logo

పర్యాటక శోభ ఒనగూరేనా..!

పాలమూరులో పర్యాటక రంగం అభివృద్ధిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వం ఉమ్మడి జిల్లాను ఎకో, రివర్, టెంపుల్‌ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి కసరత్తు చేసింది.

Published : 05 Jul 2024 04:23 IST

నేడు, రేపు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు నల్లమలలో పర్యటన

 కృష్ణా నదిలో ఏర్పాటు చేసిన బోటు

ఈనాడు, మహబూబ్‌నగర్‌: పాలమూరులో పర్యాటక రంగం అభివృద్ధిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వం ఉమ్మడి జిల్లాను ఎకో, రివర్, టెంపుల్‌ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి కసరత్తు చేసింది. అయినా పూర్తిస్థాయిలో పర్యటక రంగం అభివృద్ధి పట్టాలు ఎక్కలేదు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలమూరును పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేశారు. దీనిలో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు, అటవీ, పర్యాటక శాఖ అధికారులు నేడు, రేపు నల్లమలలో పర్యటించనున్నారు.  ప్రకృతి, చారిత్రక, వారసత్వ, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయంగా ఉన్న పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటక శోభను సంతరించుకుంటే ఈ ప్రాంతం  మరింత అభివృద్ధి సాధించనుంది. ఇప్పటికే నల్లమలలో ఏకో టూరిజం అభివృద్ధిలో భాగంగా రూ.91.62 కోట్లతో పనులు జరిగాయి.

నల్లమలలోని వ్యూ పాయింట్‌

అభిరుచికి అనుగుణంగా..: కొందరికి ప్రకృతి అంటే ఇష్టం. మరికొందరికి ఆధ్యాత్మిక అంటే ఆసక్తి చూపుతారు. వీరికోసం ఏకో, టెంపుల్‌ టూరిజాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. నల్లమల ప్రాంతాన్ని ఏకో టూరిజంగా గతంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. సోమశిల నుంచి కృష్ణానదిలో ఈగలపెంట లాంచీని ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి పాతాళగంగ, శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనం చేసుకునేలా గతంలో పర్యటకశాఖ ఏకో టూరిజాన్ని అభివృద్ధి చేసింది. దీనిలో భాగంగా పర్హాబాద్‌ వ్యూ పాయింట్, మల్లెలతీర్థం, ఉమామహేశ్వరం చూసేలా ప్యాకేజీలను ఏర్పాటు చేసినా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. కొన్ని రోజులు వారాంతాల్లో ఈ ప్యాకేజీలు నడిచాయి. సోమశిల నుంచి శ్రీశైలానికి సాగే ప్రయాణంలో ప్రకృతి, ఆధ్యాత్మికం టూరిజం ఒకేసారి అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ఆలయాలను కలుపుతూ టెంపుల్‌ టూరిజాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది.

వీటిపై దృష్టి సారిస్తే..

  •  నల్లమలలోని టూరిజం కాటేజీలు, భవనాలను ప్రైవేటు సంస్థలకు లీజుకివ్వడంతో ఇష్టారాజ్యంగా అద్దెలు వసూలు చేస్తున్నారు. వారాంతాల్లో వచ్చే పర్యాటకులు అద్దె ఖర్చులు భరించలేక అవస్థలు పడుతున్నారు. టూరిజం భవనాలను ప్రభుత్వమే నిర్వహిస్తే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుంది.
  • నల్లమలలో ప్రకృతి సంపదను ధ్వంసం చేస్తున్నారు. శ్రీశైలం రహదారి వెంట అటవీ ప్రాంతాల్లో గుట్టలను తవ్వి ప్రైవేటు వసతి గృహాలు ఏర్పాటు చేస్తున్నారు.  
  •  కృష్ణానదిలో సోమశిల-శ్రీశైలం ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటు చేసినా సరిగా అమలు కావడం లేదు. వివిధ కారణాలతో ఈ బోట్లను నడపడం లేదు. విధిగా శ్రీశైలం వరకు నది ప్రయాణం జరిగేలా దృష్టి సారించాలి.
  • నల్లమలలో ప్రాచీన ఆలయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.

ప్రకృతి, ఆధ్యాత్మికత మేళవింపుగా..

పాలమూరును పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు రెండురోజులు నల్లమలలో పర్యటించి అధ్యయనం చేయనున్నారు.  అభయారణ్యంలోని వ్యూ పాయింట్, మల్లెలతీర్థం, అక్టోపస్, వజ్రాల మడుగు, అక్కమాంబ ఆలయం, కదళివనం, రాయలగండి, ప్రతాపరుద్రుని కోట, మన్ననూరు జంగిల్‌ రిసార్ట్‌తోపాటు కృష్ణలో రివర్‌ బోటింగ్, మద్దిమడుగు అంజనేయస్వామి ఆలయం సందర్శన వంటివి చేర్చారు. ఈ అధ్యయనం ప్రకృతి, ఆధ్యాత్మిక మేళవింపుగా సాగనుంది. పర్యాటక రంగ అభివృద్ధితోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై కూడా ఈ బృందం దృష్టి సారించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని