logo

ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దని నిరసనలు

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(భారాస)ని కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దంటూ గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కాంగ్రెస్‌ శ్రేణులు ధర్నాలు నిర్వహించాయి.

Published : 05 Jul 2024 03:46 IST

గద్వాలలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

గద్వాల గ్రామీణం, న్యూస్‌టుడే: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(భారాస)ని కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దంటూ గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కాంగ్రెస్‌ శ్రేణులు ధర్నాలు నిర్వహించాయి. ఓ యువకుడు సెల్‌ఫోన్‌ టవర్‌ ఎక్కి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్‌ చేశాడు. ధర్నాలో భాగంగా ముగ్గురు యువకులు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో కొన్నిరోజులుగా వైరల్‌ అవుతూ వస్తున్నాయి. దీనికి తోడు రాష్ట్రమంత్రి జూపల్లి కృష్ణారావుతో హైదరాబాద్, కర్నూలు కేంద్రాలుగా ఎమ్మెల్యేతో చర్చలు జరిపారని.. అమావాస్య తరువాత చేరిక ముహూర్తం ఖరారయ్యిందనే విషయం తెలియడంతో నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున గద్వాలలోని కాంగ్రెస్‌ పార్టీ క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి పాతబస్టాండ్‌ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా బొంబాయి ప్రసాద్‌ అనే కార్యకర్త సరిత నివాసం సమీపంలోని సెల్‌టవర్‌ ఎక్కాడు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో పట్టణ ఎస్సై శ్రీనివాస్‌తో పాటు డీఎస్పీ సత్యనారాయణ అక్కడికి వచ్చి కిందకు దిగి రావాలని మైకులో కోరారు. అయినా అతను దిగిరాలేదు. పోలీసు బందోబస్తు పెంచి ఫైరింజన్‌ రప్పించినా లాభం లేకపోయింది. చివరికి కొందరు కాంగ్రెస్‌ నాయకులు కాంగ్రెస్‌ అధిష్ఠానం తమకు న్యాయం చేస్తుందని కిందకు దిగిరావాలని కోరడంతో దిగివచ్చాడు.

టవర్‌ ఎక్కిన కాంగ్రెస్‌ కార్యకర్త 

ఆత్మహత్యాయత్నాలు

ఎమ్మెల్యే బండ్లను కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దంటూ ఓ యువకుడు సెల్‌ఫోన్‌ టవర్‌ ఎక్కగా.. అక్కడే నాయకులు ధర్నాలో భాగంగా బైఠాయించి అతనికి మద్దతుగా నిరసన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా గద్వాల మండలం అనంతాపురం గ్రామానికి చెందిన కార్యకర్త రహీమ్, దౌదర్‌పల్లికి చెందిన అనిల్, మల్డకల్‌ మండలం పాల్వాయి గ్రామానికి చెందిన కుర్వ అయ్యన్న అనే కార్యకర్తలు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా నాయకులు, పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని