logo

మల్లన్న ఆలయ నిర్వహణ ఇష్టారాజ్యం

కొమురవెల్లి మల్లన్న ఆలయ నిర్వహణలో రోజుకో వివాదం.. అక్రమం వెలుగుచూస్తున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్ర ప్రతిష్ఠ మసకబారేలా చేస్తున్నాయి.

Published : 26 Jun 2024 01:17 IST

ఇన్‌ఛార్జి ఈవోతో కొరవడిన పాలన

కొమురవెల్లి మల్లన్న ఆలయం

న్యూస్‌టుడే, చేర్యాల: కొమురవెల్లి మల్లన్న ఆలయ నిర్వహణలో రోజుకో వివాదం.. అక్రమం వెలుగుచూస్తున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్ర ప్రతిష్ఠ మసకబారేలా చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు నుంచీ ఏటా లక్షలాది భక్తులు మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. ఏటా రూ.18 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వానికి ఆలయ నిర్వహణపై పట్టింపు ఉండటం లేదు. పూర్తికాలం కార్యనిర్వహణాధికారిని నియమించకపోవడంతో స్థానిక సిబ్బంది, నాయకుల ఇష్టారాజ్యంగా మారింది. మూడున్నరేళ్లుగా ఇన్‌ఛార్జి పాలనలో రోజుకో వివాదం వెలుగు చూశాయి. తాజాగా సిబ్బంది పరస్పరం దాడులు చేసుకోవడం గమనార్హం.


హాజరు పుస్తకంలో దిద్దుబాట్లు 

ఎవరికి వారే.. హాజరు తీరే..

  • ఈ ఏడాది ఫిబ్రవరిలో వీఐపీ, దాతల ఉచిత పాసులను విక్రయించిన అక్రమం వెల్లడైంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పొరుగు సేవలు, తాత్కాలిక సిబ్బంది అక్రమాలకు తెర లేపారు. బ్రహ్మోత్సవాలలో దర్శనం పాసులను ఒక్కోటి రూ.1,500కు అమ్మారు. ఐదుగురు సిబ్బందిపై పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.
  • ‘మల్లన్న’ ఆలయంలో 2020-21 నుంచి 2022-23 వరకు గుడికి సంబంధించిన ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్‌ విషయంలో అధికారులు నమ్మిన ప్రైవేటు ఆడిటర్‌ ధనుంజయ్‌ (హైదరాబాద్‌) మోసం చేశాడు. ఒప్పందం ప్రకారం మూడేళ్లకు రూ.17.50 లక్షలు ఆలయ అధికారులు అతడికి ఇచ్చారు. ప్రభుత్వానికి కేవలం రూ.3.30 లక్షలు మాత్రమే చెల్లించాడు. ఆడిటర్‌ను అరెస్టు చేసి, డబ్బు రికవరీ చేశారు.
  • కల్యాణోత్సవం పురస్కరించుకొని ముఖ్య అతిథుల కోసం తెచ్చిన పరుపులను అపహరించారు. రూ.లక్ష విలువైన ప్లంబర్‌ సామగ్రి చోరీకి గురైంది.
  • కొందరు అధికారులు, సిబ్బంది వారానికి ఒకటి, రెండు రోజులు మాత్రమే విధులకు హాజరవుతారు. వచ్చిన రోజే హాజరు పుస్తకంలో పాత తేదీల్లో సంతకాలు చేసుకుంటారు. ఇది ఇక్కడ సర్వసాధారణం. గైర్హాజరని, సెలవని ఈవో రిజిస్టరులో రాసినా దాని పైనే సిబ్బంది కొందరు సంతకాలు చేయడం గమనార్హం. ఈ వ్యవహారమే ఇటీవల సిబ్బంది దాడి చేసుకునేలా చేసింది.

రెండు రోజులే ఈవో..

ఆలయానికి ఇన్‌ఛార్జి ఈవో ఉండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతమున్న ఆలూరు బాలాజీకి మరో మూడు చోట్ల అదనపు బాధ్యతలున్నాయి. వారానికి రెండు రోజులు మాత్రమే కొమురవెల్లికి రాగలుగుతున్నారు. పూర్తిస్థాయి ఈవో లేక అభివృద్ధి పనుల్లో జాప్యం అవుతోంది. ప్రస్తుతం సుమారు రూ.30 కోట్ల పనులు కొనసాగుతున్నాయి. 2018లో మంజూరైన 50 గదుల ధర్మశాల నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. వీటికి తోడు అత్యధునిక క్యూకాంప్లెక్స్, ‘మల్లన్న’ గుట్టపై త్రిశూలం, డమరుకం ఏర్పాటు చేయాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని