logo

అతివల వ్యాపారాలకు పెద్దపీట

మహిళలు తాము సంపాదించిన దాంట్లో ఏళ్లుగా కొంత పొదుపు చేసుకుంటూ.. బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతున్నారు.

Published : 05 Jul 2024 04:14 IST

గద్వాల న్యూటౌన్, అయిజ, న్యూస్‌టుడే: మహిళలు తాము సంపాదించిన దాంట్లో ఏళ్లుగా కొంత పొదుపు చేసుకుంటూ.. బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతున్నారు. అయితే రుణాలు తీసుకున్న వారిలో సింహభాగం మంది వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఫలితంగా అతివలు ఆర్థికాభివృద్ధి సాధించడం లేదు. ఈ నేపథ్యంలో.. పొదుపు సంఘాల మహిళలను లక్ష్యాధికారులను చేయడం లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘మహిళా శక్తి’ పేరుతో మహిళల వ్యాపారాల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా జిల్లాల గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు అన్ని జిల్లాలకు లక్ష్యాలను నిర్దేశించగా, వాటిపై ఆసక్తి ఉన్న మహిళల వివరాలను సేకరించే చర్యలు ప్రారంభించారు.

మహిళా సంఘాల సభ్యుల సమావేశం

స్వశక్తి సంఘాలిలా..: ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 74 మండలాలుండగా, ప్రతి గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన మహిళలను పొదుపు సంఘాలుగా ఏర్పాటు చేశారు. ఇలా మొత్తం 46,346 సంఘాలుండగా, 5.20 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. వీటి పర్యవేక్షణ కోసం 2,013 గ్రామైక్య సంఘాలుండగా, సుమారు 4 వేల మందికి పైగా వీవోఏలున్నారు. వీరికి ఏటా బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి పథకాల ద్వారా రుణాలు ఇస్తున్నారు. వీటితో పాటు ఇకపై మహిళా శక్తి పేరుతో వ్యాపారాల ఏర్పాటుకు ప్రత్యేక రుణాలు అందించనున్నారు. ఇందుకోసం లక్ష్యాలను నిర్దేశించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో వ్యాపారాల ఏర్పాటుకు 5,345 యూనిట్లు లక్ష్యంగా, రూ.54.04 కోట్ల రుణాలు ఇవ్వనున్నారు. ఇందులో మహిళా క్యాంటిన్లు మొదలు, మీసేవా కేంద్రాల వరకు దాదాపు 13 రకాల వ్యాపారాల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 131 మీసేవా కేంద్రాలు మంజూరయ్యాయి. ఇంటర్‌ వరకు చదివి, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న మహిళా సంఘాల సభ్యులకు అవకాశం కల్పిస్తారు.

ఏర్పాటు ఇలా..

ప్రజల అవసరాలు, వనరుల లభ్యతకు అనుగుణంగా వ్యాపారాలను ఏర్పాటు చేయనున్నారు. మహిళా శక్తి కుట్టు కేంద్రాలు, చిన్న తరహా పరిశ్రమలు, ఆహార శుద్ధి కేంద్రాలు, మీసేవా కేంద్రాలు, మహిళా క్యాంటిన్లు, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్లు, పౌల్ట్రీ, మిల్చ్‌ ఎనిమల్‌ యూనిట్లు, సోలార్, ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, మొబైల్‌ ఫిష్‌ సెంటర్స్, పాల ఉత్పత్తి కేంద్రాలు, కస్టమ్‌ హియరింగ్‌ కేంద్రాలు తదితర యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఆసక్తి ఉన్న మహిళలకు శిక్షణ ఇప్పించి, రుణాలు అందించి ప్రోత్సహించనున్నారు.

లక్ష్యం మేరకు...

రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి పేరుతో అతివలకు వ్యాపారాలను ఏర్పాటు చేయనుంది. ఈమేరకు ఆదేశాలు వచ్చాయి. జిల్లాకు లక్ష్యం కూడా కేటాయించారు. దీని ప్రకారం వ్యాపారాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. వీటిని సద్వినియోగం చేసుకుంటే మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది.

నర్సింగరావు, డీఆర్డీవో, జోగులాంబ గద్వాల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని