logo

ఉపాధికి బాసట

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు దక్కని పరిస్థితి.

Published : 26 Jun 2024 01:24 IST

పీఎంఈజీపీ ద్వారా నిరుద్యోగులకు రాయితీ రుణాలు

గొల్లగూడెంలో పాడి పశువుల యూనిట్‌ను పరిశీలిస్తూ.. 

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్, సిద్దిపేట, మెదక్, జోగిపేట, పుల్కల్, వికారాబాద్‌ కలెక్టరేట్‌: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు దక్కని పరిస్థితి. ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లోనూ ఖాళీలు లేకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది. నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చి స్వయం ఉపాధి పొందేలా చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం రాయితీ రుణ పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మేలు చేకూర్చేందుకు వీలుగా ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రొగ్రాం (పీఎంఈజీపీ) ద్వారా స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేస్తూ ప్రోత్సహిస్తుండటం విశేషం.
విభాగాల ద్వారా..: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందడుగేసింది. ఇందులో భాగంగా కొత్త ప్రాజెక్టులు, కుటీర పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిందే పీఎంఈజీపీ. ఆసక్తి ఉన్న యువత నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఎంపికైన వారికి రాయితీ రుణాలు అందజేస్తూ చేయూత అందిస్తున్నారు. ఇందులో ఉత్పత్తి పరిశ్రమలకు, వ్యక్తులు, సంస్థలకు రూ.25 లక్షలు, ఉత్పత్తేర (సర్వీసు) పరిశ్రమలకు రూ.10 లక్షల వరకు రాయితీ రుణాలు అందజేస్తారు. డీఐసీ (డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రియల్‌ సెంటర్‌), కేవీఐసీ (ఖాదీ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌), కేవీఐబీ (ఖాదీ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు) విభాగాల ద్వారా యూనిట్లు మంజూరు చేస్తున్నారు.

ఎప్పుడైనా దరఖాస్తుకు అవకాశం

పీఎంఈజీపీ సాయం పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు అంటూ ఏదీ ఉండదు. ఇది నిరంతర ప్రక్రియ.www.kviconline.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలి. వివిధ రకాల ధ్రువపత్రాలు సమర్పించాలి. దరఖాస్తులను బ్యాంకులకు పంపిస్తారు. నిర్దేశించిన మేర అర్హతలు ఉండి ఎంపికైన అభ్యర్థుల ఖాతాల్లో రాయితీ నిధులు జమ చేస్తారు.

సాంకేతికతను జోడించి..

పరిపూర్ణాచారి స్వగ్రామం పుల్కల్‌. సంగారెడ్డిలోని తారా కళాశాలలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు యత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో తమ కులవృత్తి వడ్రంగిని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. సాంకేతికతను జోడిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయన్న లక్ష్యంతో పీఎంఈజీపీ పథకానికి దరఖాస్తు చేశారు. 35 శాతం రాయితీతో రూ.10 లక్షల రుణం మంజూరైంది. సీఎన్‌సీ డిజైనింగ్‌ యంత్రం కొనుగోలు చేశారు. దీంతో పనిని వేగంగా పూర్తిచేయగలుగుతున్నారు. మరో ఐదుగురికి ఉపాధి చూపుతున్నారు.

రూ.20 లక్షల రుణంతో..

బెజ్జంకికి చెందిన భువనగిరి గంగారాం భవన నిర్మాణ రంగంలో సెంట్రింగ్‌ పనులు చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయం చేస్తున్నారు. రెండు నెలల కిందట పీఎంఈజీపీ కింద 35 శాతం రాయితీపై రూ.20 లక్షలు రుణంగా తీసుకున్నారు. వీటితో భవన నిర్మాణ సంబంధిత సామగ్రిని పెద్దమొత్తంలో కొనుగోలు చేశారు. కొన్ని రోజులుగా పెద్ద భవనాల నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. తద్వారా మరో 20 మందికి పని కల్పించే స్థాయికి చేరారు. సిద్దిపేటలోని యూనియన్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో తరగతులకు హాజరై నైపుణ్యాన్ని పెంచుకున్నారు. తన పనిలో మరింత పట్టు సాధించారు.

సద్వినియోగం చేసుకోవాలి: 

ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రాయితీ రుణాలకు ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం రాయితీ నిధుల్ని మంజూరు చేసినప్పుడు గ్రౌండింగ్‌ చేసేలా చర్యలు తీసుకుంటాం. ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది.

ప్రశాంత్‌కుమార్, జిల్లా పరిశ్రమ కేంద్రం జనరల్‌ మేనేజర్, సంగారెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని