logo

నడిగడ్డ నీటికష్టం తీరేదెన్నడో!

నడిగడ్డలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి నైరాశ్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఉన్న ప్రాజెక్టుల్లో జూరాల తప్ప మిగిలినవన్నీ కొనసాగుతున్న ప్రాజెక్టులుగానే ఉన్నాయి.

Published : 04 Jul 2024 05:14 IST

ఏళ్లుగా కొనసాగుతున్న పథకాలు

గట్టు ఎత్తిపోతలలో భాగంగా రాయపురం వద్ద జలాశయ నిర్మాణం

ధరూరు, గట్టు, న్యూస్‌టుడే: నడిగడ్డలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి నైరాశ్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఉన్న ప్రాజెక్టుల్లో జూరాల తప్ప మిగిలినవన్నీ కొనసాగుతున్న ప్రాజెక్టులుగానే ఉన్నాయి. వాటిని పూర్తి చేయటానికి అవసరమైన నిధులు రాబట్టేందుకు చేయాల్సినంత కృషి ఇక్కడి ప్రజాప్రతినిధులు చేయలేకపోతున్నారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో ఖరీఫ్‌ సాగుకు ఒక పక్క రైతులు నారుమడులు పోసుకొని సిద్ధం అవుతుండగా సవాలక్ష సందేహాలు వారిలో వ్యక్తమవుతున్న పరిస్థితి జిల్లాలో ఉంది. 

ర్యాలంపాడు మరమ్మతులదే సమస్య: నెట్టెంపాడు పథకంలో 4.2 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన ర్యాలంపాడు జలాశయం నీటినిల్వను లీకేజీల కారణంగా 2 టీఎంసీలకు కుదించిన పరిస్థితి. మరమ్మతులకు సంబంధించి కేవలం సర్వేలు, పరిశీలన, ప్రతిపాదనలకే రెండేళ్ల పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. తాజాగా రెండు నెలల కిందట మరోసారి నిపుణులు జలాశయంలో నీరంతా ఖాళీ అయిన తర్వాత పరిశీలించినట్లు తెలిసింది. ఆనకట్ట అంతర్భాగంలో వాడిన నల్లమట్టి, సిమెంటు నిర్మాణాల్లో నాణ్యతా లోపాలు కారణంగా సీపేజీలు ఇంకా పెరిగే అవకాశం ఉందని తేల్చినట్లు సమాచారం. ఈ విషయం సాగునీటి శాఖ అధికారులు బయటకు రానీయడంలేదనే విమర్శలున్నాయి. దాన్ని బట్టి చూస్తే ఈసారి రెండు టీఎంసీలు కూడా నిల్వ సాధ్యమయ్యేనా అన్న సందేహం వ్యక్తమవుతోంది. అదే పథకంలో ఇప్పటికి 99 ప్యాకేజీతో 105, 104 ప్యాకేజీలు, మినీ జలాశయాల వద్ద అలుగుల నిర్మాణం తదితర పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. నెట్టెంపాడు లిఫ్ట్‌-1లో మూడు పంపులు అందుబాటులో ఉన్నా ఒక పంపుతో మాత్రమే నీటిని తోడిపోసే స్థితి ఈ ప్రాజెక్టుది. 

తుమ్మిళ్లది అదే దారి: రూ.783 కోట్లతో చేపట్టిన తుమ్మిళ్ల పథకానికి అదే దారి. తుంగభద్ర నది వరదల సమయంలో ఒక పంపుద్వారా నీటిని తోడిపోసి ఆర్డీఎస్‌ కింద ఉన్న చివరి ఆయకట్టుకు నీటి సమస్యలేకుండా చూడాలన్నది ప్రాజెక్టు ఉద్దేశం. దాంతో పాటు మల్లమ్మకుంట వల్లూరు, జూలేకల్‌ వద్ద జలాశయాల నిర్మాణం ప్రతిపాదించారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో నిర్మాణానికి సంబంధించి జీవో కాపీలను విడుదల చేశారు. కానీ వాటి ప్రగతి మాత్రం కనిపించటం లేదు. జలాశయాల నిర్మాణం పూర్తయితే ఆర్డీఎస్‌ కింద కాకుండా అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టును ప్రగతి బాట పట్టించాల్సిన నాయకులు, వాటికి మంజూరు ఇచ్చి అమల్లోకి తేవాల్సిన ప్రభుత్వం సమన్వయంతో సాగితేనే సాధ్యం అవుతుంది. అలంపూరు నియోజకవర్గంలో ఆ పరిస్థితి కనిపించటం లేదు.

గట్టుకు నిధుల సమస్య..

ఇక గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా ఎడారి ప్రాంతమైన గట్టు, కేటీదొడ్డి మండలాల పరిధిలో 30 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని ఇవ్వటానికి రూ.568 కోట్లతో పథకాన్ని ప్రతిపాదించారు. రాయపురం వద్ద జలాశయం నిర్మాణం, ర్యాలంపాడు జలాశయం నుంచి నీటితోడిపోతకు పంపింగ్‌ కేంద్రాల ఏర్పాటుతో పథకం రూపకల్పన చేశారు. కానీ పనులు మందగమనంతో సాగుతున్నాయి. పంపింగ్‌ కేంద్రం పనుల్లో ఆశించిన ప్రగతి కనిపించటం లేదు. జలాశయం నిర్మాణం పనులు చేయాలా వద్దా అన్న సందేహాలతో గుత్తేదారులు కొనసాగిస్తున్నట్లుగా అక్కడి పరిస్థితి ఉంది. దానికి తోడు ఇప్పటి వరకు రావాల్సిన పెండింగ్‌ బిల్లులు గుత్తేదారులకు అందకపోవటంతో వారి కూడా పనుల పట్ల నిరాసక్తత కనబరుస్తున్నారని అధికారులే చెబుతున్నారు. ఒక వేళ ఇప్పటికిప్పుడు గట్టు పథకానికి నిధులు ఇచ్చి పూర్తి చేయించినా ర్యాలంపాడు జలాశయంలో నీటి సామర్థ్యం మేర లేకుంటే గట్టు పథకం విఫలమయ్యే పరిస్థితి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇటు నెట్టెంపాడు పథకం ర్యాలంపాడు జలాశయం అటు గట్టు ఎత్తిపోతల పథకంపైనా ప్రభుత్వం దృష్టి సారించి నిధులు మంజూరు ఇస్తేనే ఇవి సాధ్యమవుతాయి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని