logo

పట్టుదలతో చదివారు.. ఫలితంతో మెరిశారు

నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కళాశాల విద్యార్థులు ప్రతిభతో కళాశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారు.

Updated : 05 Jul 2024 06:17 IST

ఎంఏవోలుగా ఎంపికైన పలువురు వ్యవసాయ కళాశాల విద్యార్థులు

బిజినేపల్లి, న్యూస్‌టుడే: నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కళాశాల విద్యార్థులు ప్రతిభతో కళాశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారు. 2024 జనవరిలో గుజరాత్‌లో జరిగిన నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ క్యాంపు కార్యక్రమానికి పాలెం కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. జూన్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన స్నాతకోత్సవంలో ఏజీబీఎస్సీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థులు పసిడి పతకాలు సాధించారు. 2017-21 మధ్య ఏజీబీఎస్సీ పూర్తి చేసిన మెహరాజ్‌ బేగం, మహేశ్వరిలు జూన్‌లో రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ చేతుల మీదుగా బంగారు పతకాలు అందుకున్నారు. తాజాగా టీజీపీఎస్సీ నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి ఫలితాలలో పాలెం కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు గెజిటెడ్‌ అధికారులుగా ఉద్యోగాలు సాధించి కళాశాలకు మంచి గుర్తింపును తీసుకొచ్చారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థుల మనోభావాలు ఇలా.


రైతు ఆదాయం పెంచేలా కృషి 

మాది నల్గొండ జిల్లా చిన్న అడిశర్లపల్లి గ్రామం. 2016-20 మధ్య ఏజీబీఎస్సీ పూర్తి చేశా. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి పరీక్షలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో 29వ ర్యాంకు సాధించా. నా విజయానికి కళాశాల అధ్యాపకులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతగానో తోడ్పడ్డారు. కళాశాలలో అందించిన నాణ్యమైన విద్యా బోధనతో ఉద్యోగం సాధించే మార్గం సులభమైంది. ఎంఏవోగా రైతులకు నూతన సాంకేతికతను పరిచయం చేస్తూ, వారి ఆదాయం పెంచేలా కృషి చేస్తా.

యాదగిరి యాదవ్, పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థి.


అధ్యాపకుల ప్రోత్సాహం మరువలేనిది

నాపేరు మణిదీపిక, మాది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చేర్వాల గ్రామం. పాలెం వ్యవసాయ కళాశాలలో 2016-20 మధ్య ఏజీబీఎస్సీ పూర్తి చేశాను. మండల వ్యవసాయాధికారి ఉద్యోగ నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచి ఏకాగ్రతతో పరీక్షకు సిద్ధమయ్యా. సబ్జెక్టులో వచ్చిన సందేహాలను కళాశాల అధ్యాపకుల ద్వారా నివృత్తి చేసుకున్నా. దీంతో వ్యవసాయాధికారిగా ప్రభుత్వ ఉద్యోగం సాధించా. రైతులకు ప్రభుత్వ రాయితీలు, సందేహాలను నివృత్తి చేస్తా.

 మణిదీపిక, పాలెం కళాశాల విద్యార్థిని


రైతులకు విలువైన సమాచారం

మాది నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం, చిత్తనూరు గ్రామం. వ్యవసాయ కుటుంబం. రైతు కష్టాలు తెలిసిన నాకు వ్యవసాయ అధికారి కావాలనే కోరిక బలంగా ఉండేది. అందుకు 2018-22 మధ్య ఏజీబీఎస్సీ పూర్తి చేశా. ఇటీవల వెలువడిన మండల వ్యవసాయాధికారి ఫలితాలలో ఉత్తీర్ణత సాధించి, ఉద్యోగం సాధించా. రైతులకు విలువైన సలహాలు, సూచనలు అందించి వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తా.

 అఖిలరెడ్డి, పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థిని


పేద విద్యార్థుల చదువుకు తోడ్పాటు

మాది నారాయణపేట జిల్లా ఊట్కూరు గ్రామం. తల్లిదండ్రులు గొర్రెల కాపరులు. 2017-21 మధ్య ఏజీబీఎస్సీ పూర్తి చేశా. కళాశాలలో సెమిస్టర్‌ ఫీజులు కూడా చెల్లించే ఆర్థిక పరిస్థితి ఉండేది కాదు. దీంతో కళాశాల అధ్యాపకులే సెమిస్టర్‌ ఫీజులు చెల్లించారు. దీంతో ఏజీబీఎస్సీ పూర్తి చేయగలిగాను. మండల వ్యవసాయ అధికారిగా ఉద్యోగం వచ్చింది. విధులు నిర్వర్తిస్తూ పేద విద్యార్థుల చదువుకు తోడ్పాటునందిస్తా.

 పొలప్ప, పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని