logo

అనుమతిలేని వ్యాపారం.. అన్నదాతకు నష్టం

అన్నదాతల అమాయకత్వం, దిగుబడులపై ఆశ బయో కంపెనీలకు సిరులు కురిపిస్తుంటే... వాటిని రైతులకు అమ్ముతున్న డీలర్లకు లాభాలతో పాటు విహార యాత్రల్లో, విందులు.. చిందులు తొక్కిస్తున్నాయి.

Published : 05 Jul 2024 04:02 IST

విచ్చలవిడిగా బయో మందుల విక్రయాలు

  • అయిజ మండలంలో రైతులు పత్తి పంటపై పూత పిందె రావటం కోసం రూ.లక్షలు వెచ్చించి బయో మందులు వాడారు. అయినా ఫలితం లేకపోవడంతో పంటనే పీకేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సదరు రైతులు దీంతో కోలుకోలేని పరిస్థితిలోకెళ్లిపోయారు.
  • తాడూరు మండలంలో గతేడాది ఓ రైతు ఎన్ని మందులు కొట్టినా దిగుబడి రాక చివరి ప్రాణాలే తీసుకున్నాడు. ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే. ఇలా నష్టపోయిన రైతులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలోనే ఉంటున్నారు. వారిలో ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే విన్పిస్తాయి.

గద్వాల, అయిజ, న్యూస్‌టుడే: అన్నదాతల అమాయకత్వం, దిగుబడులపై ఆశ బయో కంపెనీలకు సిరులు కురిపిస్తుంటే... వాటిని రైతులకు అమ్ముతున్న డీలర్లకు లాభాలతో పాటు విహార యాత్రల్లో, విందులు.. చిందులు తొక్కిస్తున్నాయి. వాటిని తీసుకెళ్లి పంటపై పిచికారీ చేసిన రైతుకు ఫలితం రాకుంటే పంట నాశనం అయి చీకట్లు నింపుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పురుగు మందుల విక్రయ దుకాణాల్లో అనుమతి ఉన్న రసాయనిక మందుల కంటే అనుమతి లేని బయో మందుల విక్రయాలే ఎక్కవగా ఉంటున్నాయన్నది వ్యవసాయశాఖ అధికారులెరిగిన సత్యం. 

వరుసకడుతున్న కంపెనీలు: వానాకాలం సీజన్‌ మొదలు కావటంతో సాధారణ, విత్తన పత్తి పంటల సాగును రైతులు ఇప్పటికే ప్రారంభించారు. మిరప, ఇతర వాణిజ్య పంటలను ఆగస్టులో సాగు చేయనున్నారు. ఈ పంటలకు బయో మందులను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కంపెనీలు జిల్లాలోని డీలర్ల వద్దకు వరుస కడుతున్నాయి. రాష్ట్రంలోని హైదరాబాద్, ఆంధ్రాలోని గుంటూరు, కర్నూలు కేంద్రాలుగా ఉన్న బయో కంపెనీలు వీటిని ఎక్కువగా తయారు చేస్తున్నాయి. ఏటా సీజన్‌లో ఉమ్మడి జిల్లాలో రసాయనిక మందుల వ్యాపారం రూ.225 కోట్ల వరకు నడుస్తోంది. అందులో సగం బయో మందుల విక్రయాలే ఉంటాయన్నది వ్యవసాయ అధికారులకు సైతం తెలిసిన విషయమే.

అదనపు బహుమతులెన్నో..: ఉమ్మడి జిల్లాలో 2,800 వరకు పురుగు మందుల విక్రయ దుకాణాలున్నాయి. బయో మందులు విక్రయాల కోసం కంపెనీలు సీజన్‌ మొదట్లోనే డీలర్లను సంప్రదించి వారికి ఎంత స్టాకు అమ్మితే ఏయే బహుమతులు ఇచ్చేది, ఎక్కడెక్కడకు విహార యాత్రలకు తీసుకెళ్లెది చెప్పి డీలర్లకు చేరవేస్తుంటాయి. ఈసారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తి సాగు పెరగడంతో వీటి విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉంది. గతేడాది కేవలం రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు బయో మందులను విక్రయించిన గద్వాల ప్రాంతానికి చెందిన డీలర్లకు బంపర్‌ ఆఫర్‌ కింద విహార యాత్రకు గోవా, ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాయి. అత్యధికంగా వ్యాపారం చేసే డీలర్లను ఇతర దేశాలకు సైతం విహారయాత్రలకు తీసుకెళ్తున్నాయి.

అత్యధిక ఎమ్మార్పీ..: బయో మందుల ప్రభావం పంటలపై ఐదు రోజులు మాత్రమే ఉంటుంది. దీంతో వీటిని మళ్లీ మళ్లీ పిచికారీ చేయాల్సి ఉంటోంది. ఇది రైతుకు ఆర్థిక భారం. ధరలు కూడా అధికంగానే ఉంటాయి. పత్తిలో తెల్లదోమ నివారణకు వినియోగించే ఓ మందు ఎమ్మార్పీ రూ.3,570 ఉంటే మార్కెట్‌లో రూ.1,900కు లభిస్తోంది. రూ.వందల్లో తయారయ్యే మందులు రూ.వేలలో ఎమ్మార్పీ పెడుతున్న ప్రభుత్వం దృష్టి సారించడంలేదు. దీంతో కంపెనీల మార్కెట్‌ మాయాజాలం రైతుకు తెలియడంలేదు. రూ.300 బయో మందులకు రూ.1000 నుంచి రూ.2500 వరకు ఎమ్మార్పీ ముద్రించి విక్రయిస్తున్నారంటే రైతును ఏ విధంగా దోచుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

చర్యలు తీసుకుంటాం

రైతులు ఫిర్యాదు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని, నిరూపణ అయితే డీలర్ల విక్రయ లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తామని జోగులాంబ జిల్లా వ్యవసాయాధికారి గోవిందునాయక్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని