logo

వెంటాడుతున్న డెంగీ భయం

జిల్లాలోని అనేక ప్రాంతాల్లో డెంగీ కేసులు ప్రజలను భయపెడుతున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమలు ఎక్కువై విష జ్వరాలు వస్తున్నాయి. పారిశుద్ధ్యలోపం కారణంగా డెంగీ బారినపడుతున్నారు.

Published : 05 Jul 2024 04:16 IST

ఇప్పటివరకు 38 కేసుల నమోదు.. జిల్లా కేంద్రంలోనే 17
న్యూస్‌టుడే, పాలమూరు

జిల్లాలోని అనేక ప్రాంతాల్లో డెంగీ కేసులు ప్రజలను భయపెడుతున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమలు ఎక్కువై విష జ్వరాలు వస్తున్నాయి. పారిశుద్ధ్యలోపం కారణంగా డెంగీ బారినపడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 38 కేసులు నమోదయ్యాయి. అందులో 17 కేసులు మహబూబ్‌నగర్‌ పురపాలికలోనివే కావడం గమనార్హం. ఎదిరలో ఆరు, పాత పాలమూరులో మూడు, రామయ్యబౌలిలో మూడు, పీపీ యూనిట్‌లో రెండు, మోతీనగర్‌లో రెండు, కుమ్మరివాడిలో ఒకటి చొప్పున నమోదయ్యాయి. భూత్పూర్‌ పీహెచ్‌సీ పరిధిలో నాలుగు, జడ్చర్లలో మూడు, మహమ్మదాబాద్‌లో మూడు, హన్వాడలో మూడు డెంగీ కేసులు వచ్చాయి. వైద్యారోగ్య శాఖ దృష్టికి రానివి ఇంకా చాలా ఉంటాయి.

గతేడాది 161 కేసులు.. : గతేడాది జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షాలే కురిసినా 161 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈసారి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడప్పుడు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇంటి పరిసరాల్లో నీరు నిలిచి దోమలు ఎక్కువై డెంగీ కేసులు నమోదవుతున్నాయి. అనాఫిలిస్‌ దోమ కాటు వల్ల మలేరియా జ్వరం, క్యూలెక్స్‌ దోమ వల్ల బోధకాలు, మెదడు వ్యాపు వ్యాధి, ఎడిస్‌ దోమ వల్ల డెంగీ, గన్యా వచ్చే అవకాశం ఉంది.

భూత్పూర్‌ : అమిస్తాపూర్‌లో నల్లా వద్ద నిలిచిన నీటిని పరిశీలిస్తున్న వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది

జాగ్రత్తలు తప్పనిసరి.. : ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా, దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పనికిరాని పాత్రలు, టైర్లు, పగిలిపోయిన బకెట్లు, తొట్లు ఇంటి పరిసరాల్లో లేకుండా చూసుకోవాలి. ఓవర్‌హెడ్‌ నీటి ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు, నీటి తొట్ల మీద మూతలు పెట్టాలి. ఇంటి కప్పు, టెర్రస్, షేడ్‌నెట్లపై నీరు ఉండకుండా చూడాలి. వారాకోసారి స్వచ్ఛందంగా ఇంట్లో పొడి దినం(డ్రై డే)గా పాటించాలి. ఆ రోజు నీటి నిలువ ప్రాంతాలను శుభ్రం చేసి ఆరబెట్టాలి. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ సంచులు, కప్పులు, గ్లాసులు, ఇంటి ముందు మురుగు కాలువలో వేయొద్దు. ఇంటి కిటికీలు, గుమ్మాలకు జాలీలు అమర్చుకోవాలి. దోమ తెరలను వాడొచ్చు.

అప్రమత్తంగా ఉన్నాం.. : జనరల్‌ ఆసుపత్రిలో అన్ని విభాగాల వైద్యులు అప్రమత్తంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలా మంది జ్వర బాధితులు వచ్చి చికిత్స పొందుతున్నారు. అందులో డెంగీ కేసులు కూడా ఉన్నాయి. అందరికీ మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. కావాల్సిన అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉన్నాయి.

 డా.జీవన్, జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్, మహబూబ్‌నగర్‌

అవగాహన కల్పిస్తున్నాం.. : ప్రతి పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాల పరిధిలో ఆశా, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు, వైద్యాధికారులు ఇంటింటికీ వెళ్లి పారిశుద్ధ్య ప్రాధాన్యం, డెంగీ, ఇతర విషజ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్లను వివరిస్తున్నాం. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని సూచిస్తున్నాం.

 డా.కృష్ణ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, మహబూబ్‌నగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని