logo

అతివలకు అండగా మెప్మా

మహిళా సంఘాల బలోపేతం కోసం పురపాలికలు కృషి చేస్తున్నాయి. గతేడాది అన్ని పురపాలికల్లో వంద శాతంపైగా రుణ లక్ష్యాలను సాధించాయి.

Published : 26 Jun 2024 01:27 IST

బ్యాంకు లింకేజీ రుణాలతో ఆర్థికాభివృద్ధి

సమావేశంలో సూచనలిస్తున్న మెప్మా అధికారులు 

న్యూస్‌టుడే-మెదక్‌: మహిళా సంఘాల బలోపేతం కోసం పురపాలికలు కృషి చేస్తున్నాయి. గతేడాది అన్ని పురపాలికల్లో వంద శాతంపైగా రుణ లక్ష్యాలను సాధించాయి. అదే ఉత్సాహంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మహిళా సంఘాలకు బ్యాంక్‌ లింకేజీ రుణాలు ఇచ్చేందుకు కార్యాచరణను ప్రారంభించాయి. జిల్లాలోని నాలుగు పురపాలికల్లో రూ.33.54 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బ్యాంకర్లను సంప్రదించి రుణాలు ఇప్పించే బాధ్యతను మెప్మా సీవోలు, ఆర్పీలకు అప్పగించారు. రుణాలు లభిస్తే స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) పురపాలికల్లో మహిళా సంఘాలను ఏర్పాటు చేసి రుణాలు అందించి తోడ్పాటు అందిస్తోంది. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం... 

గతేడాది రూ.46.01 కోట్లు

2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆయా పురపాలికల్లో రుణాలను అందించారు. నాలుగు పురపాలికల్లో 379 సంఘాలకు రూ.32.15 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, 456 సంఘాలకు రూ.46.01 కోట్లు సంఘాలకు అందజేశారు. జిల్లా కేంద్రం మెదక్‌లో 165 సంఘాలకు రూ.17.83 కోట్లు, తూప్రాన్‌లో 106 సంఘాలకు రూ.11.18 కోట్లు, నర్సాపూర్‌లో 108 సంఘాలకు రూ.9.18 కోట్లు, రామాయంపేటలో 77 సంఘాలకు రూ.7.81 కోట్లు పంపిణీ చేశారు. సంఘాల పరంగా కాకుండా బ్యాంకు లింకేజీ పరంగా 143శాతం రుణాలను అందజేశారు. ఈ రుణాలతో మహిళలు ఎంబ్రాయిడరీ, మగ్గం పనులు, టైలరింగ్, బ్యూటీపార్లర్, గాజులు, చెప్పుల దుకాణాలను ఏర్పాటు చేసుకోగా, పలువురు పచ్చళ్ల తయారీ చేపడుతున్నారు. మరికొందరు మహిళలు వారి కుటుంబ సభ్యులు నిర్వహించే వ్యాపార నిర్వహణకు వినియోగిస్తున్నారు. ఇంకా కొందరు పాడి గేదెలను కొనుగోలు చేసి పాలను విక్రయిస్తున్నారు. ఇటీవల ఆయా పురపాలికల్లో సంఘాల సభ్యులు ప్రభుత్వ పాఠశాలల ఏకరూప దుస్తులను కుట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అందజేసే రుణాల లక్ష్యం ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు.

లక్ష్యం సాధిస్తాం: ఇందిర, జిల్లా మిషన్‌ కో-ఆర్డినేటర్, మెప్మా

గతేడాది ఆయా పురపాలికల్లో బ్యాంకు లింకేజీపరంగా శతశాతం రుణాలను అందజేశాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 396 సంఘాలకు రూ.33.54 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించాం. బ్యాంకర్ల సహకారంతో మహిళా సంఘాలకు రుణాలు అందిస్తాం. రుణం తీసుకున్న మహిళలు సకాలంలో చెల్లించాలి. అప్పుడే తిరిగి కొత్త రుణాలు ఇచ్చేందుకు వీలుంటుంది. తీసుకున్న రుణాలను సంఘాల బాధ్యులు సద్వినియోగం చేసుకుంటున్నారు. వ్యాపారాభివృద్ధికి వినియోగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని