logo

గోదాములు దూరం.. రైతుకు భారం

ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ పరంగా తగిన రేక్‌ పాయింట్లు (గూడ్స్‌ షెడ్లు) లేకపోవడంతో ఆర్థికపరంగా రైతులు అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది.

Published : 05 Jul 2024 04:12 IST

నారాయణపేట ప్రాంతంలో వరి సాగు (పాతచిత్రం)

న్యూస్‌టుడే-నారాయణపేట న్యూటౌన్, హన్వాడ : ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ పరంగా తగిన రేక్‌ పాయింట్లు (గూడ్స్‌ షెడ్లు) లేకపోవడంతో ఆర్థికపరంగా రైతులు అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. పాలమూరు ఐదు జిల్లాలుగా మారి ఐదేళ్లు అయినా నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల వ్యాపారులు పాత రేక్‌పాయింట్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలో అత్యధికులు వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. ప్రాజెక్టులు, కాల్వలు లేకపోవడంతో వర్షాధారం పంటలే దిక్కు. వీటికి అవసరమైన ఎరువులు, విత్తనాలు రేక్‌ పాయింట్‌ కేంద్రం నుంచి వ్యాపారులు తీసుకొస్తూ విక్రయిస్తున్నారు. పాత జిల్లాలో పాయింట్‌ కొత్తూరులో ఉండేది. అక్కడ గోదాములతో పాటు రోడ్డు, రైలు మార్గాలకు అనువుగా ఉండటంతో వ్యాపారులకు సులువుగా ఉండేది. తర్వాత జడ్చర్ల, గద్వాల పట్టణాల్లోనూ రేక్‌ పాయింట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రోడ్డుతో పాటు, రైల్వే మార్గాలను కలిగిన నారాయణపేట, నాగర్‌కర్నూల్‌లో మాత్రం ఇంత వరకు ఏర్పాటు చేయలేదు.

ఏటా కోట్ల అదనపు భారం

రేక్‌ పాయింట్ లేని మూలంగా ఈ జిల్లాల్లోని రైతులకు ఏటా రూ. కోట్ల అదనపు భారం పడుతుందని ఆయా జిల్లాల వ్యవసాయ శాఖ అధికారుల అంచనాలను బట్టి తెలుస్తుంది. స్థానికంగా విత్తనాలు, ఎరువులు విక్రయిస్తున్న వ్యాపారస్థులు సైతం రేక్‌ పాయింట్ నుంచే వాటిని కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల, జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్న రేక్‌ పాయింట్లు నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలోని మండలాలకు దూరం కావడంతో రవాణా భారాన్ని రైతులపై మోపి ధరలు నిర్ణయిస్తూ అమ్ముతున్నారు. దీంతో ఎరువులపై ధర ఎక్కువ పడుతుంది. ఇక్కడ కొనకుండా రేక్‌ పాయింట్ వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తే తక్కువ ధరకు లభిస్తాయని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. కొందరు ఎరువులు, విత్తనాలు లభిస్తాయన్న ఉద్దేశంతో రవాణా ఖర్చులను సైతం లెక్క చేయకుండా రేక్‌ పాయింట్‌ కేంద్రాలయిన జడ్చర్ల, గద్వాలల నుంచి తెచ్చుకుంటున్న మిగతా వారికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా ప్రభుత్వం ఆగ్రో రైతు సేవా కేంద్రాలకు ఎరువులపై రవాణా ఛార్జీలను ఇవ్వటం లేదు. దాంతో వారు ఎరువులపై రేట్లను పెంచి అమ్మటంతో రైతులపై భారం పడుతోంది. మొదట్లో హైదరాబాద్‌ అగ్రికల్చర్‌ కోఆపరేటివ్‌ అసోసియేషన్‌(హకా), డీసీఎంఎస్‌ వంటి సంస్థలకు రవాణా సదుపాయం కింద ప్రభుత్వం ఛార్జీలు చెల్లించేది. ఇప్పుడు ఇవ్వడం లేదు.

గోదాములు నిర్మించాలి

ఉమ్మడి జిల్లాలో రైల్వే మార్గం అభివృద్ధి చెందింది. అలంపూర్, వనపర్తిగేట్, మరికల్, మక్తల్, మాగనూర్, కృష్ణా రైల్వే లైను ఉంది. ఇటు బాలనగర్, మహబూబ్‌నగర్‌లకు కూడా రైల్వే సదుపాయం ఉంది. ఇక్కడ మరిన్ని గోదాములు నిర్మిస్తే రవాణా ఖర్చులు తగ్గుతాయి. ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గోదాములను నిర్మించి రేక్‌ పాయింట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. విత్తనాలు, ఎరువుల కొనుగోలు పరంగా రూ. కోట్లు ఆదా కల్పించినట్లు అవుతుంది.

ప్రతిపాదనలు పంపించాం

జనవరిలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. గోదాములు మంజూరైతే విత్తనాలు, ఎరువులు ఉత్పత్తి అయిన చోటు నుంచి నేరుగా పాయింట్ వద్దకు వస్తాయి. దీని వల్ల జిల్లా వ్యవసాయ శాఖకు రవాణా భారం తగ్గనుంది. రైతులకు తక్కువ ధరకు లభిస్తాయి.

 జాన్‌ సుధాకర్, డీఏవో, నారాయణపేట, నరసింహరావు, మార్క్‌ఫెడ్‌ ఎండీ, మహబూబ్‌నగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని