logo

రక్షణ శూన్యం.. అదుపు తప్పితే ప్రమాదం

జిల్లాలో రహదారుల వెంట పాత బావులు ప్రమాదకరంగా మారాయి. రక్షణగోడలు లేకుండా, పొదల మధ్య,   మలుపుల వద్ద ఇవి ఉండడంతో తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

Updated : 26 Jun 2024 06:49 IST

రోడ్ల పక్కన బావులతో భయాందోళన

జిల్లాలో రహదారుల వెంట పాత బావులు ప్రమాదకరంగా మారాయి. రక్షణగోడలు లేకుండా, పొదల మధ్య,   మలుపుల వద్ద ఇవి ఉండడంతో తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాటిని పూడ్చడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో రోడ్లవెంట పురాతన బావులున్నాయి. ఆ మార్గాల్లో ప్రయాణించాలంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిందే. పాత జైలు సమీపంలోని దుర్గమ్మ దేవాలయం పక్కనే  ఏళ్లనాటి బావి ఉంది. బసవేశ్వరనగర్‌ కాలనీలో మలుపు వద్దా ఇదే పరిస్థితి. ఈ రెండు చోట్లా ప్రమాదాలు సంభవించాయి.

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్, నారాయణఖేడ్, జోగిపేట, కోహీర్, కంది, వట్‌పల్లి, హత్నూర.

ఖేడ్‌ పట్టణంలో రోడ్డు పక్కన  

పల్లెల్లో భయంగా 

కోహీర్‌ మండలం మనియార్‌పల్లి, ఖానాపూర్, బిలాల్‌పూర్, సజ్జాపూర్, పీచేర్యాగడి, నాగిరెడ్డిపల్లి, రాజనెల్లి, గుర్జువాడ, తదితర గ్రామాల్లో రోడ్ల పక్కన వ్యవసాయ బావులున్నాయి. బిలాల్‌పూర్‌లోని బావిలో డ్రైవర్‌ అందులో పడి దుర్మరణం చెందారు. సమీపంలోని బావుల్లో కుటుంబ కలహాలు, తదితర కారణాలతో పలువురు వాటిల్లో దూకి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 

ట్రాక్టర్‌ అదుపు తప్పి..

నారాయణఖేడ్‌లో జాతీయ, అంతర్గత రహదారుల పక్కన సుమారుగా 45 చోట్ల వ్యవసాయ బావులున్నాయి. కొన్నిచోట్ల మూలమలుపులు ఉండడం, ఆ పక్కనే బావులు కనిపించకుండా పోవడం వల్ల అందులో పడి చనిపోయిన ఘటనలున్నాయి. నారాయణఖేడ్‌ పురపాలక పరిధి మన్సూర్‌పూర్‌లో గతంలో ట్రాక్టర్‌ అదుపు తప్పి బావిలోపడి చోదకుడు మృతి చెందారు. 

ద్విచక్రవాహనంపై వెళుతూ..

హత్నూర మండలం వడ్డేపల్లి, చిక్‌మద్దూర్, దౌల్తాబాద్, హత్నూర, సికింద్లాపూర్, తదితర గ్రామాల్లో సమీపంలో రోడ్ల పక్కనే బావులున్నాయి. గతంలో పొలాలకు నీరందించినవి మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. వడ్డేపల్లి శివారులోని బావిలో పటాన్‌చెరు మండలం బండ్ల రామేశ్వర గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తూ అందులో పడి మరణించారు.  

ఇక్కడా దృష్టి సారించాల్సిందే..: 

  • మండల కేంద్రమైన కందిలో మంజీర పైపులైన్‌ ఉంది. ఇక్కడికి ఇళ్ల సమీపంలో వ్యవసాయ బావికి రక్షణగోడ లేదు. పైౖకప్పులేక పోవడం వల్ల సమీప గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు. రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 
  • వట్‌పల్లి నుంచి దుద్యాల వెళ్లే దారి పక్కనే వ్యవసాయ బావులకు రక్షణ గోడలేదు. ఆ దారిలో ప్రయాణం చేసే వాహనదారులు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తోందోనని ఆందోళనకు గురవుతున్నారు.
  • అందోలు మండలం నేరడిగుంట బావిలో గతంలో ట్రాక్టర్‌ చోదకుడు పడి మృతిచెందాడు.

పూడ్చివేతకు చర్యలు తీసుకుంటాం

జిల్లాలో ప్రమాదకరంగా ఉన్న బావులను గుర్తించి వాటి చోట్ల రక్షణ చర్యలు తీసుకునేలా కృషి చేస్తాం. ఆర్‌అండ్‌బీ,  పీఆర్, డీపీవో శాఖల అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రహదారుల పక్కన పొదల మధ్య ఉంటే,  హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. అవసరమైతే వాటిని పూడ్చివేసేందుకు చర్యలు తీసుకుంటాం. - చంద్రశేఖర్, అదనపు కలెక్టర్, సంగారెడ్డి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు