logo

Nagarkurnool: పిల్లలు పుట్టడంలేదని వివాహిత ఆత్మహత్య

మండలంలోని శిర్సనగండ్లకు చెందిన వివాహిత రాజశ్రీ(29) పిల్లలు పుట్టడంలేదని మనస్థాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

Updated : 05 Jul 2024 08:23 IST

రాజశ్రీ

చారకొండ, న్యూస్‌టుడే: నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలంలోని శిర్సనగండ్లకు చెందిన వివాహిత రాజశ్రీ(29) పిల్లలు పుట్టడంలేదని మనస్థాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భర్తకు ఫోన్‌ చేసి పురుగు మందు తాగి అపస్మారకస్థితికి చేరుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను నల్గొండ జిల్లా మాల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందారు. రాజశ్రీని ఏపీలోని కృష్ణా జిల్లా కంభంపాడు గ్రామానికి చెందిన శేషుకుమార్‌కి ఇచ్చి 2014లో వివాహం చేశారు. పెళ్లయి పదేళ్లయినా పిల్లలు కాకపోవడంతో భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో ఆమె మూడు నెలల క్రితం భర్తతో గొడవ పడి పుట్టింట్లోనే ఉంటున్నారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్ల దుర్మరణం 

రమేశ్‌                 మహేశ్‌

రాజాపూర్, న్యూస్‌టుడే : జాతీయ రహదారి-44పై ప్రమాదానికి గురై ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం పాలైన విషాద ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కె.రవి కథనం ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మదనపల్లి నుంచి హైదరాబాద్‌కు టమాటా లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం టైరు మార్గం మధ్యలోని రాజాపూర్‌ శివారులోని జాతీయ రహదారిపై పగిలింది. అనంతపురం జిల్లా పామిడి మండలం, కండ్లపల్లికి చెందిన ఆ వాహనం డ్రైవర్‌ పట్రా రమేశ్‌(25) టైరు మారుస్తుండగా హైదరాబాద్‌కు వెళ్తున్న మరో బొలెరో డ్రైవర్‌ అయిన అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన కొమ్మరి మహేశ్‌(24) గమనించారు. టైరు మారుస్తున్న రమేశ్‌కు సహాయం చేయడానికి తన వాహనాన్ని ఆపాడు. రమేశ్, మహేశ్‌లు కలిసి టైరు మారుస్తుండగా వెనక నుంచి వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరి శరీరాలు నుజ్జునుజ్జయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాలను సమీపంలోని జడ్చర్ల ఆసుపత్రి మార్చురీకి తరలించారు. గురువారం మహేశ్‌ బంధువు వేముల జయకుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఘటనా కొద్ది దూరంలో ఓ లారీ డోర్‌ విరిగి పడి ఉండటంతో దాన్ని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.


విద్యుదాఘాతంతో బాలుడి మృత్యువాత

శివనాయక్‌

కోడేరు, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీ స్తంభాలకు వీధి దీపాలు అమర్చే క్రమంలో విద్యుదాఘాతానికి గురై బాలుడు మృత్యువాత పడ్డ సంఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలం రేకులపల్లితండాలో ఈనెల 17న పీర్ల పండుగ ఉంది. వీధి దీపాలు వేయించాలని గ్రామస్థులు కోరగా పంచాయతీ కార్యదర్శి బిచ్చయ్య 25 ఎల్‌ఈడీ బల్బులు సమకూర్చారు. పంచాయతీ పరిధిలోని ఒప్పితండకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు శివమ్మతోపాటు తోటి సిబ్బందికి బల్బులు వేయాలని కార్యదర్శి సూచించారు. శివమ్మకు బదులు ఆమె భర్త మనోహర్‌ అలియాస్‌ మౌలాలి వెళ్తూ కుమారుడు శివనాయక్‌(15)ను సాయంగా తీసుకెళ్లారు. మనోహర్‌ నియంత్రిక వద్ద ఏబీ స్విచ్‌ బంద్‌ చేసి శివనాయక్‌తోపాటు బీమ్లానాయక్‌ను వీధిదీపాలు వేయాలని సూచించారు. కొన్ని స్తంభాలకు దీపాలు అమర్చిన తర్వాత నియంత్రిక వద్దకు వెళ్లారు. మరో స్తంభాన్ని ఎన్నిక బాలుడు పక్కనే ఉన్న 11 కేవీ తీగను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై మంటల్లో చిక్కుకున్నాడు. కొంత దూరంలో ఉన్న మనోహర్, గ్రామస్థులు గమనించి కాపాడే ప్రయత్నం చేశారు. లైన్‌మన్‌కు ఫోన్‌ చేయడంతో విద్యుత్తు సరఫరా ఆపేశారు. బాలుడు స్తంభంపై నుంచి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలైన అతన్ని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై కురుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై డీపీవోకు ప్రాథమిక నివేదిక సమర్పించామని ఎంపీవో శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. పంచాయతీ కార్యదర్శి బిచ్చయ్య మాత్రం చరవాణి బంద్‌ చేసుకొని అందుబాటులోకి రావడం లేదన్నారు. అధికారుల ఆదేశాల మేరకు పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.


బాలికపై చిన్నాన్న అత్యాచారం

కొత్తకోట గ్రామీణం, న్యూస్‌టుడే: అభం, శుభం తెలియని బాలికపై సొంత చిన్నాన్నే(20) అత్యాచారానికి పాల్పడిన సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై మంజునాథరెడ్డి కథనం మేరకు.. పట్టణానికి చెందిన  దంపతులకు ముగ్గురు కుమార్తెలు. బతుకుదెరువు కోసం వీరి వలస వెళ్తూ బంధువుల వద్ద వదిలిపెట్టి వెళ్లారు. నానమ్మ ఉదయం  ఇంటి బయట కూర్చుంది. ఆమెకు సరిగా కళ్లు కనిపించవు. ఇంట్లో ఆడుకుంటున్న పిల్లల వద్దకు చిన్నాన్న వచ్చాడు. పదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడగా కేకలు వేసింది. ఇద్దరు చెల్లెళ్లు ఏడ్చుకుంటూ బయటకు వెళ్లి ఇంటి పక్కన ఉన్నవారికి చెప్పారు. వాళ్లు వచ్చే సరికి అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడిపై పోక్సో కేసుతోపాటు నూతన చట్టాల ప్రకారం పలు సెక్షన్లతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


బస్సు అద్దం పగులగొట్టిన మహిళపై కేసు

పాన్‌గల్, : ఆర్టీసీ బస్సు దిగే క్రమంలో తోటి ప్రయాణికులతో గొడవ పెట్టుకుని బస్సును అడ్డగించి అద్దం పగులగొట్టిన ఘటన గురువారం పాన్‌గల్‌లో చోటు చేసుకుంది. ప్రయాణికులు, ఎస్సై కళ్యాణ్‌రావు కథనం మేరకు.. పాన్‌గల్‌కు చెందిన సునీత వనపర్తి నుంచి కొల్లాపూర్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఎక్కారు. పాన్‌గల్‌లో దిగుతున్న క్రమంలో తోటి ప్రయాణికులతో గొడవ పెట్టుకుని దూషించారు. అంతటితో ఆగకుండా అడ్డు వచ్చిన బస్సు డ్రైవర్, కండక్టర్‌ను దూషించి బస్సు అద్దం పగులగొట్టినట్లు తెలిపారు. కండక్టర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని