logo

పాలమూరు అభివృద్ధికి కలిసి పనిచేస్తా

కేంద ప్రభుత్వ సహకారం లేకుండా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కాంగ్రెస్‌ నేతలు ఏమీ చేయలేరని ఎంపీ డీకే అరుణ అన్నారు.

Published : 05 Jul 2024 04:13 IST

లోక్‌సభ సభ్యురాలు డీకే అరుణ

అభినందన సభలో ఎంపీ డీకే అరుణను గజమాలతో సత్కరిస్తున్న భాజపా నాయకులు

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: కేంద ప్రభుత్వ సహకారం లేకుండా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కాంగ్రెస్‌ నేతలు ఏమీ చేయలేరని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఎంపీగా గెలుపొందాక మొదటిసారిగా గురువారం మహబూబ్‌నగర్‌ వచ్చిన డీకే అరుణను స్థానిక భాజపా నేతలు అన్నపూర్ణ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు ముగిశాయని, ఇక రాజకీయ కుట్రలు కుతంత్రాలు మానుకోవాలని హితవు పలికారు. ఉమ్మడి  మహబూబ్‌నగర్‌ జిల్లా అభివృద్ధి కోసం తాను పార్టీలకు అతీతంగా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అలాగని భాజపా నాయకులు, కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తే మాత్రం ఊరుకునేది లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతలు భారాస నేతల్లాగే వ్యవహరిస్తున్నారని, పార్టీలు మారాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారని, ఇకనైనా మానుకోకుంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తనను ఓడించడానికి కాంగ్రెస్‌ ఎన్ని కుట్రలు చేసినా, వ్యక్తిగతంగా తనను, తన కుటుంబాన్ని దూషించినా, చివరకు సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు జిల్లాకు వచ్చి సర్వశక్తులు ఒడ్డినా ఆడబిడ్డగా ఆదరించి గెలిపించారన్నారు. అనేక ఒత్తిళ్లు, అవమానాలను ఎదుర్కొని తన గెలుపునకు క్షేత్రస్థాయిలో పనిచేసిన భాజపా నాయకులు, కార్యకర్తలు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అంతుకుముందు డీకే అరుణకు అప్పన్నపల్లి రైల్వే వంతెన నుంచి అన్నపూర్ణ గార్డెన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు టి.ఆచారి, రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్‌రెడ్డి, భాజపా సీనయర్‌ నేతలు నాగూరావు నామాజీ, శ్రీవర్ధన్‌రెడ్డి, పద్మజారెడ్డి, కొండయ్య, ఎగ్గని నర్సింహులు, బాలరాజు, వీరబ్రహ్మాచారి, సుదర్శన్‌రెడ్డి, జయశ్రీ, సాహితీరెడ్డి, భాజపా మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని