logo

ఎస్సీ గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు

ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో మిగులు సీట్లను భర్తీ చేసేందుకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

Published : 05 Jul 2024 04:06 IST

59 తరగతుల్లో చేరేందుకు అవకాశం
ఈ నెల 12 తుది గడువు

గురుకుల ప్రవేశ పరీక్ష రాస్తున్న విద్యార్థులను పరిశీలిస్తున్న
మహబూబ్‌నగర్‌ తూర్పు ప్రాంతీయ సమన్వయకర్త విద్యుల్లత (పాతచిత్రం)

అచ్చంపేట, న్యూస్‌టుడే: ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో మిగులు సీట్లను భర్తీ చేసేందుకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. గతంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి అందులో ప్రతిభ కనబరచిన విద్యార్థులను ఐదో తరగతిలో చేరేందుకు అవకాశం కల్పించారు. ఇంకా మిగులు సీట్లు ఉండటంతో వాటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎస్సీ గురుకులాల్లో 5-9 తరగతుల్లో ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి అధికారులు ప్రకటన జారీ చేశారు. గత నెల 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉంది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తరువాత పరిశీలించి అర్హులైన విద్యార్థులతో ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

వీరు అర్హులు

  • గతంలో పరీక్షకు హాజరై సీటు వచ్చినా కేటాయించిన గురుకుల పాఠశాలలో చేరని విద్యార్థులు
  • పరీక్ష రాసి సీటు పొందని వారు    
  • అనాథలు   
  • దివ్యాంగులు   
  • పరీక్షకు హాజరు కాని వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

దరఖాస్తు విధానం

ఎస్సీ గురుకులం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థి పూర్తి వివరాలను అందులో నమోదు చేయాలి. ఆన్‌లైన్‌లో మొదట రూ. 100 ఫీజు చెల్లించి దరఖాస్తులో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్, ఆధార్‌కార్డు, ఫొటో, చరవాణి నంబరు, విద్యార్థి సంతకం స్కాన్‌ చేసి దరఖాస్తుకు జతచేసి సబ్మిట్‌ చేయాలి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఉమ్మడి జిల్లాలోని వివిధ గురుకుల పాఠశాలల్లో ఆయా తరగతుల్లో ఉన్న ఖాళీల ఆధారంగా సీట్లు కేటాయించనున్నారు. మిగులు సీట్ల భర్తీకి విద్యార్థులు ఈ నెల 12లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ గురుకులాల మహబూబ్‌నగర్‌ తూర్పు ప్రాంతీయ సమన్వయకర్త విద్యుల్లత తెలిపారు. గురుకులాల్లో 5-9 తరగతి వరకు అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా బాల, బాలికలకు సీట్లు కేటాయిస్తామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని