logo

అటవీ విద్య.. భవితకు మార్గదర్శి

ఉన్నత విద్యా ప్రమాణాలు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం.. అన్ని స్థాయిల్లో అటవీ శాఖ అధికారులను అందించాలన్న సంకల్పంతో ఏర్పాటైంది అటవీ కళాశాల పరిశోధనా కేంద్రం.

Updated : 26 Jun 2024 05:52 IST

దరఖాస్తుకు 27వ తేదీ చివరి గడువు

క్షేత్రస్థాయి సందర్శనలో విద్యార్థినులు 

న్యూస్‌టుడే, ములుగు: ఉన్నత విద్యా ప్రమాణాలు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం.. అన్ని స్థాయిల్లో అటవీ శాఖ అధికారులను అందించాలన్న సంకల్పంతో ఏర్పాటైంది అటవీ కళాశాల పరిశోధనా కేంద్రం. ఇప్పటికే ఎంతోమందికి ఉద్యోగాలు దక్కాయి. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడి విశేషాలు, కళాశాలలో చేరే తీరు, తదితర అంశాలపై కథనం.
అటవీ నిర్వహణను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అటవీ విద్యను ప్రవేశపెట్టింది. ఇందుకు 2016లో అటవీ విద్యకు సంబంధించి బీఎస్సీ కోర్సును ప్రారంభించారు. మొదట్లో హైదరాబాద్‌ కొంపల్లి సమీపంలోని దూలపల్లి ఫారెస్ట్‌ అకాడమీలో కళాశాలను షురూ చేశారు. 2018లో సిద్దిపేట జిల్లా ములుగులో సొంత భవనాలను నిర్మించగా.. అప్పటి సీఎం కేసీఆర్‌ కళాశాలను ప్రారంభించారు. ప్రస్తుతం బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు.

రూ.72 కోట్లు.. 52 హెక్టార్లు

అటవీ కళాశాల పరిశోధనా కేంద్రానికి సంబంధించిన భవనాలను రూ.72 కోట్లతో నిర్మించారు. అధునాతన సౌకర్యాలతో కూడిన తరగతి గదులు, పరిశోధనా కేంద్రాలు, విద్యార్థిని విద్యార్థులకు వేర్వేరుగా వసతి గృహాలు కొలువుదీరాయి. అధ్యాపకులు, సిబ్బంది ఉండేందుకు ప్రత్యేకంగా వసతిగృహాలను ఏర్పాటుచేశారు. పరిశోధన కేంద్రానికి 52 హెక్టార్లను కేటాయించారు. ఆటలాడేందుకు మైదానాన్ని ఏర్పాటు చేశారు. 

కోర్సుల వివరాలు..

బీఎస్సీలో ఏటా 65 మందికి ప్రవేశం కల్పిస్తున్నారు. ఎమ్మెస్సీలో 20 మంది చేరేందుకు అవకాశం ఉంది. పీహెచ్‌డీలో ఐదు నుంచి పది మందికి మాత్రమే అవకాశం. ఇప్పటివరకు అటవీ శాస్త్రంలో బీఎస్సీ పూర్తిచేసిన 250 మంది విద్యార్థులు బయటకు వెళ్లారు. వీరిలో కొందరు ఉద్యోగాలు సాధించగా, మరికొందరు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. ఎమ్మెస్సీ పూర్తిచేసిన 40 మంది ఇక్కడి నుంచి బయటకు వెళ్లారు. పీహెచ్‌డీ విద్యార్థుల పరిశోధనలు కొనసాగుతున్నాయి.

వివిధ అంశాలపై శిక్షణ..

అటవీ కళాశాల విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా తేనెటీగల పెంపకం, సేంద్రియ ఎరువుల తయారీ, నర్సరీల ఏర్పాటు, వుడ్‌ వర్క్‌షాప్‌పై ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. బోధనలో భాగంగా విద్యార్థులను దేశంలోని పలు ప్రాంతాలకు క్షేత్రస్థాయి పర్యటనలకు తీసుకువెళ్తున్నారు. అక్కడి అడవుల గురించి వివరిస్తూ అవగాహన పెరిగేలా కృసి చేస్తున్నారు. కేంద్రంలోని నర్సరీలో మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు ఆటల్లోనూ రాణించేలా శిక్షణ ఇస్తున్నారు. వ్యాయామం, యోగా వంటివి నిత్యం తప్పనిసరి. పోటీ పరీక్షలు రాసేందుకు ప్రత్యేకంగా కోచింగ్‌ సెంటర్‌నూ ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన స్నాతకోత్సవంలో చదువుతో పాటు పలు విభాగాల్లో రాణించిన పలువురు విద్యార్థులు గవర్నర్‌ రాధాకృష్ణన్‌ నుంచి బంగారు పతకాలు అందుకున్నారు.

అవకాశాలు ఇలా..

ప్రస్తుతం కళాశాల పరిశోధన కేంద్రంలో బీఎస్సీ అటవీ శాస్త్రానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ర్యాంకుల ఆధారంగా 50 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. పేమెంట్‌ ఆధారంగా 10 మంది, ఈడబ్ల్యూఎస్‌ ద్వారా మరో ఐదుగురికి ప్రవేశం కల్పిస్తారు. ఈ నెల 27 వరకు దరఖాస్తు చేయడానికి గడువుంది. 
వెబ్‌సైట్‌: www.fcrihyd.in 
ఫోన్‌ నంబర్లు: 80743-50866, 96664-60939
మెయిల్‌: fcriadmissions@gmail.com

సద్వినియోగం చేసుకోవాలి

ఆశ, కళాశాల  పరిశోధన కేంద్రం డీన్‌

దేశంలో ఎక్కడా లేనివిధంగా అధునాతన సౌకర్యాలతో కూడిన కళాశాల పరిశోధన కేంద్రాన్ని ప్రభుత్వం ములుగులో ఏర్పాటు చేసింది. ఇక్కడ చదివిన విద్యార్థులకు ఉజ్వల భవిత ఖాయం. ఇక్కడి అవకాశాలను ఆసక్తి ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని