logo

పాన్‌ ఉంటేనే పరిహారం

చేపలు పట్టి, విక్రయిస్తూ జీవనం గడిపే మత్స్యకారుల ప్రమాద బీమా పరిహారం చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది.

Updated : 26 Jun 2024 05:54 IST

మత్స్యయోజనకు కొత్త మార్గదర్శకాలు 

చెరువులో చేపలు పడుతున్న మత్స్యకారులు  

న్యూస్‌టుడే గజ్వేల్‌ గ్రామీణ, సిద్దిపేట అర్బన్, మెదక్‌ టౌన్, సంగారెడ్డి టౌన్‌: చేపలు పట్టి, విక్రయిస్తూ జీవనం గడిపే మత్స్యకారుల ప్రమాద బీమా పరిహారం చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. చేపలు పట్టేందుకు వెళ్లి నీటి వనరుల్లో మునిగి అత్యధికులు చనిపోతుంటారు. వీరికి ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. మత్స్యసహకార సంఘాల్లో సభ్యత్వం పొంది స్థానిక చెరువుల్లో వేటాడుతుంటారు. ప్రమాదవశాత్తు గాయపడిన, మరణించిన వారికి మత్స్యశాఖ నుంచి వచ్చే పరిహారం పొందేందుకు పాన్‌ కార్డుతో పాటు ఆదాయ ధ్రువపత్రం తప్పనిసరని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎంతోమందికి పాన్‌ కార్డులు, ఆదాయ పత్రాలు లేకపోవడం గమనార్హం. వెంటనే వాటిని తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

జీఏఐఎస్‌ వెబ్‌సైట్‌లో..

మత్స్యకారులు సంఘ సభ్యత్వం గుర్తింపు సంఖ్య, ఆధార్, బ్యాంకు ఖాతా, చరవాణి నంబరు, పాన్‌ కార్డు నంబరుతో పాటు ఆదాయ ధ్రువీకరణపత్రం జీఏఐఎస్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సంఘం సభ్యులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రీమియం పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. సభ్యులు ఎవరైనా ప్రమాదవశాత్తు మృతి చెందితే పీఎం మత్స్యయోజన కింద రూ.5 లక్షలు, శాశ్వత అంగవైకల్యమైతే రూ.2.5 లక్షలు, క్షతగాత్రులైతే రూ.25 వేలు చెల్లిస్తారు.

సంతకం రాకుంటే ఇబ్బందులు

మత్స్యకారులకు ప్రమాద బీమా బాగానే ఉన్న కొత్త మార్గదర్శకాలతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. పాన్‌ కార్డు పొందాలంటే సంతకం తప్పనిసరి. ఎవరైనా చదువు రాని వారుంటే పాన్‌ కార్డు పొందడం కాసింత కష్టమే. ఆదాయ ధ్రువీకరణ ఇచ్చేందుకు ముందుకొచ్చినా పాన్‌ కార్డు నిబంధనతో సభ్యులు వెనుకడుగు వేయాల్సి వస్తుంది. ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని పలువురు విన్నవిస్తున్నారు.

నమోదు చేసుకోవాలి: మల్లేశం, జిల్లా మత్స్యశాఖ అధికారి, సిద్దిపేట

మత్స్యకారులు వెంటనే పాన్‌ కార్డు తీసుకొని సదరు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. లేదంటే పరిహారం చెల్లింపు సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వివరాలకు  జిల్లా కార్యాలయంలో సంప్రదించాలి. సంఘంలో సభ్యత్వానికి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే మా దృష్టికి తీసుకురావాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని