logo

సాంకేతిక సాయం.. వెంటనే మరమ్మతు ఖాయం

విద్యుత్తు సరఫరాలో ఎక్కడైనా అంతరాయం కలిగితే పూర్వాపరాలు వెంటనే తెలుసుకొని పునరుద్ధరించే వ్యవస్థను రూపొందిస్తున్నారు.

Published : 26 Jun 2024 00:49 IST

జియోగ్రాఫికల్‌ ఫీడర్‌ యాప్‌ వివరాలతో విద్యుత్తు అంతరాయాల నివారణ

శిక్షణ కార్యక్రమంలో తెరపై చూపిస్తూ వివరిస్తున్న విద్యుత్తు అధికారులు 

సిద్దిపేట అర్బన్, న్యూస్‌టుడే: విద్యుత్తు సరఫరాలో ఎక్కడైనా అంతరాయం కలిగితే పూర్వాపరాలు వెంటనే తెలుసుకొని పునరుద్ధరించే వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఇందుకు విద్యుత్తు  అధికారులు, సిబ్బందికి నిపుణులు శిక్షణ ఇస్తున్నారు. సరఫరాలో సాంకేతిక సమస్య ఉత్పన్నమై అంతరాయం కలిగితే వినియోగదారులు అసౌకర్యానికి గురవుతారు. సమస్య ఎక్కడుందో అధికారులు, సిబ్బంది తెలుసుకొని మరమ్మతు చేపట్టి పునరుద్ధరించేందుకు ఒక్కోసారి సమయం పడుతోంది. ప్రజలకు, వ్యాపారాలకు ఇబ్బంది కలుగుతోంది. వాటి పరిష్కారానికి తెలంగాణ సదరన్‌ పవర్‌ డ్రిస్టిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌పీడీసీఎల్‌)  జియోగ్రాఫికల్‌ సమాచార వ్యవస్థను నూతనంగా తీసుకువచ్చింది. ఈ వ్యవస్థలో రూపొందించిన ఫీడర్‌ యాప్‌లో వివరాలు నమోదు చేస్తారు. వెంటనే సరిచేయడానికి ఆస్కారం ఉంటుంది.

పక్కాగా క్షేత్రస్థాయి సమాచారం

జిల్లాలో 11 కేవీ ఫీడర్లపై ఎన్ని స్తంభాలు ఉన్నాయి.. నియంత్రికలు ఎన్ని.. తీగ సైజు, స్తంభాల మధ్య దూరం, విద్యుత్తు లైన్లను తాకుతున్న కొమ్మల ప్రదేశాల వివరాలు, ఒక్కో ఫీడర్‌పై ఎన్ని నియంత్రికలు, వాటి సామర్థ్యం తదితర వివరాలు సేకరిస్తారు. విద్యుత్తు కనెక్షన్లు, ఇన్సులేటర్లు, నియంత్రికలపై ఓవర్‌లోడ్, కండక్టర్ల వివరాలను జియోగ్రాఫికల్‌ సమాచార వ్యవస్థలో అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా సిబ్బంది గమనించి యాప్‌లో నమోదు చేస్తారు. యాప్‌లో నమోదు చేసిన తర్వాత విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగితే ఆ ప్రాంతం వివరాలు సిబ్బందికి సందేశం వస్తుంది. వెంటనే వారు అవసరమైన సామగ్రితో యాప్‌ సూచించిన ప్రాంతానికి చేరుకొని మరమ్మతులు చేపడతారు. విద్యుత్తు పునరుద్ధరిస్తారు.

ఈ నెలలో ప్రారంభం

విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడేందుకు అనేక కారణాలు ఉంటాయి. తీగలు కిలోమీటర్ల మేర విస్తరించి ఇన్సులేటెడ్‌ సరిగా లేక గాలికి చెట్ల కొమ్మలు తగిలినా, పక్షులు వాలినా, పిడుగు పడినా సరఫరాలో అంతరాయం కలుగుతుంది. కొన్నిసార్లు సాంకేతిక సమస్యలతోనూ ఇబ్బంది ఏర్పడుతుంది. శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఫీడర్‌ యాప్‌లో సిబ్బంది క్షేత్రస్థాయి సమాచారాన్ని నమోదు చేస్తారు. ఈ నెల 24 నుంచి ప్రక్రియ ప్రారంభించారు.

త్వరితంగా నమోదు పూర్తి చేయిస్తాం

మోహన్‌రెడ్డి, ఎస్‌ఈ, సిద్దిపేట

జియోగ్రాఫికల్‌ (ఫీడర్‌ యాప్‌)లో విద్యుత్తు సంబంధిత సమగ్ర సమాచారం పొందుపరుస్తారు. అంతరాయాలు కలగగానే ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. మరమ్మతు చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ సమాచారాన్ని పట్టణాలు, గ్రామాల్లో సిబ్బంది నమోదు చేస్తున్నారు. ఆటంకాలు కలిగినపుడు యాప్‌ ద్వారా సమస్య తెలుసుకొని వెంటనే మరమ్మతులు చేపట్టవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు