logo

ప్రాజెక్టుల పెండింగ్‌ పనులపై నివేదికలివ్వండి

పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టుల్లో పెండింగ్‌ పనులపై పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

Published : 05 Jul 2024 04:07 IST

 ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షిస్తున్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ

నాగర్‌కర్నూల్, న్యూస్‌టుడే: పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టుల్లో పెండింగ్‌ పనులపై పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలతో కలిసి గురువారం సమీక్షించారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం ఉంటుందని, దానిని ముందస్థుగా మంత్రులు ఈ సమావేశం నిర్వహించి అధికారులతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు. ఏయే ప్రాజెక్టు కింద ఎంత వరకు పనులు పెండింగ్‌లో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గాలవారీగా ప్రాజెక్టుల్లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేలు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, సంగంబండ, జురాల, తుమ్మిళ్ల, ఆర్డీఈఎస్, పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పనుల్ని వేగవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రులు ఆదేశించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో ప్రతి నియోజకవర్గంలో నాలుగు, ఐదు టీఎంసీల జలాశయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అన్ని ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ వేగవంతం చేయాలని మంత్రులు పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండు టీఎంసీల సామర్థ్యంతో పూర్తి స్థాయిలో పనులు చేపట్టాలన్నారు. డిండి ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవాలన్నారు. కాలువల్లో పేరుకుపోయిన పూడికతీత పనులు, పిచ్చి మొక్కల తొలగింపును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. జూరాల నుంచి కోయిలకొండ వరకు 20 టీఎంసీల నీటిని పంపింగ్‌ చేసేందుకు పరిశీలన చేసి ప్రతిపాదనలు తయారు చేయించాలని ఎమ్మెల్యేలు మంత్రులను కోరారు. సమావేశంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి,  వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డి, పర్నికరెడ్డి, శంకర్, శ్రీహరి, మేఘారెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జ, ఈఎన్‌సీలు అనిల్‌కుమార్, నాగేంద్రరావు, సీఈలు విజయభాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని