logo

పత్తాలేని.. ప్రత్యేక సమావేశం!

మహిళలకు ఆరోగ్యంపై అవగాహన ఉంటేనే ఇంటిల్లిపాది ఆనందంగా ఉండేందుకు వీలుంటుంది. ఇదే ఉద్దేశంతో ప్రతినెలా ప్రత్యేకంగా ద్వితీయ సమావేశాలు నిర్వహించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ రెండేళ్ల కిందటే ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 26 Jun 2024 00:51 IST

నెరవేరని సర్కార్‌ లక్ష్యం

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: మహిళలకు ఆరోగ్యంపై అవగాహన ఉంటేనే ఇంటిల్లిపాది ఆనందంగా ఉండేందుకు వీలుంటుంది. ఇదే ఉద్దేశంతో ప్రతినెలా ప్రత్యేకంగా ద్వితీయ సమావేశాలు నిర్వహించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ రెండేళ్ల కిందటే ఉత్తర్వులు జారీ చేసింది. పర్యవేక్షణ లేక క్షేత్రస్థాయిలో చాలా చోట్ల సక్రమంగా అమలు కావడంలేదు. ఈ ప్రక్రియ పక్కాగా నిర్వహించాల్సిన ఆవశ్యకతపై కథనం.
మహిళా సంఘం సభ్యులు నెలకోసారి సమావేశమయ్యేవారు. పొదుపులు, అప్పులు, రుణవాయిదాల చెల్లింపులపై చర్చలు జరిగేవి. రెండేళ్ల కిందటివరకు ఇదే పరిస్థితి. ఆరోగ్యంపై కూడా మహిళలను చైతన్యం చేయాలన్న లక్ష్యంతో నెలకోసారి నిర్వహిస్తున్న సమావేశానికి తోడు అదనంగా మరోటి నిర్వహించాలన్న నిబంధన తీసుకువచ్చారు. దీంతో సంఘాల సభ్యులు నెలలో రెండు సార్లు సమావేశం కావాల్సిందే. పర్యవేక్షణ లేక ఒక దానితోనే సరిపెడుతున్నారు. 

ఏం చర్చించాలంటే?: ప్రతినెలా నిర్వహించే ద్వితీయ సమావేశంలో ఆరోగ్యమే ప్రధాన ఎజెండాగా ఉంటుంది. సంఘంలోని సభ్యులు, కుంటుంబీకుల ఆరోగ్యంపై చర్చించాలి. ఎవరికైనా సమస్యలుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించాలి. అవసరమైతే ఆరోగ్య సిబ్బందిని సమావేశానికి ఆహ్వానించి సలహాలు, సూచనలు అందేలా చూడాలి. ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో పెరటి తోటల్లో కూరగాయలు పండించే విధానంపై వివరించాలి. హరితహారంలో భాగంగా పండ్ల మొక్కలు కూడా పెంచుకునేలా ప్రోత్సహించాల్సి ఉంటుంది. తద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా, సేంద్రియ పద్ధతిలో పండించిన నాణ్యమైన కూరగాయలు, పండ్లు తీసుకునేందుకు వీలుంటుంది. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఉండే ప్రయోజనాలపై సమావేశాల్లో వివరించాలి. కుటుంబాల్లో బాలింతలు, గర్భిణులు ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించడం తదితర అంశాలపై అవగాహనకు ఈ సమావేశాలు వేదిక కావాల్సి ఉంటుంది.

ఏడాది కిందట అమలుపై సర్వే: సంఘాల స్థాయిలో నిర్వహిస్తున్న ఈ సమావేశాల అమలు తీరుపై పేదరిక నిర్మూలన సంస్థ ఏడాది కిందట సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. జిల్లాలో ఐదు మండలాలల్లో బృందాలు పర్యటించి సర్వే నిర్వహించాయి. ఒక్కో మండలంలో ఒక్కో గ్రామంలో సమావేశాల తీరును పరిశీలించారు. బృందం పర్యటన నేపథ్యంలో హడావుడి చేశారు. ఆ తర్వాత పర్యవేక్షించే వారు కరవయ్యారు.

సక్రమంగా జరిగేలా చూస్తాం: జంగారెడ్డి, అదనపు డీఆర్డీవో

మహిళా సంఘాల సభ్యులతోపాటు వారి కుటుంబాల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడమే సమావేశాల లక్ష్యం. ఇవి సక్రమంగా జరిగేలా చూడాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశిస్తాం. సభ్యుల్లో ఎవరికైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటే అందరూ చేయూతనందించాలి. సేంద్రియ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని