకుల వివరాలు ఎంతమేర వంటలకు వినియోగించారు.. రాత్రి భోజనం తర్వాత ఎంతమేర నిల్వ ఉందో నమోదు చేయాలి. గత నెలలో కస్తూర్బా పాఠశాలల్లో ట్రయల్‌రన్‌ చేసి ఈనెల నుంచి అమలు చేస్తున్నారు. దీంతో గుత్తేదారు సకాలంలో సరకులు తెస్తున్నారా లేదా అనేది ఉన్నతాధికారులు నిత్యం గమనించే అవకాశం ఉంటుంది. రోజువారీ నిర్వహణలో నగదు చెల్లించాల్సి వస్తే ఆ వివరాలు కూడా నమోదు చేసేలా వీలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం కేవలం కస్తూర్బా పాఠశాలల్లో మాత్రమే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. త్వరలో ఆదర్శ పాఠశాల, గురుకులాల్లో అమలు చేయనున్నారు.


ఉన్నతాధికారుల ఆదేశాలతో అమలు  -సుకన్య, జీసీడీవో 

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కస్తూర్బా పాఠశాలల్లో హస్టల్‌ మేనేజ్‌మెంట్‌ ఆన్‌లైన్‌ సిస్టం అమలు చేస్తున్నాం. ప్రతి రోజూ ప్రత్యేక అధికారిణులు అన్ని వివరాలు పొందుపర్చాలన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు