logo

వ్యయం తగ్గి.. వెలుగులు పంచేలా

విద్యుత్తు ఖర్చులు తగ్గించుకునేందుకు తూప్రాన్‌ పురపాలిక అధికారులు ప్రత్యామ్నాయ చర్యలకు శ్రీకారం చుట్టారు. కార్యాలయానికి సౌర విద్యుత్తు అందించేందుకు సర్వం సిద్ధం చేశారు.

Published : 26 Jun 2024 01:34 IST

తూప్రాన్‌ పురపాలిక కార్యాలయంపై సౌర పలకలు 

భవనంపై ఏర్పాటు ఇలా.. 

న్యూస్‌టుడే, తూప్రాన్‌: విద్యుత్తు ఖర్చులు తగ్గించుకునేందుకు తూప్రాన్‌ పురపాలిక అధికారులు ప్రత్యామ్నాయ చర్యలకు శ్రీకారం చుట్టారు. కార్యాలయానికి సౌర విద్యుత్తు అందించేందుకు సర్వం సిద్ధం చేశారు. రూ.20లక్షలకు పైగా నిధులతో కార్యాలయంపై సౌర పలకలను ఏర్పాటు చేశారు. పురపాలిక కార్యాలయంతో పాటు విభాగినులపై ఏర్పాటు చేసిన విద్యుత్తు దీపాలకు నెలకు రూ.2లక్షల వరకు కరెంటు బిల్లులు వస్తున్నాయి. ఈ వ్యయాన్ని తగ్గించుకునేందుకు అధికారులు ఆలోచనలు చేశారు. జిల్లా కలెక్టర్‌ అనుమతితో రూ.20.60లక్షల నిధులతో సౌర పలకల యూనిట్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా పురపాలిక కార్యాలయం, విభాగినులపై ఏర్పాటు చేసిన దీపాలకు సైతం విద్యుత్తును వినియోగించేలా ప్రణాళికలు చేశారు. ప్రస్తుతం కార్యాలయంపై సౌర పలకల బిగింపు పూర్తయ్యింది. త్వరలోనే దీనిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

రూ.24లక్షలకు పైగా ఆదా

తూప్రాన్‌ పురపాలికలో నెలకు రూ.2లక్షలకు పైగా విద్యుత్తు బిల్లులను చెల్లిస్తున్నారు. ఇలా ఏడాదికి రూ.24లక్షలకు పైగా వ్యయం అవుతోంది. సౌర పలకల ద్వారా ఏడాదిలో ఈ వ్యయం పూర్తికానుంది. 5 ఏళ్ల వరకు గ్యారంటీ ఉండగా 30ఏళ్ల వరకు వినియోగంలో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో దీని ద్వారా ఉత్పత్తి అయ్యే మిగులు విద్యుత్తును సైతం విద్యుత్తు శాఖకే విక్రయించేందుకు వెసులుబాటు ఉంది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలపై వీటిని ఏర్పాటు చేయగా పురపాలిక కార్యాలయంపై ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ఇది విజయవంతమైతే  ఉమ్మడి జిల్లాలోని అన్ని పురపాలిక కార్యాలయాలపై దీనిని ఏర్పాటు చేసేందుకు ఆలోచనలు చేస్తున్నారు. ఈ వారం రోజుల్లోనే దీనిని ప్రారంభించి సోలార్‌ ద్వారానే విద్యుత్తు వెలుగులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం బిల్లులు అధికంగా రావడంతో కొన్ని విద్యుత్తు దీపాలను సైతం పూర్తిగా ఆన్‌ చేయడం లేదు. ప్రస్తుతం ఆ ఇబ్బందులు తొలగనుండటంతో రాత్రి సమయంలో నిరంతరం పురపాలికలో విద్యుత్తు వెలుగులు విరజిమ్మనున్నాయి.

సద్వినియోగం చేసుకుంటాం: ఖాజామొయినొద్దీన్, కమిషనర్‌ పురపాలిక, తూప్రాన్‌

తూప్రాన్‌ పురపాలిక కార్యాలయంపై రూ.20లక్షలకు పైగా నిధులతో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్తును పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం. ప్రధానంగా పురపాలిక కార్యాలయంలో విద్యుత్తు బిల్లులను ఆదా చేసేందుకే దీనిని ఏర్పాటు చేశారు. దీని నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని