logo

ఉత్తర్వులు.. ఉత్తమాటేనా!

పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు అవుతోంది.. ఇక సేవలు పొందడం సులువేనని భావించిన సంగారెడ్డి జిల్లా వాసులకు నిరీక్షణ తప్పడం లేదు.

Published : 26 Jun 2024 00:53 IST

ఏర్పాటు కానీ పాస్‌పోర్టు సేవా కేంద్రం

కేంద్రం ఏర్పాటుకు గుర్తించిన తపాలా కార్యాలయం 

న్యూస్‌టుడే, జహీరాబాద్‌ అర్బన్‌: పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు అవుతోంది.. ఇక సేవలు పొందడం సులువేనని భావించిన సంగారెడ్డి జిల్లా వాసులకు నిరీక్షణ తప్పడం లేదు. ఉత్తర్వులు వెలువడి ఆరేళ్లు గడిచినా ఏర్పాటు ప్రక్రియ అడుగు ముందుకు పడడంలేదు. ఉమ్మడి జిల్లాగా ఉన్నపుడు రెండో పెద్ద పట్టణంగా పేరొందిన జహీరాబాద్‌లో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు 2018 మే 18న విదేశీ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భారత తపాలా శాఖ సమన్వయంతో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయంలో సేవా కేంద్రం అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించినా, నేటికి ప్రతిపాదనలకే పరిమితమైంది. ఉన్నత చదువులు, ఉద్యోగం, ఉపాధి, పర్యటక ప్రాంతాల సందర్శన తదితర అవసరాలకు విదేశాలకు వెళ్లే వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జహీరాబాద్‌లో పాస్‌పోర్టు సేవా కేంద్రం అందుబాటులోకి వస్తే జహీరాబాద్‌ సహా జిల్లా కేంద్రమైన సంగారెడ్డి, పటాన్‌చెరు, సదాశివపేట, జోగిపేట, నారాయణఖేడ్, కోహీర్‌ ప్రాంత ప్రజలకు పాస్‌పోర్టు పొందడం సులువుగా మారేది. నిమ్జ్‌ (జాతీయ ఉత్పాదక పెట్టుబడి మండలి)తో పాటు ఆటోమొబైల్, ఐస్‌క్రిమ్‌ పరిశ్రమలతో ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న పట్టణంగా పేరొందిన జహీరాబాద్‌కు మరో ప్రత్యేక గుర్తింపు దక్కేది.  
వ్యయ ప్రయాసలు..: జిల్లా వాసులు పాస్‌పోర్టు పొందాలంటే హైదరాబాద్, మెదక్‌ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. అంతర్జాలంలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ కొన్నిసార్లు కచ్చితంగా అభ్యర్థి హాజరు కావాల్సి వస్తోంది. ఇలాంటి సమయాల్లో జహీరాబాద్‌లో సేవా కేంద్రం అందుబాటులో ఉంటే వ్యయ ప్రయాసలు తప్పుతాయి. జహీరాబాద్, సంగారెడ్డి, జోగిపేట, కోహీర్, నారాయణఖేడ్‌ ప్రాంతాల నుంచి అత్యధికంగా దుబాయ్, సౌదీ అరేబియా గల్‌్్ఫ దేశాలతో పాటు అమెరికా లాంటి దేశాల్లో ఉద్యోగం, ఉపాధి కోసం ఎక్కువగా వెళ్తుంటారు. ఇలాంటి వారికి ప్రాంతీయంగా సేవా కేంద్రం అందుబాటులోకి వస్తే మరింత ఊరట కలగనుంది. కేంద్రం మంజూరు చేస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అప్పటి సహాయ మంత్రి జనరల్‌ వి.కె.సింగ్‌ ఉత్తర్వును ఆరేళ్ల కిందట అప్పటి ఎంపీ బీబీపాటిల్‌కు అందజేశారు. కొత్త లోక్‌సభ కొలువుదీరిన వేళ ప్రస్తుత ఎంపీ సురేష్‌షెట్కార్‌ దృష్టిసారిస్తే ఎదురు చూపులు ఫలించే అవకాశముంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు